తమిళనాడు అభివృద్ధికి సహకరించండి
– ప్రధాని మోదీతో జయ భేటి
న్యూఢిల్లీ,జూన్ 14(జనంసాక్షి):వరుసగా రెండోసారి విజయం సాధించి తమిళనాడు గద్దెను ఎక్కిన ముఖ్యమంత్రి జయలలిత న్యూఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో మంగళవారం భేటీ అయ్యారు. ఎన్‌డిఎ కూటమిలో జయచేరుతుందన్న వార్తలకు బలం చేకూర్చేలా ఆమె భేటీకి రాజకీయంగా ప్రాధాన్యం ఏర్పడింది. కేంద్రానికి పార్లమెంటులో అన్నాడీఎంకే సహకారం, తమిళనాడుకు ఆర్థిక ప్యాకేజీ తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చించినట్లు తెలుస్తోంది. తమిళనాడు ముఖ్యమంత్రిగా వరుసగా రెండోసారి బాధ్యతలు చేపట్టాక జయలలిత… మోదీతో భేటీ కావడం ఇదే తొలిసారి.ఆమె మోదీని కలిసి 29 డిమాండ్లతో కూడిన మెమోరాండం సమర్పించారు. తమిళనాడు రాష్ట్రంకు సంబంధించి పలు సమస్యలను వివరించి ఆర్థిక సాయం అందించాలని కోరినట్టు తెలుస్తోంది. జయలలిత చెన్నై నుంచి ఢిల్లీలోని తమిళనాడు భవన్‌కు చేరుకోగానే తమిళనాడు భవన్ అధికారులు ఆమెకు ఘనస్వాగతం పలికారు. తమిళనాడు రాష్ట్రానికి సంబంధించిన పలు సమస్యలను మోదీ దృష్టికి తీసుకువెళ్లారు.
కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వంలో అన్నాడీఎంకే చేరనున్నట్టు వార్తలు వస్తున్న నేపథ్యంలో వీరి భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. తమిళనాడులో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే విజయం సాధించి, జయలలిత వరుసగా రెండోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. ఎన్నికల్లో అన్నాడీఎంకే, బీజేపీ వేర్వేరుగా పోటీచేసినా.. ఎన్డీయే ప్రభుత్వంలో అమ్మ పార్టీ చేరవచ్చని వార్తలు వినిపిస్తున్నాయి.