తండ్రీకొడుకులు తెలంగాణను నిలువుదోపిడీచేశారు


– ఓటుతో టీఆర్‌ఎస్‌కు గుణపాఠం చెప్పాలి
– అధికారంలోకి రాగానే రైతుల పంటలకు గిట్టుబాటు ధర కల్పిస్తాం
– దళితులు, గిరిజనులకు ఉచితంగా రేషన్‌
– ఉమ్మడి మహబూబ్‌నగర్‌లో 14కు 14 స్థానాల్లో విజయం సాధించాలి
– కొస్గీ సభలో టీపీసీసీ ప్రెసిడెంట్‌ ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి
మహబూబ్‌నగర్‌, నవంబర్‌28(జనంసాక్షి) : నాలుగేళ్ల తెరాస పాలనలో తండ్రీ కొడుకులు తెలంగాణను నిలువునా దోపిడీకి గురి చేశారని, ఓటుతో వారికి బుద్ది చెప్పాలని టీపీసీసీ ప్రెసిడెంట్‌ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం కొడంగల్‌ నియోజకవర్గం కొస్గీంలో జరిగిన బహిరంగ సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో 14 నియోజకవర్గాల్లో గెలుస్తామని ఉత్తమ్‌ ధీమా వ్యక్తం చేశారు. డిసెంబర్‌ 12న ప్రజా కూటమి ప్రమాణ స్వీకారం చేయటం ఖాయమన్నారు. నాలుగేళ్ల పాటు తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్‌, కేటీఆర్‌లు దోచుకున్నారని విమర్శించారు. నీళ్లివ్వలేదని, ఉద్యోగాలు ఇవ్వలేదని, రైతులకు మోసం జరిగిందన్నారు. వందల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నా పట్టించుకోలేదన్నారు. రాబోయేది మన ప్రభుత్వమేనని, అధికారంలోకి రాగానే రైతులకు తక్షణమే రూ.2లక్షల రుణమాఫీ చేస్తామని ఉత్తమ్‌ అన్నారు. అదేవిధంగా రైతుల పంటలకు గిట్టుబాటు ధర కల్పిస్తామన్నారు. వరి ధాన్యానికి రూ. 2వేలు, పత్తికి 7వేలతో, మిర్చి రూ.10వేలతో, మొక్కజొన్న రూ. 2వేలతో కొనుగోలు చేస్తామని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో పోరాటం చేసిన నిరుద్యోగులకు, యువతకు
కేసీఆర్‌ ప్రభుత్వంలో నైరాశ్యమే మిగిలిందన్నారు. కేసీఆర్‌ ప్రమాణ స్వీకారం చేసినప్పుడు రాష్ట్రంలో లక్షల7వేల ఉద్యోగాలు ఉన్నాయని, తిరిగి ఎన్నికలకు వచ్చిన సందర్భంగా నాలుగేళ్ల కాలంలో ఆయన నింపింది కేవలం 11వేల ఉద్యోగాలేనని ఉత్తమ్‌ విమర్శించారు. కేసీఆర్‌ సన్యాసి, దద్దమ్మల పాలన సాగించారని అన్నారు. రాబోయే ప్రజాఫ్రంట్‌ ప్రభుత్వంలో మొదటి సంవత్సరంలో లక్ష ఉద్యోగాలు నింపబోతున్నామని అన్నారు. లక్ష ఉద్యోగాల్లో మెగా డీఎస్సీ నిర్వహించి 20వేల ప్రభుత్వ టీచర్ల పోస్టులు నిపుంతామని అన్నారు. అదేవిధంగా వృద్ధులకు, వింతంతువులకు, బీడీ కార్మికులకు, నేత కార్మికులకు పెన్షన్‌ రూ. వెయ్యి నుంచి రూ. 2వేలకు పెంచుతామని అన్నారు. పెన్షన్‌కు వయస్సు 65 నుంచి 58కి తగ్గించబోతున్నామని, ఇంటిలోని ఇద్దరి వృద్ధులకు అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగుల తల్లిదండ్రులకు పెన్షన్‌ ఇస్తామని అన్నారు. వికలాంగులకు రూ. 3వేలు ఇస్తామని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 6లక్షల మహిళాలకు రాబోయే ప్రభుత్వంలో రూ.లక్ష గ్రాంట్‌ ఇవ్వబోతున్నామని, బ్యాంకు నుంచి రూ.10లక్ష రుణం ఇప్పించి ఆ రుణంపై వడ్డీభారం కాంగ్రెస్‌ భరిస్తుందన్నారు. సెల్ఫ్‌ ఎంప్లాయిస్‌ ఉద్యోగాలను పర్మినెంట్‌ చేస్తామన్నారు. ప్రజాఫ్రంట్‌ ప్రభుత్వంలో మనిషికి 7కిలోల సన్నబియ్యం ఇస్తామని, గత కాంగ్రెస్‌ ఇచ్చినట్లుగా తొమ్మిది రకాల వస్తువులను కూడా అందివ్వనున్నట్లు తెలిపారు. దళితులకు, గిరిజనులకు సన్నబియ్యంతో సహా తొమ్మిది రకాల నిత్యావసర వస్తువులను పూర్తిగా ఉచితంగా ఇస్తామని ఉత్తమ్‌ తెలిపారు. ప్రతి నిరుపేద, మధ్య తరగతి వారికి సంవత్సరానికి 6గ్యాస్‌ సిలీండర్‌లు ఉచితంగా ఇస్తామని ఉత్తమ్‌ స్పష్టం చేశారు. రాహుల్‌గాంధీ రాకతో ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో 14కు 14 స్థానాల్లో విజయం సాధించాలని ఉత్తమ్‌ పిలుపునిచ్చారు.