తమిళనాడు బంద్‌ సంపూర్ణం

– ప్రభుత్వానికి వ్యతిరేకంగ ఆందోళన చేపట్టిన ప్రతిపక్షాలు
– స్వచ్చందగా బంద్‌లో పాల్గొన్న ప్రజలు
– కనిమొళిని అదుపులోకి తీసుకున్న చెన్నై పోలీసులు
చెన్నై, మే25(జ‌నంసాక్షి) : తూత్తుకూడిలో పోలీసులు కాల్పులు జరపడాన్ని నిరసిస్తూ డీఎంకే సహా ప్రతిపక్షాలు శుక్రవారం తమిళనాడులో పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టాయి. శుక్రవారం తెల్లవారు జామునుండే డీఎంకే, ఇతే ప్రతిపక్ష పార్టీల కార్యకర్తలు రోడ్లపైకి వచ్చి బస్సులను నిలిపివేశారు. ఉదయం  నుంచి ప్రధాన నగరాల్లో మోటార్‌సైకిల్‌ ర్యాలీలతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేశారు. చెన్నైలోని ఎగ్మోర్‌లో డీఎంకే ఎంపీ కనిమొళి ఆందోళన నిర్వహించారు. ప్రభుత్వం తీరును ఎండగట్టారు. ఈ సందర్భంగా భారీగా కార్యకర్తలకు అక్కడకు చేరుకున్నారు. దీంతో పోలీసులు కనిమొలిని అదుపులోకి తీసుకొనే క్రమంలో కార్యకర్తలకు, పోలీసులకు తీవ్ర తోపులాట చోటు చేసుకుంది. కార్యకర్తలను చెదరగొట్టిన  పోలీసులు  కనిమొళిని అదుపులోకి తీసుకున్నారు. రాష్ట్ర బంద్‌ సందర్భంగా కనిమొళి విూడియాతో మాట్లాడుతూ… పళనిస్వామి ప్రభుత్వం ప్రజల రక్తం పీల్చుకు తింటోందని మండిపడ్డారు.  తూత్తుకూడి మారణకాండకు ముఖ్యమంత్రి బాధ్యత వహించాలని డిమాండ్‌ చేశారు. స్టెరిలైట్‌ సీఈవో తమ ఫ్యాక్టరీ మూసెయ్యబోమని చెబుతున్నారు. ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నా… ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు. కనిమొళితో పాటు విదుతలై చిరుతైగల్‌ కచ్చి (వీఎస్‌కే) నేత తిరుమవళవన్‌ను కూడా పోలీసులు అరెస్ట్‌ చేసి తరలించారు. మరోవైపు డీఎంకే నేత స్టాలిన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ పళనిస్వామి ప్రభుత్వం విధానాలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇదిలా ఉంటే స్టెరిలైట్‌ రాగి ఫ్యాక్టరీని విస్తరించడాన్ని నిరసిస్తూ మంగళవారం ఆందోళనకు దిగిన వారిపై పోలీసులు కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే. దీంతో 9మంది అదేరోజు ప్రాణాలు కోల్పోగా.. మరో నలుగురు చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా నగరంలో 144 సెక్షన్‌ విధించారు. సున్నితంగా గుర్తించిన ప్రాంతాల్లో భారీ ఎత్తున పోలీసులను మోహరించారు. ముందు జాగ్రత్తగా ఐదురోజుల పాటు ఇంటర్నెట్‌
సేవలను సైతం నిలిపివేశారు. కాలుష్య నియంత్రణ మండలి ఆదేశాల మేరకు ఇప్పటికే స్టెరిలైట్‌ ఫ్యాక్టరీకి విద్యుత్‌ నిలిపివేశారు.