ఢిల్లీ మున్సిపల్‌ ఉపఎన్నికల్లో ‘ఆప్‌’ హవా

1
న్యూఢిల్లీ,మే17(జనంసాక్షి): దేశ రాజధాని దిల్లీ నగరంలో ఇటీవల జరిగిన మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఉపఎన్నికల ఫలితాల్లో ఆప్‌ సత్తా చాటింది. తొలిసారి ఎన్నికల్లో నిలబడ్డ ఆప్‌ ఐదు వార్డుల్లో విజయంతో ఉనికి ని చాటుకుంది. 15న జరిగిన ఎన్నికల ఫలితాలు మంగళవారం వెలువడ్డాయి. ఈ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్‌, భాజపాలు కూడా ఉనికిని చాటుకోవడం గమనార్హం. దిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో తొలిసారి పోటీ చేసిన అధికార ఆమ్‌ ఆద్మీ పార్టీ అయిదు వార్డుల్లో విజయం సాధించింది. కాంగ్రెస్‌ పార్టీ నాలుగు, బిజెపి మూడు వార్డుల్లో గెలుపొందాయి. ఒక వార్డులో స్వతంత్ర అభ్యర్థి గెలుపొందారు. కౌన్సిలర్లుగా ఉన్నవారు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి గెలవడంతో ఖాళీ అయిన 13 వార్డులకు మే 15వ తేదీన ఉప ఎన్నికలు జరిగాయి. దిల్లీ శాసనసభకు జరిగిన ఎన్నికల్లో ఆమ్‌ ఆద్మీ పార్టీ ప్రభంజనం సృష్టించిన సంగతి తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికల్లో 70 స్థానాల్లో 67 స్థానాలు ఆప్‌ గెలుచుకోగా భాజపా 3 నియోజకవర్గాల్లో గెలుపొందింది. గతంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ ఒక్కస్థానం కూడా సంపాదించుకోలేకపోయింది. అయితే ఇప్పుడు మున్సిపల్‌ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ నాలుగు వార్డుల్లో గెలుపొందడం గమనార్హం. భాటి వార్డు నుంచి రాజేంద్ర సింగ్‌ తన్వర్‌ అనే స్వతంత్ర అభ్యర్థి గెలుపొందారు. భాజపా నావడా, షాలిమర్‌ బాగ్‌, వజీర్‌పూర్‌ వార్డులను సొంతం చేసుకుంది. టెఖండ్‌ వార్డు నుంచి ఆప్‌ అభ్యర్థి అభిషేక్‌ బిధూరి 1555 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఆప్‌ మటియాలా, నాన్‌పురా, వికాస్‌ నగర్‌ వార్డుల్లో గెలుపొందినట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. ఝిల్‌మిల్‌ వార్డులో కాంగ్రెస్‌ అభ్యర్థి

పంకజ్‌.. మాజీ ఎమ్మెల్యే, భాజపా అభ్యర్థి జితేంద్ర సింగ్‌ను 2419 ఓట్లతో ఓడించారు. కాంగ్రెస్‌ ఇంకా మునిరకా, కిచిడిపూర్‌, ఖుమారుద్దీన్‌నగర్‌ల నుంచి గెలుపొందింది. గతంలో ఈ 13 వార్డుల్లో ఏడు భాజపాకు చెందినవి కాగా మిగతావి స్వతంత్ర అభ్యర్థులు గెలుపొందినవి.