టీఆర్‌ఎస్‌లో చేరిన ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి
మహబూబ్‌నగర్,ఫిబ్రవరి 16(జనంసాక్షి):మహబూబ్ నగర్ జిల్లా నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి టిఆర్‌ఎస్ లో చేరారు. మంగళవారం ఆయన్ను పార్టీ కండువా కప్పి కేసీఆర్ పార్టీలోకి ఆహ్వానించారు. గత 25 సంవత్సరాల నుంచి నారాయణపేట నియోజకవర్గం నిరాదరణకు గురైందని, నియోజకవర్గ అభివృద్ధి కోసమే తాను టీఆర్‌ఎస్ లో చేరుతున్నట్లు రాజేందర్ రెడ్డి చెప్పారు. నారాయణపేట అభివృద్ధికి సహకరిస్తామని సీఎం కేసీఆర్ హావిూ ఇచ్చారని తెలిపారు. ఈ నేపథ్యంలో నెలాఖరులో హైదరాబాద్‌లో భారీ బహిరంగ సభను నిర్వహించనున్నారు. ఈ సభా వేదికగా మిగతా ఎమ్మెల్యేలు కూడా టీఆర్‌ఎస్‌లో చేరనున్నారు. మొన్న వరంగల్, నిన్న జీహెచ్‌ఎంసీ, ఇవాళ నారాయణఖేడ్ ఎన్నికల్లో టిఆర్‌ఎస్ కు ప్రజలు బ్రహ్మరథం పట్టారని రాజేందర్ రెడ్డి గుర్తుచేశారు. సీఎం కేసీఆర్ తోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమని ప్రజలు నమ్ముతున్నారని చెప్పారు. బంగారు తెలంగాణ నిర్మాణంలో భాగస్వామిని అయ్యేందుకే టిఆర్‌ఎస్ లో చేరుతున్నానని తెలిపారు. టీడీపీని ఆంధ్రాపార్టీగానే ప్రజలంతా చూస్తున్నారని రాజేందర్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ బేగంపేటలోని ముఖ్యమంత్రి అధికార నివాసంలో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి హరీష్ రావు, అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి, ఇటీవల టిఆర్‌ఎస్ లో చేరిన టీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకరరావు, ఎమ్మెల్యే వివేకానంద ఉన్నారు. నారాయణఖేడ్ ఎన్నికల్లో విజయకేతనం ఎగురవేసిన టీఆర్‌ఎస్.. వరంగల్, ఖమ్మం జిల్లాల్లో జరిగే పురపాలక ఎన్నికలపై దృష్టి సారిస్తూ వడిగా అడుగులు వేస్తోంది.