టెన్త్‌ పరీక్షలకు పక్కాగా ఏర్పాట్లు

హాల్‌టిక్కెట్‌ చూపితే ఉచిత ప్రయాణం
జనగామ,మార్చి13(జ‌నంసాక్షి): పదో తరగతి వార్షిక పరీక్షలు ఈ నెల 16 నుంచి ప్రారంభమై ఏప్రిల్‌ 3వ తేదీ వరకు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లా విద్యాశాఖ అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. జిల్లాలో మొత్తం 41 పరీక్షా కేంద్రాల ద్వారా రెగ్యులర్‌, సప్లిమెంటరీ కలిపి మొత్తం 7,644 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. ఇందులో రెగ్యులర్‌ విద్యార్థుల కోసం 40కేంద్రాలు, సప్లిమెంటరీ విద్యార్థులకు ఒక సెంటర్‌ ఏర్పాటు చేశారు. ఉదయం 9గంటల నుంచి విద్యార్థులను పరీక్ష కేంద్రాలకు అనుమతిస్తారు. ఉదయం 9.30 గంటల తర్వాత ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించరు. కాగా టెన్త్‌ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు తమ గ్రామాల నుంచి పరీక్ష కేంద్రం వరకు నడిచే ఆర్టీసీ బస్సులో హాల్‌టికెట్‌ చూపించి ఉచితంగా ప్రయాణించే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. అయితే బస్‌ పాస్‌లు లేని విద్యార్థులకు హాల్‌టికెట్లపై ఉచిత ప్రయాణానికి సంబంధించి మౌఖిక ఆదేశాలు మాత్రమే అందాయని, పరీక్షల సమయానికి లిఖితపూర్వక ఉత్తర్వులు అందవచ్చని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. పరీక్షల నిర్వహణకు ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు ఇద్దరు ప్లయింగ్‌ స్వాడ్‌లు, 41 సిట్టింగ్‌ స్కాడ్‌, 41 డిపార్ట్‌మెంట్‌ బృందాలు, ప్రతీ 20 మంది విద్యార్థులకు ఒక ఇన్విజిలేటర్‌ చొప్పున 700 మందితోపాటు మొత్తం 850 మంది సిబ్బందిని నియమించారు. పరీక్ష ప్రారంభానికి అరగంట ముందుగానే కేంద్రంలోకి అనుమతిస్తారు. ఉష్ణోగ్రతలు పెరగడంతో తాగునీరు, ప్రత్యేక వైద్య సదుపాయం, రవాణా సౌకర్యాలను ఏర్పాటు చేస్తున్నారు. ఈ సారి ప్రత్యేకంగా ప్రతీ కేంద్రానికి తహసీల్దార్‌ లేదా జిల్లాస్థాయి అధికారిని సిట్టింగ్‌ స్క్వాడ్‌గా నియమిస్తున్నారు. పరీక్షలను పరిశీలించేందుకు రాష్ట్రస్థాయి నుంచి జిల్లా పరిశీలకులుగా ఒకరు
ఉంటారు. జిల్లాల పునర్విభజన తర్వాత 2017లో తొలిసారి టెన్త్‌ ఫలితాల్లో 93.56 శాతం ఉత్తీర్ణత సాధించి రాష్ట్రంలోని 31 జిల్లాల్లో 3వ స్థానంలో నిలువగా గత ఏడాది రాష్ట్రంలో 12వ స్థానం దక్కింది. మునుపటి స్థానాన్ని దక్కించుకునేందుకు జిల్లా విద్యాశాఖ అధికారి యాదయ్య ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ప్రత్యేక తరగతుల నిర్వహణ, బోధనా విధానంలో మార్పులు తేవడంతో ఈసారి మెరుగైన ఫలితాలు వస్తాయని భావిస్తున్నారు.