టీడీపీ పోరాటాలపై కుట్ర జరుగుతుంది
– కుట్రదారులకు ఎంపీలు పావులుగా మారద్దు
– ఎంపీ మాటలను కట్ అండ్ పేస్ట్ చేశారు
– బాధ్యులను గుర్తించి కఠినంగా శిక్షిస్తాం
– ఎంపీల టెలీకాన్ఫరెన్స్‌లో ఏపీ సీఎం చంద్రబాబు
అమరావతి, జూన్29(జనం సాక్షి ) : విభజన హావిూలు నెరవేర్చేలా కేంద్రంపై టీడీపీ చేస్తున్న పోరాటాల చుట్టూ కుట్రలు జరుగుతున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. శుక్రవారం టీడీపీ ఎంపీలతో సీఎం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. కడప ఉక్కుదీక్ష, కాకినాడ ధర్మపోరాట సభపై బాబు దిశానిర్దేశం చేశారు. కొంతమంది వీడియో క్లిప్పింగ్‌లతో తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతీ ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలన్న ఆయన సరదాగా కూడా ఎవరూ పోరాటాన్ని తక్కువ చేసేలా మాట్లాడకూడదన్నారు. సీఎం రమేష్ చేపట్టిన కడప ఉక్కుదీక్ష నేపథ్యంలో ఎంపీ మురళీ మోహన్ సరదాగా చేసిన వ్యాఖ్యలు వైరల్ అవడంతో ఎంపీలతో చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. 5కోట్ల మంది ప్రజలు తమ పోరాటంపై ఆశలు పెట్టుకున్నారని, ఎంపీలంతా ఒకే మాట, ఒకే బాటగా ఉండాలని సూచించారు. ప్రజల కోసం జరుగుతున్న పోరాటానికి తూట్లు పొడిచే కుట్రలు జరుగుతున్నందున ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలన్నారు. రాష్టాన్రికి హాని చేసే వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలని అన్నారు. కుట్రదారుల చేతిలో ఎంపీలు పావులుగా మారకూడదని సూచించారు. అడ్డంకులను అధిగమించి కేంద్రం చేస్తున్న అన్యాయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఎంపీలకు తెలిపారు. ఎంతో కీలకమైన ఈ సమయంలో ఏమరపాటుగా వ్యాఖ్యలు చేయడం ఎంతమాత్రమూ తగదన్నారు. అయితే ఏపీ భవన్‌లో జరిగిన సంఘటన గురించి ఎంపీలు సీఎంకు వివరించారు. తమ మాటలను వక్రీకరించారని ఎంపీలు మురళీమోహన్, అవంతి శ్రీనివాస్ అన్నారు. 75ఏళ్ల వయస్సు ఉన్నప్పటికీ వారం రోజులు దీక్ష చేయగలను అన్న వ్యాఖ్యలను కట్ చేశారని, వాళ్లకు కావాల్సిన వ్యాఖ్యలను అతికించారని చెప్పారు. కట్ అండ్ పేస్ట్ క్లిప్పింగ్ విడుదల చేశారని ఎంపీలు మురళీమోహన్,అవంతి శ్రీనివాస్ తెలిపారు.