ఢిల్లీ దిగివచ్చేలా చలో అసెంబ్లీ నిర్వహించాలి

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం టీ జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించ తలపెట్టిన చలో అసెంబ్లీ కార్యక్రమం ఢిల్లీ దిగివచ్చేలా నిర్వహించాలి. నాలుగున్నర కోట్ల ప్రజల ఆకాంక్షల సాధనకు ఉద్యమాన్ని మించిన మార్గం లేదు. ఎందుకోకాని ఇటీవల తెలంగాణ ఉద్యమ తీరులో ఓట్లు, సీట్లు అనేవి కాస్త ఎక్కువగానే వినవస్తున్నాయి. ఇది ఆరోగ్యకరమైన పరిణామం కాదు. తెలంగాణ ప్రజలు స్వపరిపాలన, ఆత్మగౌరవం కోసం నాలుగు దశాబ్దాలుగా ఉద్యమిస్తూనే ఉన్నారు. ఆరు దశాబ్దాల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సీమాంధ్రులు సాగించిన నీళ్లు, నిధులు, ఉద్యోగాలు, వనరుల దోపిడీని వ్యతిరేస్తూ ఉద్యమ పంథా కొనసాగిస్తూనే ఉన్నారు. ఈక్రమంలో ఎన్నికల రాజకీయాలతో కూడిన పోరాటాన్ని కొనసాగించారు. తెలంగాణ సాధన కోసమంటూ ఆవిర్భవించిన రాజకీయ పార్టీలనూ అక్కున చేర్చుకున్నారు. 1969లో ఆవిర్భవించిన తెలంగాణ ప్రజాసమితిని 1971 ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో గెలిపించారు. ఏకంగా పది ఎంపీ స్థానాలు ఆ పార్టీకి కట్టబెట్టారు. తర్వాత ఆ పార్టీ కాంగ్రెస్‌లో విలీనమై తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు డిమాండ్‌నే విస్మరించింది. తర్వాత మూడు దశాబ్దాల పాటు ప్రజా సంఘాల నేతృత్వంలో ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం కొనసాగింది. 2000 సంవత్సరం నాటికి తెలంగాణ సాధన ఉద్యమం ఊపందుకుంది. సరిగ్గా ఏడాది తర్వాత తెలంగాణ సాధన కోసమంటూ టీఆర్‌ఎస్‌ ఆవిర్భవించింది. ఆ పార్టీని తెలంగాణ ప్రజలు గుండెల్లో పెట్టుకున్నారు. పార్టీ ఆవిర్భావం తర్వాత జరిగిన జిల్లా పరిషత్‌ ఎన్నికల్లో కరీంనగర్‌, నిజామాబాద్‌ జెడ్పీ స్థానాలు కట్టబెట్టారు. 2004 సాధారణ ఎన్నికల్లో అప్పటి ప్రతిపక్ష కాంగ్రెస్‌తో కలిసి పోటీ చేస్తే ఐదు పార్లమెంట్‌, 26 అసెంబ్లీ సాధనాల్లో గెలిపించారు. ఆ తర్వాత కాంగ్రెస్‌ తెలంగాణ అంశంలో దాటవేత ధోరణి అవలంబించిందంటూ టీఆర్‌ఎస్‌ యూపీఏ-1 ప్రభుత్వం నుంచి, రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం నుంచి వైదొలిగింది. ఈనేపథ్యంలో వచ్చిన కరీంనగర్‌ లోక్‌సభ ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ను రికార్డు మెజార్టీతో గెలిపించారు. తర్వాత టీఆర్‌ఎస్‌ పదే పదే రాజీనామాలు చేస్తూ ప్రజలకు విసుగు తెప్పించారు. ఇలా వచ్చిన ఉప ఎన్నికల్లో ఆ పార్టీకి బుద్ధి చెప్పే రీతిలోనే తీర్పు ఇచ్చారు. ఉద్యమం చేయాల్సిన పార్టీ ఓట్లు.. సీట్ల కోసం పరితపిస్తూ కొత్త రాజకీయ పొత్తులకు దిగడంతో 2009 ఎన్నికల్లో దిమ్మతిరిగే తీర్పునిచ్చారు. తెలంగాణ ఉద్యమాన్ని స్వార్థానానికి వాడుకోవాలని చూస్తే ఎలాంటి పరిస్థితి ఉంటుందో చాటిచెప్పారు. ఈ తీర్పుతో భ్రమలు వీడిన టీఆర్‌ఎస్‌ అధినేత మళ్లీ ప్రజల పక్షాన ఉద్యమ శంఖం పూరించాడు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో ఉద్యోగ నియామకాల్లో ఫ్రీజోన్‌గా ప్రకటిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. సీమాంధ్ర సర్కారు పెద్దలు కోర్టులో సరైన వాదనలు వినిపించనందునే కోర్టు ప్రతికూల తీర్చున్చిందని విద్యార్థులు, యువకులు ఏకమై ఉద్యమాన్ని హోరెత్తించారు. ఈక్రమంలో ఉద్యమ పార్టీ టీఆర్‌ఎస్‌ కూడా పోరు కొనసాగించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ ఉద్యమం తారస్థాయిలో జరుగుతున్న తరుణంలో న్యాయబద్ధంగా తెలంగాణ ప్రజలకు దక్కాల్సిన ఉద్యోగాలను చట్టం మాటున కొళ్లగొట్టాలని చూసిన సీమాంధ్ర సర్కారు పీడన నుంచి ఈ గడ్డకు విముక్తి కల్పించాల్సిందేనని ఉద్యమాన్ని నడిపించారు. విద్యార్థుల నేతృత్వంలో.. ఉస్మానియా కేంద్రంగా ప్రజ్వరిల్లిన తెలంగాణ పోరును టీఆర్‌ఎస్‌ అందిపుచ్చుకొని రాజకీయ లబ్ధికోసం ఉపయోగించుకోవాలని చూసింది. తెలంగాణ ప్రజల పక్షాన సాగుతున్న పోరులో అంతా కలిసి రావడంతో 2009 డిసెంబర్‌ నాటికి తెలంగాణ మహోద్యమంగా మారింది. అదేసమయంలో టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ఆమరణ నిరాహార దీక్షకు దిగగా, ఉస్మానియా కేంద్రంగా తెలంగాణ పోరు పది జిల్లాల్లో హోరెత్తింది. ప్రజలంతా పనులు వీడి రాష్ట్ర సాధన కోసం పోరు కొనసాగించారు. విద్యార్థులు, ఉద్యమ సంఘాలు డిసెంబర్‌ 10న చలో అసెంబ్లీకి పిలుపునిచ్చాయి. అప్పటికే అసెంబ్లీ శీతాకాల సమావేశాలు కొనసాగుతుండటంతో బెంబేలెత్తిపోయిన కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానం డిసెంబర్‌ 9న రాత్రి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. కానీ ఆ సంబరం ప్రజలకు ఎంతో సేపు నిలువలేదు. సీమాంధ్ర పెట్టుబడిదారులు సమైక్యాంధ్ర పేరుతో కృత్రిమ ఉద్యమాన్ని సృష్టించి కేంద్రం ప్రకటన వెనక్కుతీసుకునేలా చేశారు. ఈ నేపథ్యంలో తెలంగాణలోని రాజకీయ పార్టీల నేతలు ఉద్యమ నిర్వహణకు రాజకీయ ఐక్య కార్యాచరణ సమితిని ఏర్పాటు చేశారు. ఆరంభంలో కాంగ్రెస్‌, టీడీపీ, బీజేపీ, టీఆర్‌ఎస్‌ తదితర పార్టీలన్నీ జేఏసీలో ఉండగా తర్వాత టీడీపీ, కాంగ్రెస్‌ దూరమయ్యాయి. జేఏసీలో ప్రస్తుతం అతిపెద్ద రాజకీయ పార్టీ టీఆర్‌ఎస్‌. ఆ పార్టీ అధినేత కేసీఆర్‌ కనుసన్నల్లోనే టీ జేఏసీ నడుస్తుందనేది ప్రధాన ఆరోపణ. ఆ ఆరోపణలకు బలం చేకూర్చే రీతిలో ఎన్నో సందర్భాల్లో జేఏసీ రాజకీయంగా టీఆర్‌ఎస్‌ పక్షన నిలిచింది. సాధారణ ఎన్నికలకు ఇంచుమించు ఏడాది కాలం ఉన్న ప్రస్తుత తరుణంలో ఉద్యమ పార్టీ టీఆర్‌ఎస్‌ మళ్లీ ఓట్లు.. సీట్ల పంథా ప్రారంభించింది. దీనికి జేఏసీ కూడా సహకరిస్తుందనే ఆరోపణలున్నాయి. అసలు జేఏసీ, జేఏసీలా కాకుండా టీఆర్‌ఎస్‌కు రాజకీయ అండగా ఉంటుందనే పలువురు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. టీ జేఏసీ చేపడుతున్న ఉద్యమాల్లో ఒక్కోసారి టీఆర్‌ఎస్‌ కూడా ఎడమొఖం పెడమొఖంగానే ఉంటోంది. అయినా రాజకీయ అవసరాల దగ్గరకు వచ్చేసరికి టీఆర్‌ఎస్‌కు జేఏసీ సహకరించడం మినహా మరో దారి లేకుండా పోతుంది. ఇందుకు ఉద్యమ నాయకత్వంలో ఉన్న లోపాలూ కారణమనే ఆరోపణలున్నాయి. టీ జేఏసీ ఆధ్వర్యంలో గతంలో నిర్వహించిన మిలియన్‌ మార్చ్‌, సాగర హారం కనీవినీ ఎరుగని రీతిలో విజయవంతమయ్యాయి. హైదరాబాద్‌లో నిర్వహించే ఉద్యమాలే కేంద్రంలో కదలిక తెప్పిస్తున్నాయనేది నిజం. ఈ నేపథ్యంలో టీ జేఏసీ తలపెట్టిన చలో అసెంబ్లీ తెలంగాణ సాధనలో అత్యంత కీలకం. జేఏసీ అన్ని పక్షాలను కలుపుకొని దీని విజయవంతానికి ప్రయత్నించాలి. టీ కాంగ్రెస్‌ ఎంపీలు కూడా పార్టీ వీడేందుకు సిద్ధపడుతున్నారు. అలాంటి వారు వివిధ పార్టీల్లో ఉన్నారు. వారందరినీ ఒకే చోటుకు చేర్చే ప్రయత్నానికి జేఏసీనే పూనుకోవాలి. అసెంబ్లీ ముట్టడి ద్వారా యూపీఏ ప్రభుత్వం తెలంగాణపై తేల్చే రీతిలో ఉద్యమ నిర్మాణం సాగించడం ఇప్పుడు అత్యంత అవసరం.