తడిసి మోపెడు ప్రధాని విదేశీ పర్యటన ఖర్చు 642 కోట్లు

న్యూఢిల్లీ, జూన్‌ 9 (జనంసాక్షి) : 
ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌ విదేశీ పర్యటనల ఖర్చు తడిసి మోపెడైంది. గడిచిన తొమ్మిది సంవత్సరాల్లో ఆయన పర్యటనల ఖర్చు రూ.642 కోట్లు అని లెక్కతేలింది. వివిధ దేశాల పర్యటలకు ప్రభుత్వం ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ కోసం ఈ మొత్తాన్ని వెచ్చించింది. ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయం ఆదివారం ఓ ప్రకటనను విడుదల చేసింది. సమాచార హక్కు చట్టం మేరకు ప్రధానమంత్రి పర్యటనల వ్యయం వివరాలను వెల్లడించినట్లు ప్రధానమంత్రి కార్యాలయం పేర్కొంది. 2004 నుంచి ఇప్పటి వరకు ప్రధానమంత్రి 67 పర్యటనలు చేశారని, వీటిలో 62 పర్యటనలకు రూ.642.45 కోట్లు ఖర్చుచేసినట్లు అధికారులు వివరించారు. ఐదు పర్యటనలకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉందని పేర్కొన్నారు. 2012లో మెక్సికో, బ్రెజిల్‌ పర్యటనకు అత్యధికంగా రూ.26.94 కోట్లు ఖర్చుచేసినట్లు వారు తెలిపారు. అయితే ఎవరు అధికారంలో ఉన్నా ప్రధాని, రాష్ట్రపతి పర్యటనలకు ఈ మొత్తాన్ని ఖర్చే చేయడం పరిపాటే.