డ్రోన్ దాడిలో ముల్లా అక్తర్ మృతి
– తాలిబాన్‌కు కోలుకోలేని దెబ్బ
కాబూల్,మే22(జనంసాక్షి): ఆఫ్ఘన్ తాలిబన్ గ్రూపు అగ్రనేత ముల్లా అక్తర్ మన్సూర్ అమెరికా డ్రోన్ దాడిలో హతమైనట్లు ఆఫ్ఘనిస్తాన్ సీఈవో అబ్దుల్లా వెల్లడించారు. పాకిస్తాన్‌లోని బెలుచిస్తాన్ ప్రాంతంలో అమెరికా దళాల వైమానిక దాడుల్లో మన్సూర్ హతమైనట్లు అబ్దుల్లా ఆన్‌లైన్‌లో ప్రకటన విడుదల చేశారు. ‘క్వెట్టాలో శనివారం సాయంత్రం 4.30 గంటల సమయంలో జరిగిన డ్రోన్ దాడిలో తాలిబన్ నేత అక్తర్ మన్సుర్ మృతిచెందారు. దాల్‌బందిన్ ప్రాంతంలో అతడి కారుపైన కూడా దాడులు జరిగాయి’ అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. అబ్దుల్లా ప్రకటన చేసిన వెంటనే మన్సూర్ వైమానిక దాడిలో మృతిచెందినట్లు ఆఫ్గన్ ఇంటిలిజెన్స్, నేషనల్ డైరక్టరేట్ ఆఫ్ సెక్యూరిటీ (ఎన్‌డీఎస్) కూడా ధ్రువీకరించాయి.
అహ్మద్ వాల్ పట్టణంలో మన్సూర్ వాహనంపై దాడి జరిగినట్లు ఆఫ్ఘన్ ప్రభుత్వం కూడా ధ్రువీకరించింది. అయితే మాన్సుర్ మృతిని ధ్రువీకరించేందుకు విచారణ జరుపుతున్నట్లు పేర్కొంది.