టీఆర్‌ఎస్‌ది కుటుంబపాలన
– అభివృద్ధి సాధ్యంకాదు
– బిజెపి జాతీయాధ్యక్షుడు అమిత్‌షా
నల్లగొండ,జూన్ 10(జనంసాక్షి):
తెలంగాణలో ఉన్నది కేసీఆర్ కుటుంబపాలన అని, కుటుంబపాలనతో రాష్ట్ర అభివృద్ధి ఎప్పటికీ సాధ్యం కాదని బిజెపి జాతీయాధ్యక్షుడు అమిత్ షా తెలిపారు. తెలంగాణ అభివృద్ది బిజెపికే సాధ్యమని, అందుకోసం ప్రజలు బిజెపికి అండగా నిలవాలని బిజెపి జాతీయాధ్యక్షుడు అమిత్ షా పిలుపునిచ్చారు. బిజెపి పాలిత రాష్టాల్ల్రో, కేంద్రంలో అభివృద్ది శరవేగంగా, అవినీతికి దూరంగా సాగుతోందన్నారు. గత రెండేళ్ల పాలనలో ప్రజా సమస్యల పరిష్కారంలో మోదీ ప్రభుత్వం పూర్తిగా విజయవంతమైందని భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్ షా అన్నారు. నల్గొండ జిల్లా సూర్యాపేటలో నిర్వహించిన ‘వికాస్ పర్వ్’ బహిరంగ సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. తెలంగాణలో కూడా అభివృద్ది జరగాలంటే బిజెపిని బలోపేతం చేయాలన్నారు. కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని అమిత్‌షా స్పష్టం చేశారు. రాష్ట్రంలో అభివృద్ధి కోసం రూ.90వేల కోట్లు ఇచ్చినట్లు చెప్పారు. తెలంగాణను అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తీర్చిదిద్దాలన్నదే బిజెపి లక్ష్యమన్నారు. తెలంగాణలో కుటుంబ పాలన కొనసాగుతోందని అమిత్ షా ఆరోపించారు. కుటుంబ పార్టీలతో అభివృద్ధి జరగదనే విషయాన్ని ప్రజలు గమనించాలని సూచించారు. తెలంగాణలో ప్రతి గ్రామంలో 24 గంటల విద్యుత్ అందుతోందా?, ప్రతి గ్రామానికి రహదారులు నిర్మించారా? ఆస్పత్రులు ఉన్నాయా? ప్రతి చేనుకు నీరు అందుతోందా? యువతకు ఉద్యోగాలు లభిస్తున్నాయా? అని ప్రశ్నించారు. భాజపా అధికారంలో ఉన్న ప్రతిచోట ఈ పనులు జరుగుతున్నాయన్నారు. బిజెపి పాలిత రాష్టాల్ల్రో అభివృద్ది శరవేగంగా సాగుతోందని అన్నారు. తెలంగాణలో కూడా తాము ఇదే కోరుకుంటున్నామని అన్నారు. తెలంగాణ అభివృద్ధి మోదీ నేతృత్వంలోని బిజెపితో సాధ్యమని అమిత్ షా పేర్కొన్నారు. రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కోసం భాజపా బలోపేతం చేయాలని కోరారు. దేశవ్యాప్తంగా ప్రజలతో నేరుగా ప్రధానిని దేశానికి అందించిన ఘనత భాజపాదేనని అమిత్ షా అన్నారు. గత ప్రభుత్వాలు అవినీతి, కుంభకోణాల రూపంలో రూ.12లక్షల కోట్లు కొల్లగొట్టాయని ఆరోపించారు. మోదీ ప్రధాని అయ్యాక అవినీతి, కుంభకోణాలు, లంచగొండితనం లేని దేశంగా మార్చగలిగామన్నారు. మోదీ పాలనను ప్రపంచ దేశాలన్నీ కొనియాడుతున్నాయని… అందువల్లే ఆయన ఎక్కడికి వెళ్లినా ఘనస్వాగతం లభిస్తోందన్నారు. ఏ దేశం వెల్లినా మోడీకి రెడ్ కార్పెట్ స్వాగతం లభిస్తోందన్నారు. గత 60 ఏళ్లలో కాంగ్రెస్ దేశానికి ఏం చేసిందో చెప్పాలని అమిత్‌షా డిమాండ్ చేశారు. యూపీఏ ప్రభుత్వంలో ఆకాశం, నేల, సముద్రం అనే తేడా లేకుండా అన్నింటిపైనా కుంభకోణాలు చేశారని ఆరోపించారు. గత ప్రధాని ఎక్కడికి వెళ్లినా ప్రసంగం ఒకేలా ఉండేదని ఎద్దేవా చేశారు. మోదీ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకే కాంగ్రెస్ పార్టీ విమర్శలు చేస్తోందన్నారు.
కాంగ్రెస్‌పై విమర్శలు
రాహుల్ బాబాకు ఇటాలియన్ కళ్లద్దాలు ఉన్నాయని, అందుకే ఆయనకు వాస్తవాలు ఏవీ కనిపించడం లేదని బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా ఎద్దేవా చేశారు. రెండేళ్ల క్రితం తెలంగాణ రాష్ట్రంతో పాటు ఎన్డీయే ప్రభుత్వం కూడా ఏర్పడిందని గుర్తుచేశారు. తెలంగాణ వాసులకు కోటి కోటి నమస్కారాలు తెలిపారు. ఈ రెండేళ్లలో దేశానికి ఏమిచ్చారని సోనియాగాంధీ ప్రశ్నించారని.. మరి విూ కుటుంబం 60 ఏళ్లలో దేశానికి ఏమిచ్చిందో దేశ ప్రజలకు చెప్పాలని నిలదీశారు. మేం మాట్లాడే ప్రధానమంత్రిని దేశానికి ఇచ్చాం. విూ ప్రధానమంత్రి గొంతు విూకు, విూ అబ్బాయికి తప్ప దేశంలో వేరే ఎవరికీ వినిపించేది కాదు మా ప్రభుత్వం విూద రెండేళ్లలో ఒక్క అవినీతి ఆరోపణ కూడా విూరు సైతం చేయలేకపోయారు కానీ విూ ప్రభుత్వంలో ఒక్క ఏడాదిలోనే 12 లక్షల కోట్ల కుంభకోణాలకు పాల్పడి దేశ ఖజానాను లూటీ చేశారు అంటూ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో అంతరిక్షం నుంచి సముద్ర అంతర్భాగం వరకు ప్రతిచోటా కుంభకోణాలకు పాల్పడ్డారు. రాహుల్ బాబా తెలుసు కదా.. సరిహద్దుల్లో అప్పుడు, ఇప్పుడు కూడా కాల్పులు జరుగుతున్నాయి.. తేడా ఏముందని అడుగుతున్నారు. ఆయన కళ్లకు ఇటాలియన్ కళ్లద్దాలు ఉన్నాయి. అందుకే తేడా తెలియట్లేదు. అంతకుముందు పాకిస్థాన్ సైన్యమే కాల్పులు మొదలుపెట్టేది, అదే ముగించేది. కానీ ఇప్పుడు పాక్ ప్రారంభించినా, మన సైన్యం కాల్పులు ముగిస్తోంది వాళ్లు బుల్లెట్లతో ప్రారంభిస్తే.. మనం ట్యాంకులతో సమాధానం ఇస్తున్నాం. మార్పు రాహుల్ గాంధీకి ఎందుకు తెలియడం లేదంటే.. ఆయన కళ్లకు ఇటాలియన్ అద్దాలున్నాయి అని అన్నారు. రెండేళ్లలో దేశ ఆర్థిక స్థితిని పట్టాలవిూదకు తెచ్చింది బీజేపీ ప్రభుత్వమే అన్నారు. స్కిల్ ఇండియా, స్టార్టప్ ఇండియా, మేకిన్ ఇండియా లాంటి పథకాలతో లక్షలాది మంది పేదలకు ఉద్యోగావకాశాలు కల్పించినది మోదీ సర్కారే అన్న విషయాన్ని గుర్తు చేశారు. ఒక్క సంవత్సరంలోనే 3.84 కోట్ల మంది నిరుద్యోగులకు లక్ష రూపాయల చొప్పున రుణ దుపాయం కల్పించాం. పేదరికాన్ని పారద్రోలడానికి 22 కోట్లకు పైగా జనధన యోజన అకౌంట్లను తెరిపించాం. అమెరికా పార్లమెంటులో నరేంద్రమోదీకి లభించిన స్వాగతం మోదీకి వచ్చింది కాదు, బీజేపీది కాదు.. తెలంగాణ ప్రజలు, దేశ ప్రజలకు లభించిన స్వాగతం. మన్మోహన్ సింగ్ విదేశీ పర్యటనలకు వెళ్లినపుడు కూడా మౌనంగా ఉండి, రెండు కాగితాల్లో రాసిన ప్రసంగాన్ని చదివేవారు.
మలేసియాలో మాట్లాడాల్సింది థాయ్‌లాండ్ లోను, అక్కడ మాట్లాడాల్సింది ఇక్కడ మాట్లాడేవారు
మోదీ మాత్రం అలా కాదు.. అక్కడికక్కడ మాట్లాడతారు అంటూ వివరించారు. రెండేళ్లలో మోదీ ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధికి 90 వేల కోట్ల నిధులు ఇచ్చింది. ఎవరైనా అడిగినా.. అందులో ప్రతి పైసాకు లెక్క చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. తెలంగాణను దేశంలోనే బాగా అభివృద్ధి చెందిన రాష్ట్రంగా చూడాలని ఆకాంక్షిస్తున్నాం. కుటుంబపాలన ఉన్న పార్టీల వల్ల దేశానికి, రాష్టాల్రకు కూడా ఎలాంటి అభివృద్ధి జరగదు. అధికార పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం లేకపోతే తెలంగాణ కూడా అభివృద్ధి చెందదని అన్నారు. బీజేపీ ప్రభుత్వాలు ఉన్న మధ్యప్రదేశ్, గుజరాత్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, మహారాష్ట్ర, జార్ఖండ్.. అన్నిచోట్లా ఇవన్నీ ఉన్నాయని, అందుకే అక్కడి ప్రజలు ప్రతిసారీ బీజేపీని ఎన్నుకుంటున్నారు 1వ శతాబ్దంలో కూడా నల్లగొండ వాసులకు ఫ్లోరైడ్ లేని నీళ్లు అందడం లేదు,5 ఏళ్ల యువకుడు కూడా ముసలి రూపం వచ్చేస్తుంటే.. గుండె మండిపోతోంది. ఓవైసీ నేతృత్వంలో సాగుతున్న మత మౌఢ్యానికి వ్యతిరేకంగా పోరాడగల సామర్థ్యం కేసీఆర్ సర్కారుకు లేదు.. బీజేపీకి మాత్రమే ఉంది. తెలంగాణ ప్రజలకు విన్నవించేది ఒకటే.. తెలంగాణ సమగ్రాభివృద్ధి, బంగారు తెలంగాణ బీజేపీ కార్యకర్తల వల్లే సాధ్యం అన్నారు. తెలంగాణ బలంగా ఉండాలి.. బీజేపీ బలంగా ఉండాలి,మోదీ చేతులను విూరు బలోపేతం చేస్తారా, బీజేపీని బలోపేతం చేస్తారా మార్పు దిశగా పయనించాలంటే రెండు చేతులూ పైకెత్తి చెప్పండి.. భారత్ మాతాకీ జై, వందే మాతరం అంటూ ముగించారు. షా ప్రసంగాన్ని బిజెపి ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు అనువాదం చేశారు. కార్యక్రమంలో బిజెపి తెలంగాణ అధ్యక్షుడు లక్ష్మణ్, మాజీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి, దిలీప్ కుమార్, ఎమ్మెల్సీ రాం చంద్రరావు తదితరులు పాల్గొన్నారు.