ట్రస్మా ఆధ్వర్యంలో ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయులకు ఘన సన్మానం
రామకృష్ణాపూర్, (జనంసాక్షి):
క్యాతన్ పల్లి మున్సిపాలిటీ పరిధిలోని తవక్కల్ హైస్కూల్లో మంచిర్యాల జిల్లా ప్రైవేట్ పాఠశాలల సంఘం ట్రస్మా అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లాలోని అ
ప్రైవేట్ పాఠశాలల నుండి ఒక్క టీచర్ చొప్పున విశిష్ట సేవలు అందిస్తున్న 100 మంది ఉపాధ్యాయులను పూలమాలలతో, శాలువాతో సత్కరించి జ్ఞాపికలు అందజేసి వారిని ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా విద్యాశాఖ అధికారి ఎస్. వెంకటేశ్వర్లు, గ్రంథాలయ చైర్మన్ రేణిగుంట ప్రవీణ్, ఎంఈఓ జాడి పోచం, క్యాతన్ పల్లి చైర్పర్సన్ జంగం కళ, ఉత్తమ ఉపాధ్యాయులను సన్మానించారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలవేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ట్రస్మా జిల్లా అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా ప్రైవేటు ఉపాధ్యాయులను ప్రభుత్వం గుర్తించకపోయినా ప్రతీ సంవత్సరం ట్రస్మా ఆధ్వర్యంలో వారిని ఉత్తమ ఉపాధ్యాయులుగా సన్మానిస్తున్నామని, బడ్జెట్ ప్రైవేట్ పాఠశాలలకి సంపాదన ముఖ్యం కాదని ఉపాధ్యాయుల శ్రేయస్సు ప్రధానమని, ట్రస్మా ఉపాధ్యాయుల కోసం నిరంతరం కష్టపడుతుందని అన్నారు. ఉపాధ్యాయ దినోత్సవం ప్రభుత్వం ప్రభుత్వ ఉపాధ్యాయులతో పాటు ప్రైవేటు ఉపాధ్యాయులను కూడా గుర్తించినందుకు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలియజేశారు. జిల్లా కలెక్టర్ భారతి హోళికేరి విద్యాశాఖకు ఆదేశాలు జారీ చేసి ప్రైవేటు ఉపాధ్యాయులను కూడా ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపిక చేసి ప్రభుత్వం ద్వారా సన్మానించాలని నిర్ణయం తీసుకున్నందుకు జిల్లా కలెక్టర్ భారతి హోళీ కేరి కి ట్రస్మా మంచిర్యాల జిల్లా సంఘం తరఫున కృతజ్ఞతలు తెలియజేశారు. జిల్లా విద్యాశాఖ అధికారి ఎస్. వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఉపాధ్యాయ వృత్తి పవిత్రమైందని, అంకిత భావంతో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలన్నారు. ప్రైవేటు ఉపాధ్యాయులు, గవర్నమెంట్ ఉపాధ్యాయులు అనే భేదభావం లేదని, అయితే ఇంతకాలం సమయాభావం చేత ప్రభుత్వం తరఫున ప్రైవేటు ఉపాధ్యాయులని సన్మానించలేకపోయామని, ఇకనుండి ప్రతి సంవత్సరం గవర్నమెంట్ ఉపాధ్యాయులతో పాటు ప్రైవేటు ఉపాధ్యాయులను కూడా సత్కరిస్తామని, ఇది తమ బాధ్యత అని తెలిపారు. గ్రంథాలయ చైర్మన్ రేణిగుంట ప్రవీణ్ మాట్లాడుతూ ఉపాధ్యాయ వృత్తి చేపట్టడం అంతా ఆశామాషీ కాదని తెలిపారు. విద్యారంగ అభివృద్ధిలో ముఖ్యపాత్ర పోషిస్తున్న గురువుల కృషిని కొనియాడారు. కోవిడ్ 19 తర్వాత విద్యార్థులు విద్యాలోపంతోనే కాకుండా, క్రమశిక్షణ రాహిత్యంతో బాధపడుతున్నారని, వారిని చక్కదిద్దడం ఉపాధ్యాయులకు ఒక సవాల్ గా మారిందని తెలిపారు. ఎంఈఓ జాడి పోచయ్య మాట్లాడుతూ ఉపాధ్యాయులు ఎంతో ధైర్యంతో స్వీకరించి విద్యార్థులు భవిష్యత్తుని చక్కదిద్దుతున్నారని కొనియాడారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కో కన్వీనర్ రాజారెడ్డి మాట్లాడుతూ కార్పొరేట్ విద్యా సంస్థలకు ర్యాంకులు, పాయింట్స్ పరమావధని, కానీ మా బడ్జెట్ ప్రైవేట్ స్కూల్స్ కి విద్యార్థుల వ్యక్తిత్వ వికాసం, సర్వతో ముఖాభివృద్ధి ప్రధానమని తెలిపారు. తవక్కల్ పాఠశాలలో గత సంవత్సరం 10వ, తరగతిలో 10/10 జి పి ఏ చిన్న ఎనిమిది మంది విద్యార్థులను వారి తల్లిదండ్రులను తవక్కల విద్యాసంస్థల చైర్మన్ అబ్దుల్ అజీజ్ ఘనంగా సన్మానించారు.10/10 జీ.పీ.ఏ.పొందిన విద్యార్థులకు ఒక్కొక్కరికి పదివేల చొప్పున నగదు అందజేశారు. తవక్కల్ విద్యాసంస్థల చిన్నారులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు చూపరులను అలరించాయి. ఈ కార్యక్రమంలో క్యాతన్ పల్లి మున్సిపల్ వైస్ చైర్మన్ ఎర్రం విద్యాసాగర్ రెడ్డి, కౌన్సిలర్ ప్రేమలత, ట్రస్మా జిల్లా ఉపాధ్యక్షులుమల్లెత్తులరాజేంద్రపాని, ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్, కోషాధికారి శ్యాంసుందర్ రెడ్డి, ట్రస్మా సంఘ సభ్యులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.