టీ ఎంపీలూ నాటకాలొద్దు

ప్రజలు గమనిస్తున్నరు : టీ జేఏసీ
ట్యాంక్‌బండ్‌పై తెలంగాణ యోధుల విగ్రహాలు పెట్టాలె
సడక్‌ బంద్‌తో సత్తా చాటుదాం
హైదరాబాద్‌, మార్చి 10 (జనంసాక్షి) :
తెలంగాణ ప్రాంత కాంగ్రెస్‌ ఎంపీలు ఇంకా నాటకాలతో ఇక్కడి ప్రజలను మభ్యపెట్టవద్దని టీ జేఏసీ హెచ్చరిం చింది. ఆదివారం హైదరాబాద్‌లో నిర్వహించిన జేఏసీ స్టీరింగ్‌ కమిటీ సమావేశంలో పాల్గొన్న ముఖ్యనేతలు ఈనెల 21న నిర్వహించనున్న సడక్‌ బంద్‌ సహా ఇతర అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ తెలంగాణ కోసమంటూ ఎంపీలు ఆడుతున్న నాటకాలను ఈ ప్రాంత ప్రజలు గమనిస్తున్నారని హెచ్చరించారు. దొంగనాటకాలను కట్టి పెట్టి ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం చిత్తశుద్ధి పోరాడాలని పిలుపునిచ్చారు. అలాంటి వారిని ప్రజలు గుండెల్లో పెట్టుకుంటారని తెలిపారు. ఇంకా నాటకాలతో కాలయాపన చేస్తూ పదవులను అంటిపెట్టుకొని ఉంటామంటే తగిన గుణపాఠం తప్పదని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం పది జిల్లాల్లోని నాలుగున్నర కోట్ల ప్రజల ఆకాంక్ష అనే విషయాన్ని మరిచి, రేపటి ఎన్నికల్లో ఆ ప్రజలే ఓట్లు వేయాలనే విషయాన్ని విస్మరించి తెరచాటు వ్యవహారాలు నడుపుకుంటూ బయటికి డాబికాలు మాట్లాడటాన్ని ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. ట్యాంక్‌బండ్‌పై తెలంగాణ పోరాట యోధుల విగ్రహాలు ఏర్పాటు చేయాలని కోరారు. మొదలు కొమురం భీమ్‌ విగ్రహ ఏర్పాటుకు చర్యలు
ప్రారంభించాలని డిమాండ్‌ చేశారు. తెలంగాణ చరిత్రను వక్రీకరించేలా, చరిత్రకారులంతా సీమాంధ్ర ప్రాంతానికి చెందిన వారే అన్నట్టుగా పాలకులు నిస్సిగ్గుగా తెలంగాణ నడిబొడ్డుపై వారి విగ్రహాలు ఏర్పాటు చేసి తమ కుసంస్కారాన్ని చాటు కున్నారని దుయ్యబట్టారు. ఎంతో పోరాట చరిత్ర ఉన్న తెలంగాణ యోధుల విగ్రహాల ఏర్పాటుకు ఇప్పటికైనా పూనుకోకుంటే తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. ఈనెల 21న నిర్వహించనున్న సడక్‌బంద్‌తో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆకాంక్షను ఢిల్లీ పీఠాలు కదిలేలా చాటి చెబుతామన్నారు. హైదరాబాద్‌-బెంగళూర్‌ హైవేను దిగ్బంధించేందుకు ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో టీ జేఏసీ, విద్యావంతుల వేదిక, టీఎన్‌జీవోస్‌ నాయకులు శ్రీనివాస్‌గౌడ్‌, మల్లేపల్లి లక్ష్మయ్య, దేవిప్రసాద్‌, రసమయి బాలకిషన్‌ తదితరులు పాల్గొన్నారు.