డెల్టా ఎఫెక్ట్‌తో వణుకుతున్న అగ్రరాజ్యం

ఒక్కరోజే 30వేల కేసులు నమోదు
చైనాలోనూ పెరుగుతున్న కేసుల సంఖ్య
వాషింగ్టన్‌,ఆగస్ట్‌9(జనంసాక్షి): మరోసారి ప్రపంచాన్ని కోవిడ్‌ టెన్షన్‌ పెట్టేస్తోంది. డెల్టా ఎఫెక్ట్‌తో అగ్రరాజ్యం అల్లాడుతోంది. అమెరికాలో ఒక్కరోజులో లక్షా 30 వేలకు పైగా కొత్త కేసులు బయటపడ్డాయి.రోజురోజుకు కేసులు పెరుగు తుండటంతో దేశాలు అల్లాడిపోతున్నాయి. కరోనా డెల్టా వేరియంట్‌ వ్యాప్తి తీవ్రంగా ఉండటంతో.. అమెరికాలో కేసులు అమాంతం పెరుగుతున్నాయి. చైనా భారీఎత్తున కొవిడ్‌ పరీక్షలు జరుపుతుండగా.. శ్రీలంకలో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. జూన్‌ చివరిలో సగటున రోజువారీ కేసుల సంఖ్య 11 వేలకు తగ్గిపోయినా అమెరికాలో.. ఈనెల 3 నుంచి రోజూ లక్షకు పైగా నమోదవుతున్నాయి. జూన్‌, జులై మొదటి వారంలోనూ కేసుల సంఖ్య 20 వేలలోపే పరిమితమైనా.. ఆ తర్వాత మాత్రం అక్కడ సీన్‌ రివర్స్‌ అవుతోంది. క్రమేపీ కేసుల సంఖ్య పెరుగుతోంది. గత ఏడాది కరోనా ఫస్ట్‌ వేవ్‌లో రోజువారీ కేసుల సంఖ్య లక్ష దాటడానికి 9 నెలలు పట్టగా.. ఇప్పుడు 6 వారాల్లోనే ఆ సంఖ్యను దాటేయడం తీవ్రతను
తెలుపుతోంది. ఆసుపత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య, మరణాలు కూడా పెరుగుతున్నాయి. రెండు వారాల క్రితం రోజుకి 270 కొవిడ్‌ మరణాలు సంభవించగా.. ఇప్పుడు ఆ సంఖ్య 700 దాటింది. అమెరికాలో ప్రధానంగా టీకా తీసుకోని వారిలో వైరస్‌ వ్యాప్తి తీవ్రంగా ఉంది. ప్రత్యేకంగా దక్షిణ ప్రాంతంలో ఆసుపత్రుల న్నీ కిక్కిరిసిపోతున్నాయి. మరింత మంది అమెరికన్లు టీకాలు తీసుకోకపోతే కేసుల పెరుగుదల ఇంకా తీవ్రంగా ఉండొచ్చనే టెన్షన్‌ మొదలైంది. కరోనా పుట్టినిళ్లు చైనా కూడా వైరస్‌ దెబ్బకు వణుకుతోంది. చైనాను కూడా కరోనా మళ్లీ వణికిస్తుండటంతో.. తొలిసారి వైరస్‌ బయటపడిన వుహాన్‌ నగరంలో వరుసపెట్టి టెస్టులు చేస్తున్నారు. అక్కడ మొత్తం జనాభా కోటి 20 లక్షల మంది ఉంటే.. కోటి 12 లక్షల మందికి టెస్టులు చేశారు. ఈ నెల 4 నుంచి ప్రత్యేక డ్రైవ్‌ చేపట్టి మరీ పరీక్షలు నిర్వహిస్తున్నారు. శ్రీలంకలో కరోనా డెల్టా రకం వ్యాప్తి తీవ్రంగా ఉంది. ప్రతి వ్యక్తికీ కొవిడ్‌ ముప్పు పొంచి ఉందని.. ప్రజలంతా ఇళ్లలోనే ఉండాలని ప్రభుత్వం హెచ్చరించింది. గత కొద్ది రోజులుగా శ్రీలంకలో కేసులు, మరణాలు గణనీయంగా పెరుగుతున్నాయి. ఆసుపత్రులు కిటకిటలాడుతున్నాయి. డెల్టా వేరియంట్‌ సోకినవారే ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోతున్నారు.

తాజావార్తలు