టెన్త్ పరీక్షలకు సన్నాహాలు
భారీగా ఏర్పాట్లు చేసిన అధికారులు
ఉత్తీర్ణత పెంచేందుకు కృషి
కామారెడ్డి,మార్చి1(జనంసాక్షి): మార్చి 16వ తేదీ నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు
కొనసాగుతాయి. రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి ఫలితాల్లో జిల్లా వెనుకబాటులోనే ఉంది. ఈసారి జిల్లాలో ఉత్తీర్ణత శాతం పెరిగేలా మొదట్నుంచి యంత్రాంగం పకడ్బందీ చర్యలు తీసుకున్నది. గతేడాది కేవలం ప్రభుత్వ పాఠశాలల్లో 87.95 శాతం ఉత్తీర్ణ సాధించారు. పారదర్శకంగా పరీక్షలను నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మాస్ కాపీయింగ్‌కు చోటు లేకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని విద్యా శాఖ ఉన్నతాధికారులు సైతం మార్గదర్శకాలు వెలువరించారు. మాస్ కాపీయింగ్‌కు అవకాశం లేకుండా పకడ్బందీగా పదో తరగతి పరీక్షల పక్రియను పూర్తి చే యాలన్న సంకల్పంతో జిల్లా విద్యా శాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. జిల్లాలో పదో తరగతి పరీక్షలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని జిల్లా విద్యాశాఖ అధికారి రాజు తెలిపారు. ఇప్పటికే పరీక్షా కేంద్రాల గుర్తింపు పూర్తి కాగా ప్రశ్నా పత్రాలు సైతం జిల్లాకు చేరుకున్నాయి. ఆయా మండలాల్లోని పోలీసు స్టేషన్లలో ప్రశ్నా పత్రాలను భద్ర పరిచాము. మాస్ కాపీయింగ్‌కు ఆస్కారం లేకుండా పరీక్షలు నిర్వహిస్తాము. ప్రశాంత వాతావరణంలో పరీక్షలను పూర్తి చేసేందుకు పకడ్బందీ చర్యలు తీసుకుంటామన్నారు. పదో తరగతి పరీక్షలకు జిల్లా వ్యాప్తంగా 60 కేంద్రాలను ఏర్పాటు చేస్తుండగా ఈ సారి ఐదు ప్రైవేటు స్కూళ్లకు సైతం పరీక్ష కేంద్రాలకు అనుమతి ఇచ్చారు. జిల్లా వ్యాప్తంగా 12,767 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలకు హాజరుకానుండగా ఇందులో బాలికలే ఎక్కువ మంది ఉన్నారు. మరోవైపు పదో తరగతి ప్రశ్నా పత్రాలు ఇప్పటికే జిల్లాకు చేరుకోగా వాటిని ఆయా పోలీసు స్టేషన్లలో భద్రపరిచారు. జిల్లాలోని 22 మండలాల్లో 60 కేంద్రాలను ఏర్పాటు చేశారు. గతంతో పోలిస్తే ఈ సారి పరీక్ష కేంద్రాల సంఖ్యను కుదించారు. దీంతో పాటుగా ప్రత్యేకంగా కొన్ని ప్రైవేటు స్కూల్ యాజమాన్యాలకు సైతం పరీక్షా కేంద్రాలకు అనుమతులు ఇవ్వడం చర్చనీయాంశం అవుతోంది. జిల్లా వ్యాప్తంగా పదో తరగతి వార్షిక పరీక్షకు భారీ మొత్తంలో హాజరు కానున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్, కేజీబీవీలు, మోడల్ స్కూళ్లు, రెసిడెన్షియల్ స్కూళ్లు అన్నీ కలుపుకుని 12,767 మంది పదో తరగతి విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. వీరిలో 6,201 మంది బాలురు, 6,566 మంది బాలికలు ఉన్నారు. 184 జిల్లా పరిషత్, ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో 8,128 మంది విద్యార్థులు, 17 కేజీబీవీ పాఠశాలల్లో 688 మంది, 6 మోడల్ స్కూళ్లలో 573 మంది, 12 తెలంగాణ రాష్ట్ర గురుకుల పాఠశాలల్లో 832 మంది, 2 ఎయిడెడ్ స్కూళ్లలో 59 మంది, 63 ప్రైవేటు పాఠశాలల్లో 2,487 మంది పదో తరగతి విద్యార్థులున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో 10,280 మంది పదో తరగతి విద్యార్థులు ఉండగా… ప్రైవేటు విద్యా సంస్థల్లో పదో తరగతి చదువుతున్న వారి సంఖ్య 2,487 మంది మాత్రమే ఉంది. జిల్లా మొత్తంలో పదో తరగతి పరీక్షలకు హాజరవుతున్న వారిలో అత్యధిక మంది బాలికలే ఉండడం ప్రాధాన్యతను సంతరించుకున్నది. ఇదిలా ఉండగా పదో తరగతి ప్రశ్నా పత్రాలు ఇప్పటికే జిల్లాకు చేరుకున్నాయి. ఆయా పోలీసు స్టేషన్లలో సీజ్ చేసిన బాక్సులలో ప్రశ్నా పత్రాలను భద్రపరిచి పోలీసుల రక్షణలో ఉంచారు. ఇందులో భాగంగా 625 మందిని ఇన్విజిలెటర్స్గా నియమించారు. వీరిలో ప్లయింగ్ స్కాడ్స్, రూట్ ఆఫీసర్స్‌లతో పాటుగా పర్యవేక్షణకు 60 మందిని చీఫ్ సూపరిండెంట్లు, 60 మందిని డిపార్ట్మెంటల్ ఆఫీసర్లను నియమించారు. 21 మంది కస్టోడియన్ ఆఫీసర్లు, 21 మం ది జాయింట్ కస్టోడియన్ ఆఫీసర్లు సైతం పరీక్షల్లో పాలుపంచుకుంటా రు. రెవెన్యూ, పోలీసు, విద్యా శాఖల నుంచి ఒక్కొక్కరితో నాలుగు బృం దాలను నియమించగా వీరు ప్లయింగ్ స్కాడ్ బాధ్యతలు నిర్వర్తిస్తారు.