డీఎస్‌, కెప్టెన్‌ పెద్దల సభకు ఏకగ్రీవం

3

హైదరాబాద్‌  ,జూన్‌ 3(జనంసాక్షి):రాష్ట్రంలో ఉన్న రెండు రాజ్యసభ స్థానాలను టిఆర్‌ఎస్‌ కైవసం చేసుకుంది. రాజ్యసభ సభ్యులుగా కెప్టెన్‌ లక్ష్మీకాంతరావు, డి.శ్రీనివాస్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇవాళ మధ్యాహ్నం రాజ్యసభ నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. టిఆర్‌ఎస్‌ కు స్పష్టమైన మెజారిటీ ఉండటం, పోటీ చేయడానికి అవసరమైన ఎమ్మెల్యేల సంఖ్య ఇతర పార్టీలకు లేకపోవడంతో ఇంకెవ్వరూ నామినేషన్లు వేయలేదు. దీంతో, టిఆర్‌ఎస్‌ అభ్యర్థులిద్దరు ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి ప్రకటించారు. వారికి దృవీకరణ పత్రాలు అందజేశారు.రాజ్యసభ సభ్యులుగా అవకాశం కల్పించిన సీఎం కేసీఆర్‌ కు కెప్టెన్‌ లక్ష్మీకాంతరావు, డీఎస్‌ కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం ఇద్దరు రాజ్యసభ సభ్యులు అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్‌ పార్కులోని అమరవీరుల స్తూపం దగ్గర నివాళులు అర్పించారు.హైదరాబాద్‌ మేయర్‌ బొంతు రామ్మోహన్‌, ప్రభుత్వ చీఫ్‌ విప్‌ కొప్పుల ఈశ్వర్‌, మంత్రి ఈటెల రాజేందర్‌, ఎమ్మెల్సీ లక్ష్మణరావు తదితరులు కొత్తగా ఎన్నికైన రాజ్యసభ సభ్యులను అభినందించారు.అటు ఏపీలోని నాలుగు రాజ్యసభ స్థానాలకు కేంద్ర మంత్రులు సురేష్‌ ప్రభు, సుజనా చౌదరితో పాటు టీజీ వెంకటేష్‌, విజయసాయిరెడ్డి ఎన్నికయ్యారు.