తుపాన్లకు ముందస్తు సన్నద్దత
అధికారులకు కలెక్టర్ సూచన
కాకినాడ,జూలై5(జనం సాక్షి): జిల్లాలో జులై నుంచి అక్టోబరు మాసాల మధ్యలో వరదలు తుపానులు వచ్చే అవకాశం ఉన్నందున వీటిని ఎదుర్కొనేందుకు ప్రత్యేక ప్రణాళికతో వివిధ శాఖల అధికారులు సిద్ధంగా ఉండాలని కలెక్టర్ కార్తికేయ మిశ్రా ఆదేశించారు. వరదలు-తుపానులు సమయంలో ఆయా శాఖలు ముందస్తు ప్రణాళిక వేసుకుని అప్రమత్తంగా ఉండి వాటిని అమలు చేయాలని సూచించారు. ప్రకతి వైపరీత్యాలు ఎదుర్కొనేందుకు మండల స్థాయిలో వివిధ శాఖల అధికారులతో ఏర్పాటు చేసుకోవడంతో పాటు మండల స్థాయిలో సమావేశాలు ఏర్పాటు చేయాలని తహశీల్దార్లకు కలెక్టర్ సూచించారు. నీటి ప్రవాహం హెచ్చుగా ఉండే ప్రాంతాలను ముందుగా గుర్తించి ఆయా ప్రాంతాలలో జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు. బలహీనమైన గట్లు ఉన్న ప్రాంతాల్లో గట్లను బలపరచాలని ఆయన ఆదేశాలు ఇచ్చారు. పౌర సరఫరాల శాఖ ద్వారా అవసరమైన నిత్యావసర వస్తువుల నిల్వలు, మత్స్య శాఖ ఆధ్వర్యంలో మత్స్యకారులకు అవసరమైన హెచ్చరికలు, పశుసంవర్థక శాఖ ఆధ్వర్యంలో పశువుల సంరక్షణ చేపట్టాలని సూచించారు. వరదలు తుపానుల సమయంలో వినియోగించే సామగ్రి, పరికరాల పని తీరును ముందుగానే పరిశీలించాలన్నారు. వరదలు-తపానులపై వాతావరణ శాఖ ఇచ్చే హెచ్చరికలకు అనుగుణంగా అప్రమత్తంగా ఉండి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. జిల్లాలోని కోస్తా ప్రాంతంలో ఉన్న తుపాను షెల్టర్లు పరిస్థితిను పరిశీలించి నివేదికను అందజేయాలని కలెక్టర్ ఆదేశించారు. వరదలు-తుఫానులు వచ్చే సమయంలో అవసరమైతే లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు చేర్చడానికి అనువైన ప్రదేశాలను సూచించాలనీ ఆయన ఆదేశించారు. గ్రామ పంచాయతీలలో క్లోరినేషన్ పారిశుధ్య పనులను చేపట్టాలని తాగునీటి కొరత లేకుండా చూడాలని కలెక్టర్ ఆదేశాలు ఇచ్చారు. గోదావరి నదికి వరదల సమయంలో జిల్లాలో కొత్తగా విలీనమైన ఎటపాక డివిజన్లోని నాలుగు మండలాల్లో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. వరదలు-తుపానుల సమయంలో వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి అవసరమైన మందులను ముందస్తుగానే నిల్వ ఉంచుకోవాలని కలెక్టర్‌ఆదేశించారు. అదేవిధంగా ఆంబులెన్స్ వినియోగం, పాముకాటుకు సంబంధించిన మందులను సిద్ధంగా ఉంచుకోవాలి అన్నారు.
—-