డిజిటల్‌ ఇండియాతో ప్రజల కళల సాకారానికి కొత్త అడుగు

C

– ప్రధాని నరేంద్ర మోడీ

న్యూఢిల్లీ,జులై1(జనంసాక్షి):

ప్రజల కలలను సాకారం చేయడంలో ‘డిజిటల్‌ ఇండియా’ కొత్త అడుగని ప్రధాన మంత్రి నరేంద్రమోదీ అన్నారు. ఈరోజు మనం ముందడుగు వేయకపోతే ప్రపంచం ముందుకెళ్తుందని మనం ఇక్కడే ఉండాల్సి వస్తుందన్నారు. ఒకప్పుడు జనం నదీతరం, సముద్ర తీరాల్లో నివసించేవారని.. ఆ తర్వాత హైవేల పక్కన కొత్త నగరాలు ఏర్పడ్డాయని వివరించారు. అయితే ఇప్పుడు ఎక్కడ కమ్యూనికేషన్‌ బాగుంటే అక్కడ నగరాలు ఏర్పడుతున్నాయంటూ వ్యాఖ్యానించారు. ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్‌ స్టేడియంలో డిజిటల్‌ ఇండియా పథకాన్ని ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ..మన పారిశ్రామికవేత్తలు ఇస్తున్న మద్దతు కొత్త ఆశలు రేకెత్తిస్తోందని చెప్పారు. ఇంతకుముందు పిల్లలు పెద్దల నుంచి కళ్ల అద్దాలు పెన్నులు లాక్కునేవాళ్లని ఇప్పుడు సెల్‌ఫోన్లు లాక్కుంటున్నారని వ్యాఖ్యానించారు. డిజిటల్‌ ప్రపంచంలో పిల్లల స్థానం ఏమిటన్నది ఈ చర్య చెబుతోందన్నారు. నగరాలు, గ్రామాల మధ్య సౌకర్యాల కల్పనలో అంతరం ఉందని.. ఇప్పుడు మనం డిజిటైజేషన్‌లో సమన్వయం చేసుకోకపోతే ప్లలెలు, పట్టణాల మధ్య తీవ్రమైన అంతరాలు ఏర్పడే ప్రమాదం ఉందన్నారు. 18 లక్షల మంది ఉద్యోగాలు లభిస్తాయని రవిశంకర్‌ బృందం చెబుతోందన్నారు. డిజిటల్‌ ఇండియా ఆవిష్కరణపై రవిశంకర్‌ బృందాన్నిఈ సందర్భంగా ప్రధాని మోదీ అభినందించారు. దేశాన్ని డిజిటల్‌గా పటిష్ట పరచి ముందుకు తీసుకుని వెళ్లడమే లక్ష్యమన్నారు. అంతకుముందు ప్రారంభోపన్యాసంలో  ‘డిజిటల్‌ ఇండియా’ అంటే బలమైన భారత్‌ అని కేంద్ర సమాచార,ఐటి శాఖమంత్రి రవిశంకర్‌ప్రసాద్‌ అన్నారు.  ‘మేక్‌ఇన్‌ ఇండియా’ లేకుంటే ‘డిజిటల్‌ ఇండియా’ అసంపూర్తిగా మిగిలిపోతుందన్నారు. ఈ ప్రాజెక్టులో పాల్గొనాల్సిందిగా పారిశ్రామికవేత్తలను ఆహ్వానించారు. డిజిటల్‌ ఇండియా ద్వారా అవినీతి నిర్మూలన సాధ్యమన్నారు. దేశంలో 975 మంది మిలియన్ల మొబైల్‌ వినియోగదారులున్నారని చెప్పారు. డిజిటల్‌ ఇండియాలో అందరూ పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా కోరారు. డిజిటల్‌ ఇండియా’ పథకాన్ని ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ప్రారంభించారు. ఇందులో భాగంగా భారత్‌నెట్‌, డిజిటల్‌ లాకర్‌, ఉపకార వేతనాల పోర్టల్‌ను ప్రారంభించారు. డిజిటల్‌ ఇండియా పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు అరుణ్‌ జెట్లీ, రవిశంకర్‌ ప్రసాద్‌, నిర్మలాసీతారామన్‌, భాజపా అగ్రనేత అద్వానీ తదితరులు హాజరయ్యారు.డిజిటల్‌ ఇండియా ప్రాజెక్టు ప్రారంభం గొప్ప ముందడుగు అని పారిశ్రామికవేత్తలు కొనియాడారు. డిజిటలైజేషన్‌లో ప్రభుత్వంతో కలిసి ముందుకు నడుస్తామని ప్రకటించారు. డిజిటల్‌ ఇండియా ప్రాజెక్టు ప్రారంభం సందర్భంగా పలువురు పారిశ్రామికవేత్తలు మాట్లాడారు. డిజిటల్‌ ఇండియా చేయాలన్న ప్రధాని మోడీ లక్ష్యం గొప్ప ముందు చూపు అని పేర్కొన్నారు.  డిజిటల్‌ ఇండియా ప్రాజెక్టు ప్రారంభం గొప్ప ముందడుగని రిలయన్స్‌ సంస్థ అధినేత ముఖేష్‌ అంబానీ అన్నారు. నరేంద్రమోదీ లాంటి వ్యక్తి ప్రధాని కావటం భారత్‌ అదృష్టమన్నారు. దేశాన్ని ముందుకు తీసుకుని వెళుతున్న తీరు అభినందనీయమన్నారు.  డిజిటలైజేషన్‌ భారతదేశాన్ని గొప్ప దిశగా నడిపిస్తుందని చెప్పారు. సాధారణంగా ప్రభుత్వం కన్నా పారిశ్రామిక రంగం ముందుంటుంది, ఇప్పుడు తమ కన్నా ప్రభుత్వం ముందుందన్నారు. టాటా ఇండస్టీస్ర్‌ డిజిటలైజేషన్‌లో ప్రభుత్వంతో కలిసి ముందుకు నడుస్తుందని టాటా చైర్మన్‌ సైరన్‌ మిశ్రీ  స్పష్టం చేశారు. డిజిటలైజేషన్‌లో ముందున్న దేశాలను అధిగమించాలన్న లక్ష్యంతో భారత్‌ అడుగులేస్తోందని తెలిపారు.ఆర్థిక, వైద్య, పౌర సేవల్లో డిజిటలైజేషన్‌ కొత్త విప్లవం వస్తుందని అజీమ్‌ ప్రేమ్‌జీ ప్రకటించారు. ప్రతి గడపకు డిజిటల్‌ సేవలు అందించాలన్న ఈ లక్ష్యం భారత్‌ను అభివృద్ధి చెందిన దేశాల సరసన నిలుపుతుందన్నారు.బ్రాడ్‌బ్యాండ్‌ నెట్‌వర్క్‌, వైఫై  అభివృద్ధిలో ఆదిత్యా బిర్లా గ్రూప్‌ భారీగా పెట్టుబడులు పెడుతుందని కుమార మంగళం బిర్లా తెలిపారు. ఐడియా నెట్‌వర్క్‌ ఇప్పటికే 16.5 కోట్ల మందిని అనుసంధానం చేస్తోందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో దేశ విదేశాల నుంచి ఐటి, పారిశ్రామిక దిగ్గజాలు హాజరయ్యారు.