ఢిల్లీ మంత్రి నివాసంలో సీబీఐ సోదాలు

– ప్రధాని పై మండిపడ్డ సీఎం కేజీవ్రాల్‌
– మోదీకి అసలేం కావాలి?
– ట్విట్టర్‌ ద్వారా ఆగ్రహం వ్యక్తం చేసిన సీఎం
న్యూఢిల్లీ, మే30(జ‌నం సాక్షి) : ప్రధానమంత్రి నరేంద్రమోదీపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజీవ్రాల్‌ మరోసారి అసహనం వ్యక్తం చేశారు. అవినీతి కేసులో ఢిల్లీ పీడబ్ల్యూడీ శాఖ మంత్రి సత్యేంద్ర జైన్‌ నివాసంలో బుధవారం ఉదయం సీబీఐ అధికారులు సోదాలు చేపట్టారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన సీఎం కేజీవ్రాల్‌ ప్రధానిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు ప్రధాని మోదీకి ఏం కావాలి..? అంటూ ప్రశ్నించారు. ఢిల్లీలోని మొహల్లా క్లినిక్స్‌, ఇతర పీడబ్ల్యూడీ ప్రాజెక్టుల కోసం 24 మందితో ఓ క్రియోటివ్‌ టీంను నియమించింది ఆ శాఖ. పీడబ్ల్యూడీ శాఖకు సత్యంద్రజైన్‌ మంత్రిగా ఉన్నారు. అయితే ఈ నియామకాలు పారదర్శకంగా జరగలేదని ఇటీవల ఆరోపణలు వచ్చాయి. దీంతో సీబీఐ అధికారులు విచారణ చేపట్టారు. దర్యాప్తులో భాగంగా బుధవారం ఉదయం జైన్‌ నివాసం సహా ఇతర పీడబ్ల్యూడీ అధికారుల ఇళ్లల్లోనూ సోదాలు చేపట్టారు. అనంతరం సత్యేంద్రజైన్‌పై సీబీఐ కేసు నమోదు చేసింది. ఇప్పటికే మనీ లాండరింగ్‌ వ్యవహరంలోనూ జైన్‌ సీబీఐ విచారణ ఎదుర్కొంటున్నారు.కాగా.. సీబీఐ సోదాలపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజీవ్రాల్‌ తీవ్రంగా స్పందించారు. ఇదంతా కేంద్ర ప్రభుత్వమే చేయిస్తోందంటూ పరోక్షంగా విమర్శించారు. ‘ప్రధాని మోదీకి ఏం కావాలి..?’ అంటూ ట్విటర్‌ ద్వారా ప్రశ్నించారు. అటు ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్‌ సిసోడియా కూడా సోదాలను ఖండించారు. తమ ప్రభుత్వం పేరును చెడగొట్టేందుకే ఇలాంటి దాడులు చేయిస్తున్నారన్నారు. ఇదంతా కేవలం ప్రజల దృష్టిని మళ్లించేందుకే అని దుయ్యబట్టారు.