తాగునీటి పనులకు అనుమతులు

4

మహబూబ్‌నగర్‌ ఎత్తిపోతల పథకానికి నిధులు మంజూరు చేసిన సీఎం కేసీఆర్‌

హైదరాబాద్‌,ఫిబ్రవరి6(జనంసాక్షి): తెలంగాణలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తెలంగాణ స్టేట్‌ డ్రింకింగ్‌ వాటర్‌ గ్రిడ్‌, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పధకానికి మొదటిదశ పనుల నిమిత్తం  నిధులు మంజురు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వీటికి సంబంధించిన పరిపాలన అనుమతి ఇస్తూ సంబంధిత ఫైళ్ల పై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు సంతకం చేశారు. వాటర్‌ గ్రిడ్‌ పధకంలో మొత్తం 9జిల్లాల్లో 26 సెగ్మెంట్‌ లకు సంబందించి చేపట్టాల్సిన పనులపై అధికారులు నివేదికను ప్రభుత్వానికి సమర్పించారు. ఇందులో భాగంగా మొదటి విడత 14సెగ్మెంట్లలో పనులు ప్రారంభించేదుకు రూ.1518.52 కోట్ల మేర పరిపాలన అనుమతులు మంజూరు చేశారు. ఈ నిధులతో  ఇంటేక్‌ వెల్స్‌, వాటర్‌ ట్రీట్‌ మెంట్‌ ప్లాంట్స్‌, రా వాటర్‌ పంపింగ్‌ మెయిన్‌, హైటెన్షన్‌ పవర్‌ సప్లయ్‌ పనులు నిర్వహిస్తారు. వాటర్‌ గ్రిడ్‌ పనుల కోసం నీటి పారుదల శాఖ కృష్ణా,గోదావరి బేసిన్లలో 39.272 టిఎంసిల నీటిని వాటర్‌ గ్రిడ్‌ నిర్వాహణ కోసం కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నది. నీటి పారుదల శాఖ ప్రాజెక్టల్లో 10శాతం నీటిని మంచినీటికి కేటాయించాలనే ప్రభుత్వ విధానానికి అనుసరించి ఈనిర్ణయం జరిగింది. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పధకానికి సంబంధించి మొదటి దశ పనులు చేయడానికి 14,350 కోట్ల పరిపాలన అనుమతులు ఇస్తూ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు నిర్ణయం తీసుకున్నారు. జూరాల రిజర్వాయర్‌ నుండి కోయిల్‌ కొండ వరకు 70 టిఎంసిల నీటిని ఎత్తిపోయటానికి మొదటి దశ పనుల చేపడతారు. ఈపనులకు సంబంధించిన పూర్తి సర్వే నిర్వహించి, సవివరమైన పథక  నివేదిక సమర్పించిన అధికారులు ప్రతిపాదించిన మేరకు ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు. ఈ లిప్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టు ద్వారా 3 జిల్లాల్లో 10 లక్షల ఎకరాలను సాగులోకి తేవడంతో పాటు చాలా ప్రాంతాలకు మంచినీరు కూడా అందిస్తారు.