తమిళనాడు సర్కారు చారిత్రాత్మక నిర్ణయం
` గవర్నర్ వద్ద పెండిరగ్‌లో ఉన్న బిల్లులను చట్టాలుగా చేసిన సీఎం స్టాలిన్
` చరిత్రలో తొలిసారి రాష్ట్రపతి, గవర్నర్ ఆమోదం లేకుండానే 10 చట్టాలను నోటిఫై చేసిన అసెంబ్లీ
` ఈమేరకు గెజిట్ నోటిఫికేషన్ విడుదల
చెన్నై(జనంసాక్షి):పెండిరగ్ బిల్లుల విషయంలో సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చిన వేళ.. తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.రాజ్యాంగ చరిత్రలో తొలిసారి రాష్ట్రపతి, గవర్నర్ ఆమోదం లేకుండానే రాష్ట్ర ప్రభుత్వం 10 చట్టాలను నోటిఫై చేసింది. ఈమేరకు గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చింది శాసనసభ ఆమోదించిన బిల్లులను గవర్నర్ ఆర్‌ఎన్ రవికి పంపగా ఆయన ఎలాంటి సమాధానం ఇవ్వకుండా వాటిని తనవద్దే ఉంచేసుకుంటున్నారని తమిళనాడు ప్రభుత్వం ఆరోపించిన సంగతి తెలిసిందే. దీనిపై 2023లో సుప్రీంకోర్టును ఆశ్రయించింది. బిల్లుల్ని సమ్మతించకపోవడం, పునఃపరిశీలించాలని సూచిస్తూ వెనక్కి కూడా పంపడం లేదని తెలిపింది. రెండోసారి ఆమోదించిన బిల్లుల విషయంలోను ఆయన తీరు మార లేదంటూ పిటిషన్‌లో పేర్కొంది. ఈ వ్యవహారంపై ఇటీవల సుప్రీం తీర్పు వెలువరించింది.తమిళనాడు శాసనసభ ఆమోదించిన పది బిల్లులను రాష్ట్ర గవర్నర్ ఆర్.ఎన్.రవికుమార్ తొక్కిపెట్టడం రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. ఏదైనా బిల్లును మంత్రిమండలి సలహా మేరకు రాష్ట్రపతి ఆమోదం కోసం నిలిపి ఉంచాల్సివస్తే అందుకు గవర్నర్ తీసుకోదగిన అత్యధిక గడువు ఒక నెల మాత్రమేనని సంచలనాత్మక తీర్పు వెలువరించింది. శాసనసభ ఆమోదించిన బిల్లులపై గవర్నర్ నిర్దిష్ట గడువులోగా చర్యలు తీసుకోవాలని మంగళవారం పేర్కొంది. ‘’గవర్నర్ 10 బిల్లులను రాష్ట్రపతి ఆమోదం కోసం రిజర్వు చేసి పెట్టడం న్యాయ సమ్మతం కాని ఏకపక్ష చర్య. అందుకే ఆ చర్యను తోసిపుచ్చుతున్నాం’’ అని జస్టిస్ జె.బి.పర్దీవాలా, జస్టిస్ ఆర్.మహదేవన్‌లతో కూడిన ధర్మాసనం పేర్కొంది. పెండిరగులో పెట్టిన పది బిల్లులు గవర్నర్ ఆమోదం పొందినట్టే భావించాలని స్పష్టంచేసింది. శాసనసభ ఆమోదించిన బిల్లులపై గవర్నర్ చర్యలు తీసుకోవడానికి గడువును నిర్దేశిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేయడం ఇదే ప్రథమం. ఒకవేళ మంత్రిమండలి సలహా లేకుండా గవర్నర్ బిల్లు ఆమోదాన్ని నిలిపి ఉంచాలని భావించిన పక్షంలో మూడు నెలల్లోగా అలాంటి బిల్లును శాసనసభకు తిరిగి పంపాలని సూచించింది.గవర్నర్ ఈ కాల నిర్దేశాన్ని పాటించనిపక్షంలో ఆయన చర్యపై కోర్టులు న్యాయసమీక్ష జరపవచ్చని వెల్లడిరచింది. మంత్రి మండలి సలహా మేరకు తప్పనిసరిగా పనిచేయడం తప్ప గవర్నర్‌కు విచక్షణాధికారాలేవీ లేవని, రాజ్యాంగంలోని 200వ అధికరణం కూడా ఇదే విషయాన్ని స్పష్టంచేస్తోందని తెలిపింది. రెండోసారి సమర్పించిన బిల్లును రాష్ట్రపతి ఆమోదం కోసం రిజర్వు చేసి ఉంచే అధికారం గవర్నర్‌కు లేదంది. సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు చరిత్రాత్మకమని తమిళనాడు సీఎం స్టాలిన్ అభివర్ణించిన సంగతి తెలిసిందే.