ఢిల్లీలో లొల్లికి కదిలిన సంసద్ రైలు బండి
పార్లమెంట్‌లో బిల్లు పెట్టే వరకూ పోరు ఆగదు : కోదండరామ్
హైదరాబాద్, ఏప్రిల్ 27 (జనంసాక్షి) :
తెలంగాణ ప్రజల పక్షాల దేశరాజధాని ఢిల్లీలో లొల్లి చేసేందుకు టీ జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించ తలపెట్టిన సంసద్‌యాత్ర ప్రత్యేక రైలు శనివారం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి బయల్దేరి వెళ్లింది. ఈ సందర్భంగా జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ మాట్లాడుతూ పార్లమెంట్‌లో బిల్లు పెట్టే వరకూ పోరు ఆపబోమని తేల్చిచెప్పారు. తెలంగాణ కోసం పది జిల్లాల ప్రజలు దశాబ్దాల తరబడి శాంతియుత పోరాటాలు సాగిస్తున్నా కేంద్రం ప్రభుత్వం పట్టనట్టు వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2009 డిసెంబర్ 9న తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించిన యూపీఏ ప్రభుత్వం తర్వాత ఆ ప్రకటన నుంచి వెనక్కి తగ్గిందని ఆరోపించారు. 2012 డిసెంబర్‌లో నిర్వహించిన అఖిలపక్ష సమావేశం సందర్భంగా నెలరోజుల్లోనే సమస్యను తేల్చేస్తామని చెప్పి మళ్లీ మాట మార్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. యూపీఏ ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ప్రజల మనోభావాలు, ఆకాంక్షలతో ఆడుకోవడం అలవాటుగా మారిందని ఆరోపించారు. పిడికెడు మంది పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసం నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజలను అనేక రకాలు ఇబ్బందులకు గురి చేస్తున్నారని తెలిపారు. ఢిల్లీ కళ్లు తెరిపించేందుకే తాము సంసద్‌యాత్రకు పూనుకున్నామని అన్నారు. ఈనెల 29, 30 తేదీల్లో ఢిల్లీలోని జంతర్ మంతర్‌లో శాంతియుతంగా నిరసన తెలిపి ప్రజల ఆకాంక్షను చాటిచెప్తామన్నారు. ఈ నిరసన ప్రదర్శనలో అన్ని ప్రతిపక్షాలు పాల్గొంటాయని తెలిపారు.