తల్లిపాలు విశిష్టమైనవి : జెసి
శ్రీకాకుళం, ఆగస్టు 3 : తల్లిపాలు విశిష్టమైనవని అదనపు జాయింట్ కలెక్టర్ ఆర్.ఎస్.రాజ్‌కుమార్ అన్నారు. తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా శుక్రవారం ప్రపంచ తల్లిపాల దినోత్సవాన్ని స్థానిక బాపూజి కళామందిర్‌లో జరిగింది. ఈ కార్యక్రమం జిల్లా మహిళా శిశు అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో జరిగింది. ముఖ్య అతిధిగా జెసి పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. తల్లిపాల విశిష్టతను గుర్తించాలని అన్నారు. సమాజంలో బాల్య వివాహాలు నివారించాలని అన్నారు. రక్తహీనతతో పుట్టే బిడ్డలు బలహీనంగా ఉంటున్నారని, బాలింతలకు పౌష్టికాహారం అందించి, ఆరోగ్యంగా ఉండేలా చూడాలన్నారు. రిమ్స్ మహిళా విభాగ అధిపతి డాక్టర్ అరవింద్‌చే అంగన్‌వాడీ కార్యకర్తలకు ప్రత్యేక పునశ్చరణ తరగతులు నిర్వహించాలని సూచించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ ఎం.శారద మాట్లాడుతూ పట్టణాల్లో శిశువులకు పాలు ఇచ్చే తల్లులు సంఖ్య బాగా తగ్గిందని అన్నారు. దీంతో పిల్లలకు అనేక వ్యాధులు సంక్రమిస్తున్నాయని అన్నారు. రిమ్స్ మహిళా విభాగం అధిపతి డాక్టర్ ఆర్.అరవింద్ మాట్లాడుతూ పుట్టిన గంటలోపే తల్లిపాలు శిశువుకు ఇవ్వాలని, ఆరునెలల వరకు తల్లిపాలు ఇస్తే ప్రత్యామ్నాయ ఆహారం అవసరం లేదన్నారు. ఐక్యరాజ్యసమితి ఆరోగ్య విభాగం డబ్బాపాలపై కఠినమైన నిబంధనలు పెట్టినప్పటికి వాటిపై మొగ్గు చూపేవారి సంఖ్య అధికంగా ఉందని అన్నారు. దానితో పిల్లల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని అన్నారు. వయోజన విద్యాశాఖ ఉపసంచాలకులు కె.నాగేశ్వర రావు మాట్లాడుతూ వయోజన విద్యా కార్యక్రమంలో వాచకాల్లో ఎక్కువ భాగం మహిళలకు ఉపయోగపడే అంశాలను పొందుపరచడం జరిగిందన్నారు. జిల్లా పౌరసంబంధాల అధికారి ఎల్.రమేష్ మాట్లాడుతూ ఆరోగ్యకరమైన సమాజస్థాపనకు తల్లిపాలు ఎంతో ముఖ్యమని, తల్లిపాలలో వ్యాధినిరోధక శక్తి వుండడంతో పిల్లలు ఆరోగ్యంగా ఉంటారని, దాంతో ఆరోగ్యకర భవిష్యత్ భారతం ఆవిష్కృతం కాగలదని పౌరసంబంధాల శాఖ అధికారి రమేష్ అన్నారు. ఈ కార్యక్రమంలో ఐఆర్‌సి స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి పి.వి.వి. ప్రసాద్, యువ విజ్ఞాన పరిషత్ ప్రతినిధి ఎష్.టి.వి.రామాచార్యులు, ఐసిడిఎస్ ప్రాజెక్టు అధికారులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.