తప్పులు దిద్దుకుంటాం

ఎస్సీ కమిషన్‌ వేయకపోవడం తప్పే
సబ్‌ప్లాన్‌ ఘనత కాంగ్రెస్‌దే : సీఎం
బంగారుతల్లికి సభ ఆమోదం
హైదరాబాద్‌, జూన్‌ 19 (జనంసాక్షి) :
ప్రభుత్వ పరంగా ఏవైనా తప్పులు జరిగి ఉంటే దిద్దుకుంటామని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. శాసనమండలిలో ఎస్‌సి, ఎస్‌టి సబ్‌ప్లాన్‌పై బుధవారం జరిగిన చర్చలో ముఖ్యమంత్రి కిరణ్‌, మంత్రి పితాని సత్యనారాయణ బదులిచ్చారు. సీఎం కిరణ్‌ మాట్లాడుతూ, ఎస్‌సి, ఎస్‌టి చట్టంలో లోపాలు ఉంటే సరిజేసుకుంటామని అన్నారు. ఎస్‌సి కమిషన్‌ను ఇప్పటివరకు ఏర్పాటు చేయకపోవడం పొరపాటేనన్నారు. త్వరలోనే ఏర్పాటు చేస్తామని సభాముఖంగా హామీ ఇస్తున్నానన్నారు. ఎస్‌సి, ఎస్‌టి చట్టబద్ధత కల్పించింది ఎన్నికల కోసం కాదన్నారు. ఆయా వర్గాల అభ్యున్నతికి అభివృద్ధి కోసమేనని అన్నారు. ఎస్‌సి, ఎస్‌టిలకు తొలిసారిగా చట్టరూపం కల్పించిన ఘనత కాంగ్రెస్‌ పార్టీకే దక్కిందన్నారు. దేశంలో ఎక్కడా ఇలాంటి చట్టం లేదన్నారు. అసెంబ్లీ చరిత్రలోనే ఇటువంటి చట్టం రావడం ఇదే తొలిసారి అని అన్నారు. సుదీర్ఘ చర్చ తర్వాతే ఎస్‌సి, ఎస్‌టి సబ్‌ ప్లాన్‌ చట్టరూపం దాల్చిందన్నారు. చట్టంలో ఏవైనా లోపాలు ఉంటే సరిదిద్దుకుంటామన్నారు. పెరిగిన జనాభాకు అనుగుణంగానే నిధులను కేటాయిస్తామని చెప్పారు. ఈ ఏడాది ఎస్‌సి బాలికల కోసం 100, ఎస్‌టి బాలికల కోసం 250 హాస్టళ్లను నిర్మిస్తున్నామని తెలిపారు. రైతుకూలీని రైతుగా చేసేందుకే ఇందిరజలప్రభ పథకం చేపట్టామని తెలిపారు. అనంతరం శాసనమండలి గురువారం నాటికి వాయిదా పడిరది. అంతకుముందు శాసనసభలో బంగారు తల్లి పథకానికి ఆమోదం లభించింది. మహిళల అభ్యున్నతి కోసమే ఈ పథకానికి చట్టబద్ధత కల్పించినట్లు ముఖ్యమంత్రి కిరణ్‌ తెలిపారు.