టీమిండియా ఈ సమస్యలు అధిగమించేనా..
కోల్‌కత్తా ,నవంబర్ 28 ఈడెన్ గార్డెన్స్‌లో జరగనున్న మూడో టెస్టుకు ముందు భారత్ అధిగమించాల్సిన సమస్యలుచాలానే ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనవి ప్రధానంగా మూడు… ఓపెనర్ల ఫామ్ , మిడిలార్డర్ వైఫల్యం , పార్ట్‌టైమ్ స్పిన్నర్ల ప్రభావం లేకపోవడం.. ప్రస్తుతం ఇంగ్లాండ్‌పై ప్రతీకారం తీర్చుకోవడమే ప్రధాన లక్ష్యంగా భావిస్తోన్న ధోనీసేన దానికి తగ్గట్టుగా ఆడడం లేదు. అహ్మాదాబాద్ టెస్టులో ప్రత్యర్థిపై ఆధిపత్యం కనబరిచినా… ముంబై మ్యాచ్‌లో మాత్రం చేతులెత్తేసింది. ఈ నేపథ్యంలో ఈడెన్‌వేదికగా జరగనున్న మూడో టెస్ట్ మన జట్టుకు చాలా కీలకంగా మారింది.
ఏ జట్టుకైనా భారీస్కోరు సాధించాలంటే ఓపెనర్లు రాణించడం చాలా ముఖ్యం. వారు వేసిన పునాదిపైనే ఇన్నింగ్స్ నిర్మించాల్సి ఉంటుంది. అలాంటిది ఆరంభం సరిగా లేకుంటే విజయంపై ఏ విధంగానూ ఆశలు పెట్టుకోలేం. దీని ప్రకారం భారత ఓపెనింగ్ జోడీ సెహ్వాగ్-గంభీర్ పూర్తి స్థాయిలో గాడిన పడలేదు. తొలి టెస్టులో సెంచరీ చేసిన వీరూ… తన వందో టెస్టులో మాత్రం విఫలమయ్యాడు. అటు గంభీర్ కూడా రాణించినా… తన స్థాయిని ఇంకా అందుకోవాల్సి ఉంది. వీరి వైఫల్యం జట్టుపై ప్రభావం చూపుతోంది. ఇదే సమయంలో ఇంగ్లాండ్ జట్టుకు చక్కని ఆరంభాలు లభిస్తున్నాయి. తొలి టెస్టులో ఓడినా… వారికి ఓపెనర్ కుక్ మంచి బిగెనింగ్‌నే ఇచ్చాడు. రెండో టెస్టులో సెంచరీతో సత్తా చాటాడు. ఇక్కడే రెండు జట్ల ఆటకు తేడా కనిపిస్తోంది. ఆరంభం సరిగా ఉంటే తప్ప విజయాన్ని ఆశించే పరిస్థితి లేదని స్పష్టంగా తెలుస్తోంది.
ఇదిలా ఉంటే జట్టు విజయాలలో మిడిలార్డర్ కూడా కీలకపాత్ర పోషిస్తోంది. కష్టాల్లో ఉన్న సమయంలో వారే ఆదుకోవాల్సి ఉంటుంది. ఈ సిరీస్‌లో చటేశ్వర పుజారా తప్పించి మిగిలిన ఆటగాళ్ళు స్థాయికి తగినట్టు ఆడిన పరిస్థితి లేదు. సచిన్ టెండూల్కర్ తన పూర్ ఫామ్ కొనసాగిస్తుంటే… విరాట్ కోహ్లీ , యువరాజ్‌సింగ్ కూడా అదే దారిలో నడస్తున్నారు. లోయర్ ఆర్డర్‌లో ధోనీ కూడా విఫలమవుతున్నాడు. ఈ నేపథ్యంలో బ్యాట్స్‌మెన్ బాధ్యతాయుతంగా ఆడితే తప్ప జట్టు భారీస్కోర్లు సాధించడం కష్టం.
టీమిండియాకు మరో ఆందోళన హర్భజన్‌సింగ్ పేలవ ప్రదర్శన… దాదాపు ఏడాది తర్వాత జాతీయ జ్టటులోకి ఎంపికైన టర్బోనేటర్ ఏ మాత్రం ప్రభావం చూపలేకపోతున్నాడు. స్పిన్‌కు అనుకూలించిన వాంఖేడే పిచ్‌పై కేవలం రెండే వికెట్లతో సరిపెట్టుకున్నాడు. మిగిలిన ఇద్దరు స్పిన్నర్ల కంటే చాలా సీనియర్ ఆటగాడైన భజ్జీ ఈ విధంగా ఆడడం మేనేజ్‌మెంట్‌కు ఇబ్బంది కలిగిస్తోంది. భజ్జీ కోసం ఒక పేస్ బౌలర్‌ను కూడా ధోనీ త్యాగం చేసినా ఫలితం దక్కలేదు. ఈ నేపథ్యంలో కోల్‌కత్తా మ్యాచ్ టీమ్‌తో పాటు హర్భజన్‌కూ చాలా కీలకమే.
ఇక పార్ట్‌టైమ్ బౌలర్లు ఈ సిరీస్‌లో తమ సత్తా చూపలేకపోయారు. ఇప్పటి వరకూ జరిగిన రెండు టెస్టుల్లోనూ వికెట్లు తీసిన దాఖలాలు లేవు. ప్రధాన స్పిన్నర్లకు వికెట్లు దక్కని పరిస్థుతుల్లో వీరిని ఉపయోగించినా… ఫలితం మాత్రం రాలేదు. వీరిపై భారీ ఆశలు పెట్టుకోకున్నా… గతంలో పలుసార్లు తమ మ్యాజిక్ చూపిన సత్తా సెహ్వాగ్, యువీలకు ఉంది. దీంతో ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్ భారీ భాగస్వామ్యాలకు బ్రేక్ వేయాలంటే జట్టులో పార్ట్‌టైమ్ బౌలర్లు తమ ప్రభావం చూపాల్సిన అవసరముంది.