ఢిల్లీలో క్యాబ్ డ్రైవర్‌పై ఆఫ్రికన్ల దాడి
న్యూఢిల్లీ,మే30(జనంసాక్షి): కొందరు విదేశీయులు సోమవారం ఉదయం దిల్లీలో ట్యాక్సీ డ్రైవర్‌పై దాడి చేసి కొట్టారు. ట్యాక్సీలో నలుగురి కంటే ఎక్కువ మందిని ఎక్కించుకోవడానికి డ్రైవర్ నిరాకరించడంతో వాగ్వాదం జరిగిందని.. తనను విపరీతంగా కొట్టారని ఓలా క్యాబ్ డ్రైవర్ నూరుద్దీన్ ఆరోపిస్తున్నారు. రాజ్‌పూర్ నుంచి ద్వారకకు వెళ్లడానికి ఆరుగురు విదేశీయులు క్యాబ్‌ను పిలిచారని, వారిలో నలుగురు పురుషులు, ఇద్దరు స్త్రీలు ఉన్నారని.. దాంతో ట్యాక్సీలో నలుగురిని మాత్రమే తీసుకెళ్లగలనని ఆరుగురిని ఎక్కించుకోవడం కుదరదని చెప్పినందుకు తనపై దాడి చేసి కొట్టి అక్కడి నుంచి పారిపోయారని డ్రైవర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.నూరుద్దీన్‌పై దాడిచేసిన వారిలో ఓ మహిళను పట్టుకున్నారు. ఆమెను ఆఫ్రికన్ దేశమైన రువాండాకు చెందిన మహిళగా గుర్తించారు. మిగతా అయిదుగురు ఏ దేశాలకు చెందినవారో వివరాలు తెలుసుకుంటున్నామని.. వారిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నామని పోలీసులు వెల్లడించారు. గాయపడిన నూరుద్దీన్‌ను ఎయిమ్స్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవల దిల్లీలో ఆఫ్రికన్ దేశమైన కాంగోకు చెందిన ఓ విద్యార్థిని తీవ్రంగా కొట్టడంతో అతడు మరణించిన సంగతి తెలిసిందే. తర్వాత హైదరాబాద్‌లో నైజీరియా విద్యార్థిపై దాడి జరిగింది. ఈ నేపథ్యంలో కాంగోలో భారతీయులపైనా దాడులు చేశారు. దీంతో ఆఫ్రికన్ విద్యార్థులు ఉన్న ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ ఇరువర్గాల మధ్య దాడులు నియంత్రించడానికి దిల్లీలో మంగళవారం ఆఫ్రికన్ విద్యార్థులతో సమావేశం కానున్నారు.