డీఎస్సీ అభ్యర్థుల్లో ఉత్కంఠ
ఆదిలాబాద్, అక్టోబర్ 8 (ఎపిఇఎంఎస్): డీఎస్సీ -12 ఫలితాలు ప్రకటించినప్పటికీ మెరిట్ జాబితాను ప్రకటించకపోవడంతో డీఎస్సీ అభ్యర్థుల్లో అసంతృప్తి నెలకొంది. డీఎస్సీలో వచ్చిన మార్కుల ఆధారంగా ప్రభుత్వం ఫలితాలను విడుదల చేసినప్పటికీ మెరిట్ జాబితా ప్రకటించకపోవడంతో అభ్యర్థులో ఉత్కంఠ నెలకొంది. ఫలితాల్లో ఏమైనా తప్పులు ఉన్నట్టయితే ఈ నెల 18 వరకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. సవరణల అనంతరం మెరిట్ జాబితా ఈ నెల 18 తరువాత ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. మెరిట్ జాబితా వచ్చే వరకు నిరుద్యోగ ఉపాధ్యాయుల్లో ఆందోళన నెలకొంది. ప్రభుత్వం ఎట్టకేలకు డీఎస్సీ ఫలితాలు విడుదల చేయడంతో జిల్లా వ్యాప్తంగా ఖాళీగా ఉన్న ఉపాధ్యాయలు పోస్టుల భర్తీ కానున్నది. జిల్లాకు 1401 పోస్టులను మంజూరు చేస్తూ గత జనవరిలో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయడంతో జిల్లా వ్యాప్తంగా 16,190 మంది అభ్యర్థులు రాత పరీక్షలకు హాజరయ్యారు. ఈ డీఎస్సీలో స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు పోటీ నెలకొంది. డీఎస్సీ ప్రక్రియను తొందరగా చేపట్టాలని అభ్యర్థులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.