ఢాకాలో కుప్పకూలిన భవనం

వందకు పైగా మృతులు
800లకు పైగా క్షతగాత్రులు 
ఢాకా, (జనంసాక్షి) : బంగ్లాదేశ్‌లోని ఢాకాలో బుధవారం ఎనిమిది అంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో సుమారుగా వంద మంది మృతి చెందారని ఆరోగ్యశాఖ మంత్రి ఏఎఫ్‌ఎం రాహుల్‌ హక్యూ తెలిపారు. సుమారుగా 800మందికి గాయాలయ్యాయని చెప్పారు. గాయపడిన వారిని సమీపంలోని వివిధ ఆసుపత్రులకు తరలించారు. ఈ భవనంలో మూడు వస్త్ర పరిశ్రమలు, అనేక వ్యాపార సంస్థలు ఉన్నాయి. వాటిలో సుమారు ఆరు వేల మంది వరకు పనిచేస్తున్నారు.  ప్రమాదం ఉదయం చోటు చేసుకోవడంతో మృతుల సంఖ్య భారీగా ఉందని అధికారులు పేర్కొన్నారు. శిథిలాల తొలగింపు ప్రక్రియ కొనసాగుతోంది. క్రేన్లు, బుల్డోజర్ల సాయంతో శిథిలాల తొలగిస్తున్నారు. శిథిలాల కింద మరికొంత మంది ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. భవనం ఉదయం 8.30 గంటల సమయంలో కూలిందని స్థానికులు తెలిపారు. ఆ సమయంలో అందులో సుమారుగా రెండు వేల మంది ఉండొచ్చని అనుమానిస్తున్నారు. అగ్నిమాపక సిబ్బంది, అధికారులు, తదితరులు సహాయక చర్యల్లో చురుగ్గా

పాల్గొంటున్నారు. ఇదిలా ఉండగా ఈ ప్రమాదం ఎలా జరిగి ఉండొచ్చన్న దానిపై సర్వత్రా చర్చ కొనసాగుతోంది.
కొనసాగుతున్న వెతుకులాట
భవనం కూలిన పరిసరాల వద్ద విషాదవాతావరణం నెలకొంది. తమ వారి జాడ కోసం కొందరు.. ఇంకొందరు తమ సామాను కోసం.. వెదుకుతున్నారు. తమవారికేమైందోననే ఆతృతలో మరికొందరు ఆసుపత్రల వైపు పరుగులు తీస్తున్నారు.