డబుల్‌ బెడ్‌రూంలో భాగస్వాములుకండి

4

– క్రెడాయ్‌ ప్రతినిధులకు మంత్రి కేటీఆర్‌ వినతి

హైదరాబాద్‌,ఆగస్టు 13(జనంసాక్షి):ప్రభుత్వం పేదల కోసం నిర్మించతలపెట్టిన బడుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లకు బిల్డర్లు సహకరించాలని పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ కోరారు. పేదల ఇంటికలను నిజం చేసే ఈ బృహత్తర పథకానికి చేయూతను ఇవ్వాలన్నారు. రెండు పడకగదుల ఇళ్ల నిర్మాణంలో క్రెడాయ్‌లోని సంస్థలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. భాగ్యనగరంలో నిర్మాణాలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేందుకు సమగ్ర మాస్టర్‌ ప్లాన్‌ మరో 3 నెలల్లో అమల్లోకి తేనున్నామని పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ తెలిపారు. ప్రస్తుతం హైదరాబాద్‌ నగరంలో ఐదు మాస్టర్‌ప్లాన్లు అమల్లో ఉన్నాయన్నారు. అదే రీతిగా కొత్త జిల్లాలు ఏర్పడే తరుణంలో అన్ని మున్సిపాలిటీలు, కార్పోరేషన్లలో సమగ్రమైన మాస్టర్‌ ప్లాన్‌ తయారుచేసి అమలు చేస్తామని పేర్కొన్నారు. హైటెక్స్‌లో క్రెడాయ్‌ ప్రాపర్టీ షో-2016ను  కేసీఆర్‌ శనివారం ప్రారంభించారు.  మూడు రోజుల పాటు హైటెక్స్‌ ఎగ్జిబిషన్‌ సెంటర్‌ హాల్లో 115 మంది రియల్టర్లు, భవన నిర్మాణ మెటీరియల్‌ తయారీదారులు, కన్సల్టెంట్లు, ఆర్థిక సంస్థలన్నీ 15వేలకు పైగా ప్రాజెక్టులను ప్రదర్శించనున్నారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ హైదరాబాద్‌ అభివృద్ధి ప్రణాళికలను వివరించారు. హైదరాబాద్‌లో మౌలిక వసతుల అభివృద్ధికి తీసుకోనున్న పలు చర్యలను వివరించారు. ఔటర్‌ రింగ్‌రోడ్‌ పరిధిలో 13 గ్రోత్‌ కారిడార్లు ఏర్పాటు చేస్తామని,, వాటికి అనుసంధానంగా శాటిలైట్‌ టౌన్‌షిప్‌లు ఏర్పాటు చేస్తామన్నారు. రీజినల్‌ రింగ్‌ రోడ్ల నిర్మాణానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ పచ్చజెండా ఊపినట్లు తెలిపారు. నిర్మాణ రంగంలో జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ పరిధిలో 30 రోజుల్లోనే అనుమతులు ఇస్తామన్నారు. భారత దేశంలో తెలంగాణ రాష్ట్రాన్ని అగశ్రేణి రాష్ట్రంగా చేయడానికి సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు బలమైన పునాదులు వేస్తున్నారని మంత్రి అన్నారు. హైదరాబాద్‌ను విశ్నగరంగా మార్చాలన్నదే తమ లక్ష్యమన్నారు. గత పాలకుల కారణంగా హైదరాబాద్‌ అడ్డదిడ్డంగా మారిందన్నారు. దానిని సవరించి చరక్కని నగరంగా తీర్చిదిద్దే కార్యక్రమం సాగుతోందన్నారు. హైటెక్స్‌లో క్రెడాయ్‌ ప్రాపర్టీ షోను ఆయన శనివారం ప్రారంభించిన తర్వాత మాట్లాడారు. నిర్మాణ రంగ సంస్థల సమస్యలను సీఎం కేసీఆర్‌ పరిష్కరించారని పేర్కొన్నారు. దేశంలో ఏ రంగానికి సంబంధించిన అంశమైనా తెలంగాణ వైపు ఆసక్తిగా చూస్తున్నారని వెల్లడించారు. హైదరాబాద్‌కు చెందిన నిర్మాణరంగ సంస్థలు దేశవ్యాప్తంగా విస్తరించినపుడే రాష్ట్ర ప్రభుత్వం సంతోషిస్తుందన్నారు. హైదరాబాద్‌ అభివృద్ధి కోసం మూడు నెలల్లో సమగ్రమైన ప్రణాళికను ప్రవేశపెట్టనున్నట్టు వెల్లడించారు. రోడ్లు, డ్రైనేజీ సహా ట్రాఫిక్‌ తదితర అంశాలపై దృష్టి పెట్టామన్నారు. నగరం అత్యంత ప్రతిష్టాత్మకమైన, అతి పెద్దదైన ప్రాపర్టీ షో కార్యక్రమానికి పలువురు రియల్‌స్టర్లు, నాయకులు తదితరులు హాజరయ్యారు. మంత్రి జగదీశ్వర్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.