తుత్తుకూడి ఘటనపై సినీ పెద్దల ఆగ్రహం

ప్రజాందోళనపై ప్రధాని స్పందించాలని డిమాండ్‌
బాధిత కుటుంబాలకు పరామర్శ
చెన్నై,మే23( జ‌నం సాక్షి): భూగర్భ జలాలు కలుషితమవడానికి కారణమవుతున్న తమిళనాడులోని తూత్తుకుడిలో వేదాంత కంపెనీకి చెందిన స్టెరిలైట్‌ కాపర్‌ యూనిట్‌ విస్తరణ పనులను వ్యతిరేకిస్తూ గత వంద రోజులుగా అక్కడి ప్రజలు ఆందోళనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆస్తుల విధ్వంసానికి వారు పూనుకున్నారు. ఈ నేపథ్యంలో, తమిళనాడు అట్టుడుకుతోంది. దీనిపై పలువురు తమిళ సినీ పరిశమ్రకి చెందిన సినీ నటులు కూడా స్పందిస్తున్నారు. ఆందోళనకారులను నిలువరించే ప్రయత్నంలో పోలీసులు జరిపిన కాల్పుల్లో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. మక్కల్‌ నీది మయ్యమ్‌ అధినేత కమల్‌ హాసన్‌ కాల్పుల్లో మరణించిన వారికి సంతాపం ప్రకటించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించి వారికి ధైర్యం అందించారు. ఇక స్టార్‌ డైరెక్టర్‌ శంకర్‌ తూత్తుకుడి ఘటనని ఖండిస్తూ, మృతుల కుటుంబాలకి ప్రగాఢ సానుభూతి తెలిపారు. నటుడు, నిర్మాతల మండలి అధ్యక్షుడు విశాల్‌ కూడా తూత్తుక్కుడి సంఘటనపై స్పందిస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు. తూత్తుక్కుడి స్టెర్‌లైట్‌ పోరాటంలో ప్రజలు దారుణంగా హత్య చేయబడడాన్ని తాను తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. దీనిపై ప్రధాని స్పందించాలని కోరారు. 50వేల మంది కలిసి చేస్తున్న పోరాటం కచ్చితంగా సామాన్య ప్రజల కోసమేనన్నారు విశాల్‌. పోరాటం ప్రజాస్వామ్యంలో హక్కు అని, అందులో ప్రజలెందుకు పాల్గొనకూడదని ప్రశ్నించారు. ప్రభుత్వం అన్నది ప్రజల కోసమేనని, మరోదానికోసం కాదని అన్నారు. ప్రజలు 2019 ఎన్నికల గురించి ఆలోచించాలని ఈ సందర్భంగా విశాల్‌ వ్యాఖ్యానించారు. దక్షిణ భారత నటీనటుల సంఘం కూడా ఈ ఘటనని ఖండించింది.