డీఎస్సీ నోటిఫికేషన్‌ వాయిదా!

– వారంలో మళ్లీ నోటిఫికేషన్‌ ఇచ్చేందుకు ప్రయత్నిస్తాం
– ఏపీ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాస్‌రావు
అమరావతి, జులై6(జ‌నం సాక్షి) : ఆంధప్రదేశ్‌లో నిరుద్యోగులు ఎంతో ఆశగా ఎదురుచూస్తోన్న ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి వెలువడాల్సిన నోటిఫికేషన్‌ వాయిదా పడింది. ముందుగా ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం మొత్తం 10,351 పోస్టులకు సంబంధించి జులై 6 న విడుదల కావాల్సిన డీఎస్సీ నోటిఫికేషన్‌ను అనివార్య కారణాల వల్ల వాయిదా వేశారు. ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ నుంచి రాకపోవడంతో నోటిఫికేషన్‌ ఇవ్వలేకపోతున్నామని ఏపీ మానవనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు వెల్లడించారు. దీంతోపాటు కొన్ని ఆటంకాలు కూడా ఉన్నట్టు ఆయన తెలిపారు. ఎస్జీటీ పోస్టులకు బీఎడ్‌ అభ్యర్థులను కూడా అనుమతిస్తూ ఎన్‌సీటీఈ వెలువరించిన ఆదేశాలను కూడా అధ్యయనం చేయాలని గంటా తెలియజేశారు. దీనిపై వారం రోజుల్లో స్పష్టత వస్తుందని ఆయన అన్నారు. దీంతో శుక్రవారం విడుదల కావాల్సిన డీఎస్సీ నోటిఫికేషన్‌ వాయిదా వేశామని మంత్రి గంటా పేర్కొన్నారు.  మరోవైపు డీఎస్సీతోపాటు టెట్‌, లేదా టెట్‌ కమ్‌ టీఆర్టీ నిర్వహించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. బీఎడ్‌లను ఎస్టీటీ పోస్టులకు అనుమతిస్తూ ఇటీవలే కేంద్రం గెజిట్‌ విడుదల చేసింది. దీంతో పేపర్‌-1లో అర్హత సాధించిన వారికి మాత్రమే ఎస్టీటీ పోస్టులకు అనుమతిస్తారు. బీఎడ్‌లకు ఇప్పటి వరకు పేపర్‌-1 రాసే అవకాశం లేకపోవడంతో ఎస్జీటీ పోస్టులకు టెట్‌ కమ్‌ టీఆర్టీ నిర్వహించి, స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులకు డీఎస్సీని నిర్వహిస్తే ఎలా ఉంటుందనే ఆలోచన కూడా చేసినట్టు తెలుస్తోంది. దీని వల్ల సాంకేతిక సమస్యలు కూడా తలెత్తే ఆస్కారం కూడా ఉండదని భావిస్తున్నారు. డీఎస్సీ 2014 ను ఇదే విధానంలో నిర్వహించారు. అందుకే ఎస్జీటీ పోస్టుల వరకు టెట్‌ కమ్‌ టీఆర్టీ నిర్వహించడం వల్ల డీఎడ్‌లతోపాటు బీఎడ్‌ అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకుని మెరిట్‌ ప్రాతిపదికన ఎంపికయ్యే అవకాశం ఉంటుంది. మరోవైపు ఉపాధ్యాయ పోస్టులకు సంబంధించి గతంలో విద్యాశాఖ పంపిన ప్రతిపాదనలను ఆర్థిక శాఖ కార్యదర్శి గురువారం పరిశీలించారు. గతంలో ప్రతిపాదించిన కొన్ని పోస్టులకు సంబంధించిన మార్పులు, చేర్పులను చేయాల్సిన అవసరం ఉందని వాటిపైనా విద్యాశాఖ అధికారులతో చర్చించారు. స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టుల సంఖ్యను పెంచేలా కసరత్తు చేస్తున్నట్టు వినికిడి. దీనిపై మరో రెండు రోజుల్లో స్పష్టత రానుంది.  ఇదిలా ఉంటే  శుక్రవారం ఎస్‌.ఎస్‌.సి అడ్వాన్స్‌ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలను గంటా సచివాలయంలో విడుదల చేశారు. మొత్తం 35,140 మంది పరీక్షకు హాజరు కాగా, 18,424 ఉత్తీర్ణత సాధించారు. 16,707 మంది బాలికలు పరీక్షకు హాజరవగా 8745
మంది పాసయ్యారు. గత సంవత్సరం కంటే 18 శాతం తక్కువగా ఫలితాలు వచ్చాయిని ఈ సందర్భంగా మంత్రి వెల్లడించారు.