తుత్తుకూడిలో కాల్పులు ఎలా జరుపుతారు?

అమాయకులపై ప్రతాపమా?
మండిపడ్డ విపక్ష నేత స్టాలిన్‌
చెన్నై,మే23( జ‌నం సాక్షి):  స్టెరిలైట్‌ వ్యతిరేక ఆందోళనకారులపై కాల్పులు జరపమని అసలు ఎవరు ఆదేశాలు ఇచ్చారంటూ డీఎంకే నేత స్టాలిన్‌ పోలీసులను ప్రశ్నించారు. తమిళనాడులోని తూత్తుకుడిలో స్టెరిలైట్‌ విస్తరణకు వ్యతిరేకంగా చేస్తున్న ఆందోళన హింసాత్మకంగా మారి పదకొండు మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై స్టాలిన్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రభుత్వంపై మండిపడ్డారు. స్టాలిన్‌ వరుస ట్వీట్ల ద్వారా పళనిస్వామి ప్రభుత్వానికి పలు ప్రశ్నలు సంధించారు.
‘ఆందోళనకారులపై కాల్పులు జరపమని పోలీసులను ఎవరు ఆదేశించారు? ఆందోళనకారులను చెదరొట్టేందుకు ఆటోమేటిక్‌ ఆయుధాలు ఎందుకు ఉపయోగించారు? దీనికి ఏ చట్టం కింద అనుమతి ఉంది..? వాళ్లకు గాయాలు కాకుండా ఉండే విధమైన రబ్బర్‌/ప్లాస్టిక్‌ తూటాలను ఎందుకు ఉపయోగించలేదు? కాల్పులకు ముందు ఎందుకని హెచ్చరికలు చేయలేదు’? అని స్టాలిన్‌ ట్విటర్‌ ద్వారా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.గత 100 రోజుల నుంచి స్టెరిలైట్‌కు వ్యతిరేకంగా స్థానికులు ఆందోళన చేస్తుంటే దాన్ని పరిష్కరించేందుకు ఎందుకని సీఎం పళనిస్వామి తమ ప్రతినిధులను పంపించలేదు? ఇన్ని రోజుల్లో విూ ప్రభుత్వం ఏం చేసింది? తూత్తుకుడి వాసుల ఆందోళనపై ప్రభుత్వం ఏ విధమైన చర్యలు తీసుకుంది.’ అని స్టాలిన్‌ ప్రశ్నల వర్షం కురిపించారు. స్టెరిలైట్‌ ఆందోళన జరుగుతున్న ప్రదేశంలో శాంతి, భద్రతలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ఎందుకని ఎక్కువ మంది పోలీసులను నియమించలేదు. ఇదంతా స్టేట్‌ ఇంటెలిజెన్స్‌ అధికారుల వైఫల్యమే.’ అని ఆయన మండిపడ్డారు. తూత్తుకుడి ఘటనకు నిరసనగా ఈనెల 25న పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టేందుకు స్టాలిన్‌ పిలుపునిచ్చారు.
—————-