ట్రాఫిక్ నియంత్రణ కోసం విప్లవత్మక మార్పులు అవసరం – శేరిలింగంపల్లి మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ తాడిబోయిన రామస్వామి యాదవ్”
ప్రస్తుత సమాజంలో ఇబ్బందిగా మారిన సమస్యల్లో ట్రాఫిక్ సమస్య ఒకటని, దాని నివారణ, నియంత్రణ కోసం విప్లవాత్మక మార్పులు చేపట్టకతప్పదని శేరిలింగంపల్లి మాజీ కౌన్సిలర్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ తాడి బోయిన రామస్వామి యాదవ్ స్పష్టంచేశారు. ఈమేరకు మంగళవారం మియాపూర్ ట్రాఫిక్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ని కలిసి ఓ వినతిపత్రాన్ని అందజేశారు. ఇందులో భాగంగా సదరు కాపీని ట్రాఫిక్ ఏసిపి హనుమంతరావుకి అందజేయడం జరిగింది. అనంతరం ఏర్పాటుచేసిన సమావేశంలో రామస్వామి యాదవ్ మాట్లాడుతూ… ప్రస్తుత సమాజంలో ప్రజలకు తలనొప్పిగా మారిన సమస్యల్లో ముందు వరసలో నిలిచేది ట్రాఫిక్ సమస్య అని, దీనివల్ల ఉద్యోగులు, కార్మికులు, ప్రయాణికులు చివరకు పాదచారులుసైతం పడరాని పాట్లు పడుతూ నిత్యం ప్రత్యక్ష నరకాన్ని చవిచూస్తున్నారని అన్నారు. ప్రతి మనిషి మునగడ కోసం పోరాటం సాగించడం తప్పనిసరి అని, అయితే ఏపని చేయాలన్నా అందుకు రవాణా తప్పనిసరి అని అన్నారు. మనిషి దైనందిన జీవితంలో కీలక భూమిక పోషించే రవాణా వ్యవస్థని అస్తవ్యస్తంగా మారితే ఇక ఆ మనిషి దినచర్య ఎంత గందరగోళంగా ఉంటుందో ఊహించవచ్చన్నారు. ప్రభుత్వ వ్యవస్థలు, విధానం సవ్యంగా సాగాలంటే ముందు సమాజంలో ఓ కదలిక ఉండాలన్నారు. అందుకే రోజురోజుకీ మనుషులను అనేక ఇబ్బందుల వైపు నెడుతూ జీవితానికి గుదిబండలా మారిన రవాణా వ్యవస్థపై తాను ప్రత్యేక దృష్టిని కేటాయించడం జరిగిందని, ఇందులో భాగంగానే శేరిలింగంపల్లి ప్రధాన రహదారుల్లో ఒకటైన ముంబై జాతీయ రహదారిపై ట్రాఫిక్ నియంత్రణకు అధికారులతో కలిసి ముందుకు సాగడానికై తగిన కార్యాచరణను రూపొందించుకోవడం జరిగిందన్నారు. ప్రయాణికులకు పెద్ద తలనొప్పిగామారిన ట్రాఫిక్ సమస్య ముంబై జాతీయ రహదారిపై చందానగర్ గాంధీ విగ్రహం వద్ద, గంగారం హనుమాన్ టెంపుల్ వద్ద అధికంగా ఉంటుందని, ఉదయం, సాయంత్రం వేళల్లో ఈ రెండు ప్రదేశాలను దాటాలంటే గొప్ప సాహసమే చేయాల్సి ఉంటుందన్నారు. అందుకే వారి ఇబ్బందులను తొలగించే క్రమంలో ఈ రెండు ప్రదేశాలలో ” క్రాస్ వాక్” విధానాన్ని ప్రవేశపెట్టి తక్షణమే అమలు చేయాల్సిన పరిస్థితి ఉందని, తద్వారా రోజూ ప్రత్యక్ష నరకాన్ని చవిచూస్తున్న ప్రజలకు కొంతమేరనైనా ఉపశమనం లభిస్తుందని రామస్వామి యాదవ్ ధీమాను వ్యక్తంచేశారు. తన ఆలోచనను మియాపూర్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ తో పంచుకోవడం జరిగిందని… ట్రాఫిక్ ఏసీపీకిసైతం వినతిపత్రం రూపంలో వివరించడం జరిగిందని… అందువల్ల త్వరలోనే సమస్యనుండి ముక్తి లభిస్తుందని ఆయన ఆశాభవం వ్యక్తం చేశారు.