తాగ్యాల పునాదులపై స్వార్థ రాజకీయ శక్తులు

టీఆర్‌ఎస్‌ మెదక్‌ జిల్లా మాజీ అధ్యక్షుడు, ముఖ్య నాయకుడు, ఇప్పుడు ఆ పార్టీ బహిష్కృత నేత రఘునందన్‌రావు కొన్ని రోజులుగా మీడియా ఎదుట మాట్లాడుతున్న తీరును చూస్తే యావత్‌ తెలంగాణ నివ్వరబోతోంది. టీఆర్‌ఎస్‌ అధినేత కె. చంద్రశేఖర్‌రావు సొంత జిల్లాకు పార్టీ అధ్యక్షుడిగా రఘునందన్‌రావుకు ఒకప్పుడు ఉన్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. స్వతహాగా న్యాయవాది అయిన రఘునందన్‌ తన వాగ్ధాటితో వైరి పక్షాన్ని ముప్పుతిప్పలు పెట్టేవారు. తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా మాట్లాడేవారిని తన చురుకైన మాటలతో, ప్రశ్నలతో ఇరుకున పెట్టేవారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షను మీడియా ఎదుట బలంగా చెప్పిన వారిలో రఘునందన్‌ ఒరు. ఇదంతా ఒకప్పుడు ఆయన ఉద్యమ పార్టీలో లేరు. ఉద్యమ పార్టీ ఆయన్ను బహిష్కరించింది. తెలంగాణ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నారని, తెలంగాణ వ్యతిరేకులతో చేతులు కలుపుతున్నారని కన్నెర్ర జేసింది. ఇంతకాలం ఆయన్ను తన భుజాలపై మోసి ఓ నేతగా ప్రమోట్‌ చేసిన పార్టీ, రఘునందన్‌ అంటే ఎవరో తెలియని వ్యక్తిని రాష్ట్ర ప్రజలందరికీ తెలిసేలా చేసిన పార్టీ అతడ్ని కాదనుకుంది. ఆ విషయాన్ని టీఆర్‌ఎస్‌ పార్టీ అతడికి ముందస్తుగా చెప్పి బయటికి పంపి ఉంటే బాగుండేది. కానీ ఫక్తు రాజకీయ పార్టీగా రూపాంతరం చెందిన ఉద్యమ పార్టీ రఘునందన్‌ వ్యవహారంలో రాజకీయ పంథానే అవలంబించింది. చాటుమాటుగా తెలంగాణ వ్యతిరేక శక్తి టీడీపీ అధినేత చంద్రబాబునాయుడ్ని కలిసినందుకు పార్టీ నుంచి వెలివేసింది. దీంతో అప్పటి వరకు గులాబీ కండువా భుజానా వేసుకొని, తెలంగాణ భవన్‌ వేదికగా ప్రజల పక్షాన, పార్టీ పక్షాన గొంతెత్తిన రఘునందన్‌లో మార్పు వచ్చింది. ఇంతకాలం తాను సేవ చేసిన పార్టీ బహిష్కరించిందనే అక్కసు, ఆవేశం ఆయనలో ఉండొచ్చేమో కానీ, అంతకు కొద్ది రోజుల ముందు వరకూ తాను అనుసరించిన మార్గం నుంచి ఒక్కసారిగా వైదొలిగాడు. తెలంగాణ ప్రజల పక్షాన కాకుండా తెలంగాణ వ్యతిరేకుల పక్షాన చేరి తెలంగాణ ఉద్యమ నాయకులపై ఆరోపణలు గుప్పించడం మొదలు పెట్టారు. రఘునందన్‌ ఆరోపణలు చేసేందుకు ఎంచుకున్న సమయం సరైంది కాదు కాబట్టి ఇప్పుడు ఆయన మాటల ప్రభావం తెలంగాణ ప్రజలపై అంతగా లేదు. రఘునందన్‌ టీవీలో మాట్లాడుతుంటే సీమాంధ్ర పెట్టుబడిదారి శక్తుల చేతిలో మరబొమ్మ మాదిరిగా అనిపిస్తున్నాడు. ఆయన్ను చూసి తెలంగాణ ప్రజలు జాలి పడుతున్నారే తప్ప ఆయన చెప్పే మాటలను అంతగా విశ్వాసంలోకి తీసుకోవడం లేదు.
టీఆర్‌ఎస్‌ నుంచి బహిష్కరించిన మరుసటి రోజే మీడియాతో మాట్లాడిన రఘునందన్‌.. తాను, కేసీఆర్‌, హరీశ్‌, కేటీఆర్‌, కవిత అంతా వెలమ కులస్తులమే అయినప్పటికీ ఎందుకో తనపై మాత్రమే వేటు వేశారని వాపోయాడు. తాను వెలమ కాబట్టే చట్టసభల ఎన్నికల్లో టికెట్‌ ఇవ్వలేదని చెప్పుకొచ్చాడు. తెలంగాణ ఉద్యమాన్ని అడ్డుపెట్టుకొని చట్టసభలో అడుగుపెట్టాలనే తన ఆకాంక్షను బహిర్గతపరిచాడు. కేసీఆర్‌ కుటుంబానికి మాత్రమే పదవులు ఇస్తూ అదే వెలమ కులానికి చెందిన తనను విస్మరిస్తున్నారని మండిపడ్డాడు. విద్యార్థులు, యువత త్యాగాలమీద నిర్మితమైన తెలంగాణ ఉద్యమ సాక్షిగా తన స్వార్థం రాజకీయాలు నెరవేర్చుకోవాలని రఘునందన్‌ వ్యూహం రూపొందించుకున్నారు. ఆ వ్యూహం టీఆర్‌ఎస్‌లో తీరేట్టు కనిపించక పోవడంతో తెలంగాణ వ్యతిరేక శక్తులతో చేతులు కలిపాడు. తన అక్కసును ఉద్యమంపై వెళ్లగక్కాడు. ఆయన టార్గెట్‌ తెలంగాణ ఉద్యమంతో పాటు సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌ కూడా అనిపిస్తోంది. హరీశ్‌ పద్మాలయం స్టూడియో యజమాన్యం నుంచి రూ.80 లక్షల ముడుపులు తీసుకున్నట్టుగా ఆరోపించాడు. ఆయన వైఎస్సార్‌ను కలిస్తే లేని తప్పు తాను చంద్రబాబును కలిస్తే వచ్చిందా అంటూ కొత్త పల్లవి అందుకున్నాడు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడలేదంటూనే తెలంగాణకు బద్ధ వ్యతిరేకి చంద్రబాబును కలిసినట్టుగా అంగీకరించాడు. రఘునందన్‌ మీడియాతో మాట్లాడిన మరుసటి రోజే టీడీపీ మెదక్‌ జిల్లా అధ్యక్షుడు ఆయన తమ పార్టీలో చేరే తేదీని ప్రకటించాడు. రఘునందన్‌ టీఆర్‌ఎస్‌కు ద్రోహం చేసినట్టుగా ఎవరూ భావించడం లేదు. అసలు తెలంగాణ ప్రజలకు టీఆర్‌ఎస్‌తో, కేసీఆర్‌తో ఏ సంబంధమూ లేదు. తెలంగాణ ఉద్యమం మాత్రమే ఆ పార్టీని ప్రజలకు చేరువ చేసింది. ఆ క్రమంలోనే రఘునందన్‌కు నేతగా గుర్తింపు లభించింది. ఇప్పుడు మొత్తం తెలంగాణ ఉద్యమానికి ఆయన ద్రోహం చేసినట్టుగా ప్రజలు భావిస్తున్నారు. నిజంగా తెలంగాణ ఉద్యమం మాటున ఎవరైన డబ్బులు తీసుకొని ఉంటే రఘునందన్‌ పార్టీలో ఉన్నప్పుడే బయటపెట్టాల్సింది.
పార్టీ అంతర్గత సమావేశాల్లో చర్చకు తేవాల్సింది. ఆరోజు ఆయన నిశబ్దంగా ఉన్నాడంటే అవినీతిని ప్రోత్సహించినట్టే. లేదా అందులో ఆయనకూ భాగస్వామున్నట్టే. అప్పుడు మాట్లాడకుండా ఉండి ఇప్పుడు ఆరోపణలు చేయడం ఉద్యమాన్ని పలుచన చేయడమే. తెలంగాణ ప్రాంతంలో ఉన్న వెలమ కులస్తుల సంఖ్యతో పోలిస్తే పదవుల్లో వున్న వారు, చట్టసభలకు ప్రాతినిధ్యం వహిస్తున్న వారి శాతాన్ని పోల్చుకుంటే ఎక్కువే ఉన్నారని కేసీఆర్‌ పేర్కొన్నారు. వెలమ అయినంత మాత్రాన పదవులు ఇవ్వాలని లేదని, మిగతా కులాలకు ఇవ్వాల్సి ఉందన్నారు. ఇక్కడ కేసీఆర్‌ వ్యాఖ్యలు ఆహ్వానించదగ్గవే. అయితే వెలమల్లో రఘునందన్‌ మాత్రమే కాదు, కేటీఆర్‌, హరీశ్‌, కవిత కూడా ఉన్నారు. వారి స్థానంలో కూడా పార్టీ జెండాలు మోస్తున్న కార్యకర్తలు ప్రాధాన్యం ఇస్తే మంచిది. తెలంగాణ ఉద్యమం పేరుతో నాయకులుగా చెలమణీలో ఉన్నవారు ఒకటి గుర్తుంచుకోవాలి.. తెలంగాణ ఉద్యమం త్యాగాల పునాదులపై ఏర్పడింది. దానిని విస్మరించి స్వార్థంతో రాజకీయ లబ్ధికోసం తహతహలాడే వారికి ప్రజలు తగిన గుణపాఠం చెప్పి తీరుతారు.