డబుల్‌ బెడ్‌రూంలు త్వరితగతిన పూర్తి చేయండి

2

పేదల బస్తీలు కాలనీలుగా మారాలి

సీఎం కేసీఆర్‌ సమీక్ష

హైదరాబాద్‌, ఆగస్టు 14 (జనంసాక్షి)రాష్ట్రంలో డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌ రావు ఆదేశించారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో నిర్మించే ఇండ్ల కోసం వేర్వేరు పద్దుతులు అవలంభించాలని చెప్పారు. హైదరాబాద్‌ నగరంలో పేదల బస్తీలను అన్ని మౌలిక సదుపాయాలతో మంచే లే అవుట్‌ కాలనీలుగా తీర్చిదిద్దాలని అన్నారు. బలహీన వర్గాల గృహ నిర్మాణాలకు సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో కొత్త విధానం అవలంభిస్తున్నందున సమైక్య ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఉన్న పద్దుతులను కొనసాగించాల్సిన అవసరం లేదని సిఎం స్పష్టం చేశారు. డబుల్‌ బెడ్‌ రూం ఇండ్ల నిర్మాణంపై సిఎం క్యాంపు కార్యాలయంలో ఆదివారం సమీక్ష నిర్వహించారు. మున్సిపల్‌ శాఖ మంత్రి కెటి రామారావు, గృహ నిర్మాణ శాఖ మంత్రి ఎ ఇంద్రకరణ్‌ రెడ్డి, ఎమ్మెల్యేలు ఎర్రబెల్లి దయాకర్‌రావు, గంగుల కమలాకర్‌, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌ శర్మ, మున్సిపల్‌ శాఖ ముఖ్య కార్యదర్శి ఎంజి గోపాల్‌, హౌజింగ్‌ శాఖ కార్యదర్శి అశోక్‌, జిహెచ్‌ఎంసి కమిషనర్‌ బి జనార్ధన్‌ రెడ్డి, హైదరబాద్‌, రంగారెడ్డి కలెక్టర్లు రాహుల్‌ బొజ్జా, రఘునందన్‌ రావు తదితరులు పాల్గొన్నారు.

జిల్లాలో రెండు లక్షలు, హైదరాబాద్‌ నగరంలో లక్ష ఇండ్ల నిర్మాణం కోసం అనువైన ప్రణాళికలు సిద్ధం చేసి అమలు చేయాలన్నారు. ప్రస్తుతం ఉన్న బస్తీలను మంచి కాలనీలుగా మార్చాలని చెప్పారు. ఇప్పటికే నిర్మాణంలో ఉన్న గృహ సముదాయాల పనులను వేగవంతం చేయాలని కోరారు. నగరంలో పేదల బస్తీలను అన్ని వసతులతో కూడిన కాలనీలుగా మార్చే క్రమంలో మంచినీరు, అంతర్గత రహదారులు, డ్రైనేజీలు, విద్యుత్‌ లాంటి మౌలిక సదుపాయాలు కూడా ప్రభుత్వ పరంగానే కల్పించాలని చెప్పారు. ఇంకా పేదల కోసం ఇండ్లు నిర్మించేందుకు గృహ నిర్మాణ శాఖ వద్ద స్థలాలతో పాటు దిల్‌, టిఎస్‌ఐఐసి ఆధీనంలో ఉన్న భూములు కూడా వినియోగించాలని చెప్పారు. అవసరమైతే ప్రభుత్వ భూములను కూడా కేటాయించడానికి సిద్దమన్నారు.గ్రామీణ ప్రాంతాల మాదిరిగా హైదరాబాద్‌లో ఇండ్ల నిర్మాణం కోసం ఎక్కువ స్థలం దొరకదు కాబట్టి, బహుళ అంతస్థుల భవనాలు నిర్మించాలని సిఎం సూచించారు. మూడు నుంచి తొమ్మిది అంతస్తుల వరకు బహుళ అంతస్తుల భవనాలు నిర్మించాలని చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా పెద్ద కట్టడాలకు మైవాన్‌ టెక్నాలజీని ఉపయోగిస్తున్నందున హైదరాబాద్‌ ఇండ్ల నిర్మాణం కోసం ముందుకొచ్చే సంస్థలకు ఆ టెక్నాలజీ వాడుకోవడానికి అనుమతించాలని చెప్పారు. ఇండ్ల నిర్మాణానికి ముందుకొచ్చిన సంస్థలతో చర్చలు జరిపి, ఒప్పందాలు ఖరారు చేయాలని ఆదేశించారు. సులభంగా తొందరగా ఇండ్లు కట్టడానికి ఏ పద్దతి అందుబాటులో ఉంటే దాన్ని అవలంభించాలని ఆదేశించారు. బలహీన వర్గాలు, పేదల కోసం కట్టే ఇండ్లకు అవసరమయ్యే ఇసుకను ఉచితంగా అందజేయాలని నిర్ణయించామని, సిమెంటు కంపెనీలతో మాట్లాడి ఫ్యాక్టరీ ధరకే సిమెంటు కూడా ఇప్పించే ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించారు. హైదరాబాద్‌ నగరంలో నిర్మాణంలో ఉన్న వాంబే, జెఎన్‌ఆర్‌ఎం గృహాలను త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పారు. దీనికి కావాల్సిన నిధులు మంజూరు చేయడానికి సిఎం సంసిద్దతత వ్యక్తం చేశారు. రాజీవ్‌ స్వగృహ ద్వారా నిర్మించిన ఇండ్లను ప్రభుత్వ ఉద్యోగులకు, పోలీసులకు కేటాయించాలని ఇప్పటికే నిర్ణయించినందున, దీనికి సంబంధించిన విధి విధానాలు రూపొందించాలని చెప్పారు. జిల్లాలలో ఇప్పటికే డబుల్‌ బెడ్‌ రూం ఇండ్ల నిర్మాణం ప్రారంభమయిందని, వాటి వేగం కూడా పెంచాలని చెప్పారు. స్థానికంగా ఉండే కాంట్రాక్టర్లకు పనులు అప్పగించాలన్నారు. ఎక్కడి వారు అక్కడే ఇండ్లు కట్టుకోవడం మంచిదని చెప్పారు. ఈ విషయంలో ఎమ్మెల్యేలు చొరవ చూపాలని కోరారు. లబ్దిదారుల ఎంపిక, పనుల అప్పగింత తదితర వ్యవహారాలను కలెక్టర్లు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని చెప్పారు.