టెస్ట్‌ క్రికెట్‌కు పాంటింగ్‌ గుడ్‌ బై పెర్త్‌ టెస్ట్‌తో కెరీర్‌ ముగించనున్న ఆసిస్‌ క్రికెటర్‌

పెర్త్‌ ,నవంబర్‌ 29  : అంతర్జాతీయ క్రికెట్‌కు మరో దిగ్గజం వీడ్కోలు పలికాడు. ఆస్టేల్రియా జట్టు మాజీ కెప్టెన్‌ రికీ పాంటింగ్‌ రిటైర్మెంట్‌ ప్రకటించాడు. రేపటి నుండి దక్షిణాఫ్రికాతో జరిగే మూడో టెస్ట్‌ తన కెరీర్‌లో చివరిదని పేర్కొన్నాడు. గత కొంతకాలంగా పాంటింగ్‌ పరుగులు చేయడానికి తీవ్రంగా ఇబ్బందిపడుతున్నాడు. దీంతో అతని రిటైర్మెంట్‌పై ఊహాగానాలు వచ్చినప్పటకీ… ఆసీస్‌ సెలక్టర్లు నమ్మకముంచడంతో వచ్చే ఏడాది జరిగే యాషెస్‌ సిరీస్‌ వరకూ కొనసాగుతాడని భావించారు. అయితే అనూహ్యంగా పంటర్‌ తన నిర్ణయాన్ని ప్రకటించాడు. పెర్త్‌ టెస్టుకు ఒకరోజు ముందు టెస్ట్‌ క్రికెట్‌ నుండి వైదొలుగుతున్నట్టు తెలిపాడు. సెలక్టర్ల నుండి ఎటువంటి ఒత్తిడీ లేదని , ఇది తన సొంత నిర్ణయమని ఈ ఆసీస్‌ మాజీ సారథి స్పష్టం చేశాడు. గత కొన్ని వారాలుగా తన ప్రదర్శన జట్టుకు ఏమాత్రం ఉపయోగపడడం లేదని , అందుకే తప్పుకోవాలని నిర్ణయించుకున్నట్టు చెప్పాడు. క్రికెట్‌తో తన అనుబంధం కొనసాగుతుందని , వీడ్కోలు నిర్ణయం పూర్తిగా ఆటతీరుపై ఆధారపడి తీసుకున్నదేనని తెలిపాడు. తన కెరీర్‌ మొత్తం మధ్ధతుగా నిలిచిన ఆసీస్‌ క్రికెట్‌ బోర్డుకు ,సహచరులకు , అభిమానులకు , కుటుంబసభ్యులకు పాంటింగ్‌ కృతజ్ఞతలు తెలియజేశాడు. 1995లో టెస్ట్‌ క్రికెట్‌ అరంగేట్రం చేసిన పాంటింగ్‌ ఇప్పటి వరకూ 167 మ్యాచ్‌లలో 13366 పరుగులు చేశాడు. అందులో 41 సెంచరీలు , 62 హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి. రేపు సౌతాఫ్రికాతో ప్రారంభం కానున్న టెస్టుతో పంటర్‌ అరుదైన రికార్డును అందుకోబోతున్నాడు. ఆస్టేల్రియా తరపున అత్యధిక టెస్టులు ఆడిన క్రికెటర్‌ మార్క్‌వా రికార్డును పాంటింగ్‌ సమం చేయనున్నాడు. దీనితో పాటు టెస్టుల్లో పలు రికార్డులు తన పేరిట లిఖించుకున్నాడు. ప్రపంచ క్రికెట్‌లో 13 వేలకు పైగా పరుగులు చేసిన ముగ్గురు ఆటగాళ్ళలో పాంటింగ్‌ ఒకడు. అలాగే టెస్టుల్లో 10 వేలకు పైగా పరుగులు చేసిన మూడో ఆసీస్‌ ఆటగాడిగా ఘనత సాధించాడు. పాంటింగ్‌ గత ఏడాదే వన్డే కెరీర్‌కు గుడ్‌బై చెప్పాడు. కాగా టెస్టుల నుండి తప్పుకున్నప్పటకీ… డొమెస్టిక్‌ క్రికెట్‌లో ఆడతానని వెల్లడించాడు. టాస్మానియా తరపున దేశవాళీ క్రికెట్‌లో కొనసాగుతానని , బిగ్‌బాష్‌లో కూడా ఆడనున్నట్టు తెలిపాడు. మరోవైపు పాంటింగ్‌ నిర్ణయంపై ఆసీస్‌ క్రికెటర్లు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. రికీ ఈ ఏడాదే వీడ్కోలు తీసుకుంటాడని తాము అనుకోలేదని కెప్టెన్‌ మైకేల్‌ క్లార్క్‌ అన్నాడు. తన ఆటతీరుతో జట్టులోని ఆటగాళ్ళందరికీ అతను స్ఫూర్తిగా నిలిచాడని క్లార్క్‌ వ్యాఖ్యానించాడు. అటు క్రికెట్‌ ఆస్టేల్రియా కూడా పాంటింగ్‌ను ప్రశంసలతో ముంచెత్తింది. 17 ఏళ్ళ కెరీర్‌లో ఆసీస్‌కు ఎన్నో చారిత్రక విజయాలందించిన పంటర్‌ లేని లోటు తీర్చలేనిదని క్రికెట్‌ ఆస్టేల్రియా పేర్కొంది. అటు వన్డేల్లోనూ తనదైన ముద్ర వేసిన పాంటింగ్‌ 375 మ్యాచ్‌లో 13704 పరుగులు చేశాడు. దీనిలో 30 సెంచరీలు , 82 హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి. కెప్టెన్‌గా జట్టుకు రెండుసార్లు (2003 , 2007) లలో వన్డే ప్రపంచకప్‌ అందించిన పాంటింగ్‌ మొత్తం నాలుగు వరల్డ్‌కప్‌లు ఆడాడు. మొత్తం విూద రేపటి మ్యాచ్‌లో అంతర్జాతీయ క్రికెట్‌ నుండి తప్పుకోనున్న పాంటింహ్‌రు విజయంతో ఘనంగా వీడ్కోలు పలకాలని ఆసీస్‌ క్రికెటర్లు భావిస్తున్నారు.