ఢిల్లీలో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ వేడుకలు

– జాతీయ జెండాను ఆవిష్కరించిన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు

న్యూఢిల్లీ, జూన్‌2(జ‌నం సాక్షి) : దేశ రాజధానిలోని తెలంగాణ భవన్‌లో తెలంగాణ రాష్ట్ర అవరణ దినోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు జాతీయ జెండాను ఆవిష్కరించి, తెలంగాణ తల్లి విగ్రహానికి పూల మాలవేసి, అనంతరం అమరవీరుల స్థూపానికి నివాళులర్పించారు. అలాగే తెలంగాణ భవన్‌లో జరిగిన యాదగిరి లక్ష్మి నరసింహా స్వామి వారి కళ్యాణంలో పాల్గొని స్వామి వారికి పట్టువస్త్రాలు మర్పించారు. ఈ కళ్యాణ కార్యక్రమంలో తెలుగు రాష్టాల్ర ఉమ్మడి గవర్నర్‌ నరసింహన్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా విూడియాతో ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ.. రెండు తెలుగు రాష్ట్రాలు తమ సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకోవాలని సూచించారు. రెండు రాష్ట్రాలు అభివృద్ధే ధ్యేయంగా ముందుకెళ్లాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ అన్ని రంగాల్లో పురోగమించాలని ఆకాంక్షించారు. ఢిల్లీలోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధులు డా.ఎస్‌.వేణు గోపాల చారి, రామచంద్రు తేజావత్‌, ప్రిన్సిపల్‌ రెసిడెంట్‌ కవిూషనర్‌ జి.అశోక్‌ కుమార్‌, అదనపు రెసిడెంట్‌ కవిూషనర్‌ వేదాంతం గిరి, ఓఎస్‌డీ కాళీ చరణ్‌, సహాయక కవిూషనర్‌ జీ.రామ్మోహన్‌ తదితరులు పాల్గొన్నారు.