తమను ఆదుకోవాలని రైతుల వినతి
తాళ్లూరు, జూలై 18 : మండలంలోని నాగంబొట్లవారిపాలెం గ్రామానికి చెందిన ఎస్సీ రైతులు బుధవారం ఎండివో సిహెచ్ హనుమంతరావును కలిసి తమను ఆదుకోవాలని ఏకరువు పెట్టారు. ఈ గ్రామానికి చెందిన దాదాపు 15 మంది ఎస్సీ రైతులు తమ పొలాల్లో ఎన్ఆర్ఇజిఎస్ పథకంలో భాగంగా వనసంక్షరణ పథకం క్రింద మామిడి, టేకు మొక్కలను పెంచుతున్నామని అయితే ఇప్పటి వరకు ఎన్ఆర్ఇజిఎస్ అధికారులు, పై అధికారులెవరూ తమ మొక్కల పోషణ విషయమై ఎలాంటి గ్రాంటును విడుదల చేయాలని దీని వలన తాము తీవ్రంగా నష్టపోయామని తమను ఆదుకోవాలని ఎండివోకు విన్నవించుకున్నారు. గ్రామానికి చెందిన రావినూతల యాకోబు తన పొలంలో 200 మామిడి మొక్కలను వేశానని, వీటి నిర్వహణ కోసం మూడు సంవత్సరాలకు గాను మూడు వేల రూపాయలు ప్రభుత్వం విడుదల చేయాల్సి ఉండగా ఇప్పటి వరకు ఎలాంటి సహకారం అందలేదని కనీసం ఎన్ఆర్ఇజిఎస్ అధికారులు మొక్కలను పరిశీలించి తగిన పారితోషికం అందించే ఏర్పాట్లు చేయలేదని వాపోయాడు. అదే విధంగా గ్రామంలోని అనేక మంది రైతులు మొక్కలు నాటిన తరువాత ప్రభుత్వం ఇచ్చే సదుపాయాలు తమకు అందలేదని దీని వలన మామిడి మొక్కల పోషణ కొరకు తాము కూలీ చేసుకొని వచ్చిన డబ్బును వినియోగిస్తున్నామని ఇప్పటికైనా అధికారులు వీటిని గమనించి తమకు రావాల్సిన గ్రాంటును అందించాలని ఎండివోకు విన్నవించారు. అదే విధంగా చనిపోయిన మొక్కలకు బదులు పడి మొక్కలను నూతనంగా కొంతమంది రైతులకు మొక్కలను అందిస్తామని ఎన్ఆర్ఇజిఎస్ అధికారులు బుధవారం రమ్మనడంతో తాము అనేక వందల రూపాయలు ఖర్చుపెట్టి ఇక్కడికి వచ్చామని తీరా ఎపిఓ సమావేశంలో ఉన్నారని, ఇప్పుడు వీలు కాదంటూ చెప్పడంతో తాము తీవ్రంగా నష్టపోతున్నట్లు తమకు కేటాయించిన మొక్కలను వెంటనే అందించాలని రైతులు ఎండివోకు విన్నవించారు. ఎన్ఆర్ఇజిఎస్ అధికారులతో సంప్రదించి మీకు తగిన న్యాయం చేస్తానని ఎండిఓ హనుమంతరావు వారికి హామీ ఇచ్చారు.