డెడ్‌లైన్‌ తర్వాత టీ ఎంపీల పయనమెటు?

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై డిసెంబర్‌ 9లోగా ప్రకటన చేయాలని, లేనిపక్షంలో కీలక నిర్ణయం తీసుకుంటామని అధిష్టానానికి డెడ్‌లైన్‌ విధించిన కాంగ్రెస్‌ పార్లమెంట్‌ సభ్యుల పయనమెటు అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ప్రపంచంలోనే అత్యంత బలమైన నాయకుల్లో ఒకరిగా గుర్తింపు పొందిన కాంగ్రెస్‌ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ లోక్‌సభలో ఉండగానే టీ ఎంపీలు స్పీకర్‌ పోడియాన్ని చుట్టుముట్టి తెలంగాణ నినాదాలు చేశారు. ప్లకార్డులు ప్రదర్శించి గొడవ గొడవ చేశారు. ముఖ్యమంత్రులు, పీసీసీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రులు, ముఖ్య నేతలెందరో సోనియాగాంధీ కనుచూపునకే జడుసుకునే పరిస్థితుల్లో టీ కాంగ్రెస్‌ ఎంపీలు ఆమె సమక్షంలోనే పార్లమెంట్‌ స్తంభింపజేయడం సామాన్యమైన విషయం కాదు. ఈ ధిక్కరింపు ధోరణే ఎంపీలకు తెలంగాణ ప్రాంతంలో, ప్రజల్లో మంచిపేరు తీసుకురావడానికి కారణమైంది. తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి పిలుపునిచ్చిన అన్ని ఆందోళనల్లోనూ పాలు పంచుకున్న ఎంపీలు సకల జనుల సమ్మె కాలంలో పిలుపునిచ్చిన రైల్‌రోకోలో పాల్గొంటామని ప్రకటించారు. ఎవరెవరు ఎక్కడెక్కడ ఆందోళనల్లో పాల్గొనాలో కార్యాచరణ కూడా రూపొందించుకున్నారు. సొంతపార్టీ ఎంపీలని కూడా చూడకుండా ముఖ్యమంత్రి వారిని అరెస్టు చేయించి జైళ్లలో పెట్టించాడు. ఆ సమయంలో ఇదే ప్రాంతానికి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు.. ఎంపీలకు కనీసం సంఘీభావం కూడా తెలుపలేదు. అధిష్టానానికి బహుదూరంలో హైదరాబాద్‌లో ఉండే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఏం భయమొచ్చిందిని ప్రజలు నిలదీసినా వారిలో స్పందనలేదు. పదవులకు ఆశపడో, ముఖ్యమంత్రి ఇచ్చే నిధుల తాయిలాలకు పోతాయనో తెలంగాణ తల్లికి ద్రోహం చేస్తారా అంటూ పల్లెపల్లెనా ప్రజలు దిష్టిబొమ్మలు దహనం చేసినా పట్టించుకోలేదు. ఎంపీలు తెగించి కొట్లాడుతుంటే మంత్రులు జై తెలంగాణ అన్న వారిని అనుచరులతో కొట్టించారు. కరీంనగర్‌, మెదక్‌, మహబూబ్‌నగర్‌ ఆదిలాబాద్‌ జిల్లాలతో పాటు హైదరాబాద్‌ నగరంలో కొందరు దుండగులు ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడినా కనీసం మంత్రులు ఖండించనూ లేదు. పైగా తమ అనుచరుల చర్యలను సమర్థించుకున్నారు. మంత్రులు కాక మునుపు తెలంగాణ ఏర్పాటుపై రెచ్చిపోయి మాట్లాడిన జానారెడ్డి, బస్వరాజు సారయ్య ఆమాత్యులవగానే అధిష్టానానికి వీర విధేయత ప్రకటించారు. తెలంగాణపై ఎవరైనా వ్యతిరేక ప్రకటనలు చేసినపుడు ఖండించడమో, అధిష్టానం నుంచి స్పష్టమైన సంకేతాలు ఉన్నాయనే పేరుతో ప్రకటనలు జారీ చేయడం మినహా వీరు పెద్దగా తెలంగాణ ఏర్పాటు కోసం సాగించిన పోరాటాలు, నడిపిన ల్యాబీయింగ్‌లు లేవు. టీఆర్‌ఎస్‌ అధినేత ఫామ్‌ హౌస్‌లో రెస్టు తీసుకున్నంతకాలం సీపీఐ, బీజేపీ ఆధ్వర్యంలో తెలంగాణపై వివిధ కార్యక్రమాలు చేపట్టినా వాటిపై స్పందన అంతంతమాత్రమే. కేసీఆర్‌ సంప్రదింపుల పేరుతో ఢిల్లీ ఫ్లైట్‌ ఎక్కగానే కాంగ్రెస్‌ నేతల్లో మళ్లీ కదలిక వచ్చింది. హస్తినలో ఏం జరిగిందో ఏమోగాని టీఆర్‌ఎస్‌ అధినేత గోడక్కొంటిన బంతిలా హైదరాబాద్‌కు తిరిగి వచ్చారు. అప్పుడే అసలు కథ మొదలైంది. సీడబ్ల్యూసీ సభ్యత్వం నుంచి తప్పించిన కాంగ్రెస్‌ అధిష్టానం రెండోసారి రాజ్యసభ బెర్త్‌ ఇవ్వకపోవడంతో కె. కేశవరావు పార్టీపై గుర్రుగా ఉన్నారు. ఆయన్ను కదిలిస్తే భారీ ఎత్తున వలసలుంటాయని ఆశించిన కేసీఆర్‌ నేరుగా కేకే ఇంటికి వెళ్లి చర్చలు జరిపారు. అప్పట్నుంచే టీ కాంగ్రెస్‌ ఎంపీలు గులాబీ దళంలో చేరిపోవడం ఖాయమనే వార్తలు వచ్చాయి. సూర్యాపేట సమరభేరి సభలో ఇద్దరు ఎంపీల చేరిక ఖాయమని టీఆర్‌ఎస్‌ నుంచి మీడియాకు లీకులు కూడా ఇచ్చారు. కానీ ఎంపీలు తొందరపడలేదు. తెలంగాణ ఏర్పాటుకు ఉన్న అన్ని అవకాశాలను వారు సద్వినియోగం చేసుకుంటున్నారు. ఆదివారం రాత్రి హైదరాబాద్‌లోని మందా జగన్నాథం ఇంట్లో సమావేశమైన ఎంపీలు డిసెంబర్‌లోగా తెలంగాణపై తేల్చాలని డెడ్‌లైన్‌ విధించారు. లేనిపక్షంలో కీలక నిర్ణయాలు తీసుకుంటామని వెల్లడించారు. పార్టీ ఏర్పాటు చేస్తామా? ప్రత్యేక ఫ్రంట్‌ ఆధ్వర్యంలో ఆందోళన చేస్తామా? అనేది తెలుసుకునేందుకు వేచి చూడాలని సస్పెన్స్‌కు తెరతీశారు. సోమవారం పార్లమెంట్‌ సమావేశాల మూడోరోజు ఉభయ సభలు వాయిదా పడగానే ఎంపీలు లాబీల్లో సోనియాను కలిసి క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులు, తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులను నోట్‌ రూపంలో వివరించారు. ప్రజలు తెలంగాణ కావాలని కోరుకుంటున్నారని, తాము గ్రామాల్లో తిరగలేని పరిస్థితులు ఉన్నందున త్వరగా స్పందించాలని కోరారు. తెలంగాణపై పార్లమెంట్‌లో చర్చించే అవకాశం కూడా ఇవ్వాలని, పూర్తి వివరాలు మాట్లాడేందుకు సమయం కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. అయితే ఎంపీలు అంతకముందే సోనియా అపాయింట్‌మెంట్‌ కోసం ప్రయత్నించినా కుదరకపోవడంతోనే లాబీల్లో కలిశారనే వార్తలు వచ్చాయి. పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల్లో ఎంపీలందరూ పాల్గొనాలని అధిష్టానం విప్‌ జారీ చేసినా టీ కాంగ్రెస్‌ ఎంపీలు పార్లమెంట్‌ వెలుపలే నిరసన తెలిపారు. ప్రజాస్వామ్యబద్ధంగా పార్లమెంట్‌లో నిరసన తెలిపే అవకాశం ఉన్నా వినియోగించుకోలేదు. ఈ నేపథ్యంలో ఎంపీల వ్యవహార శైలిపై అనేక సందేహాలు తలెత్తాయి. అధిష్టానానికి బయపడే, వారి ఆదేశాల మేరకు పార్టీని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారనే ఆరోపణలూ వెల్లువెత్తాయి. ఒకవేళ కాంగ్రెస్‌ తెలంగాణపై స్పందించకుంటే తాము ప్రయత్నించినా అధిష్టానం పట్టించుకోలేదని చెప్పి పార్టీని దోషిగా చూపే ప్రయత్నమూ చేస్తున్నారు. దీంతో ప్రజల్లో సానుభూతి పొందాలనేది వారి ఆలోచన. ఇప్పటికిప్పుడు పార్టీ మారితే రాజీనామా చేసి ఎన్నికలకు సిద్ధపడాలి. ఇది ఒకరిద్దరు ఎంపీలకు ఇష్టం లేదని సమాచారం. పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు ముగిశాక పార్టీని వీడితే ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయని కూడా కొందరు ఆలోచిస్తున్నట్లు తెలిసింది. తెలంగాణపై పట్టుబడుతున్న వారిలో పొన్నం ప్రభాకర్‌, మందా జగన్నాథం, గుత్తా సుఖేందర్‌రెడ్డి, వివేక్‌, సిరిసిల్ల రాజయ్య గులాబీ గూటికి చేరుతారనే ప్రచారం జోరుగా సాగుతుండగా, నల్గొండ జిల్లాలో గట్టి పట్టున్న కోమటిరెడ్డి రాజగోల్‌పాల్‌రెడ్డి మాత్రం జగన్‌ శిబిరంలోకి వెళ్లే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది. కోమటిరెడ్డి బ్రదర్స్‌ ప్రయత్నాన్ని విరమింపజేసేందుకే టీఆర్‌ఎస్‌ సూర్యాపేట కేంద్రంగా నిర్వహించిన సమరభేరిలో వారిపై ఆరోపణలు గుప్పించింది. కొంతకాలంగా స్తంబ్దంగా ఉన్న తెలంగాణ అంశం మళ్లీ ఉద్యమ రూపం దాల్చడం, జేఏసీ వేదికగానే కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించడం సగటు తెలంగాణవాదికి ఆనందం కలిగించే అంశం. ఈనేపథ్యంలో ఎంపీలు ఎంచుకునే ఉద్యమ పంథాపైనే అందరి దృష్టి నెలకొంది.