తుమ్మల వ్యూహం ముందు.. కూటమి నేతలు నిలిచేనా


టిఆర్‌ఎస్‌ను నిలవరించేలా భట్టి ప్రచారం చేసేనా?
ఖమ్మం,అక్టోబర్‌13(జ‌నంసాక్షి): మహాకూటమితో కమ్మం జిల్లాలో ఎన్ని సీట్లు వస్తాయన్నది పక్కన పెడితే ఇక్కడ గెలుపు బాధ్యతను భుజాన వేసుకున్న మంత్రి తుమ్మల వ్యూహాలను ఛేదించడం కొంత కష్టమే. ముక్కుసూటిగా మాట్లాడే వ్యక్తిలా కనిపించినా రాజకీయంగా వ్యూహాల్లో తుమ్మల దిట్ట. అందుకే గెలుపును ఆయన భుజాన వేసుకున్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్‌, సీపీఐ కూటమి ఖమ్మం, మధిర, ఇల్లందు, పాలేరు నియోజకవర్గాల్లో గెలుపొందింది. మాజీమంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి మరణంతో పాలేరులో ఉప ఎన్నిక జరగ్గా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విజయం సాధించారు. 2014లో నాలుగు సీట్లు గెలుచుకున్నామని, ఈసారి కొత్త కూటమి ద్వారా మెజార్టీ సీట్లు సాధిస్తామన్న ధీమా కూటమి నేతల్లో కన్పిస్తోంది. మూడు పార్టీల
కూటమిని దృష్టిలో ఉంచుకుని టీఆర్‌ఎస్‌ కూడా జిల్లాలో ప్రచారాన్ని వ్యూహాత్మకంగా సాగిస్తున్నందున అందుకు తగిన విధంగా ఎన్నికలకు సిద్ధం కావాలన్నది కాంగ్రెస్‌ ఆలోచన. అయితే జిల్లా కాంగ్రెస్‌ కమిటీ లేకపోవడంతో వర్గాలుగా ఉన్న నేతలను సమన్వయం చేసే బాధ్యత ఎవరన్నది కార్యకర్తలకు అర్థం కాని ప్రశ్న. అయితే కాంగ్రెస్‌ ప్రాచార కమిటీ ఛైర్మన్‌ మల్లు భట్టి విక్రమార్క ఈ బాధ్యతను భుజాన వేసుకున్నారు. తుమ్మల వ్యూహం ముందు ఆయన ఎలా సాగుతారన్నదే ప్రశ్న.  మొత్తం విూద ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్‌తోపాటు టీడీపీ, సీపీఐల కు ఇచ్చే సీట్లను కూడా గెలిపించుకునేందుకు కాంగ్రెస్‌ నేతలు వ్యూహ రచన చేస్తున్నారు. రాష్ట్రస్థాయిలో ఉమ్మడి కార్యచరణ నడుస్తున్నందున జిల్లాస్థాయిలో కూడా ఉమ్మడి కార్యచరణ సిద్ధం కాబోతుంది. కూటమి ఏర్పాటుతో జిల్లాలో ఎక్కువ సీట్లు సాధించాలన్న వ్యూహంతో కాంగ్రెస్‌ కార్యచరణ సిద్ధం చేస్తోంది. మూడు దశాబ్దాలకుపైగా ఉన్న సిద్ధాంత విభేదాలను పక్కకు పెట్టి కాంగ్రెస్‌, టీడీపీ జతకట్టింది. సీపీఐతో కాంగ్రెస్‌కు దోస్తీ సాగుతూనే వస్తోంది. మూడు పార్టీలతోపాటు తెలంగాణ జనసమితి కూటమిలో చేరింది. అయితే సిపిఎం అక్కడక్కడా బలంగానే ఉంది. దాని అధినేత తమ్మినేని వీరభద్రం కూడా ఇక్కడి వాడే. ఆయన వేరుకుంపటితో ముందుకు పోతున్నారు. ఇదో రకంగా కూటమికి కీడుచేసి, టిఆర్‌ఎస్‌కు మేలుచేసేదిగా ఉంది. ఇకపోతే టిజెఎస్‌ స్థాపించిన చూసిన  కోదండరాం కూడా ఇప్పుడు కూటమిలో కలిసి పనిచేస్తున్నారు. మూడు ప్రధాన పార్టీలు తెలంగాణ జనసమితి కలిసి ఈసారి ఎన్నికలను ఎదుర్కొనబోతున్నాయి. ఉమ్మడి జిల్లాలో 10 అసెంబ్లీ సీట్లలో మెజార్టీ సీట్లను కైవసం చేసుకోవాలన్న వ్యూహంతో కాంగ్రెస్‌ కూటమి ఉంది. ఇప్పటికే టీడీపీ పక్షాన సినీ హీరో నందమూరి బాలకృష్ణ మధిర నుంచి సత్తుపల్లి వరకు జిల్లాలో రోడ్‌షో నిర్వహించారు. ఈ నెల 16, 20, 21 తేదీల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్‌ ప్రచార కమిటీ జిల్లాలో ఎన్నికల ప్రచారం సాగించబోతుంది. ప్రచార కమిటీ చైర్మన్‌, మధిర మాజీ ఎమ్మెల్యే భట్టి విక్రమార్క సారథ్యంలో జిల్లా నేతలంతా పాల్గొన బోతున్నారు. రాష్ట్ర నేతలతోపాటు జిల్లా నేతలు కలిసి 16న సూర్యాపేట విూదుగా పాలేరు, ఖమ్మం, వైరా  నియోజక వర్గాల్లో రోడ్‌షోలు, సభలు నిర్వహిస్తారు. దసరా అనంతరం 20, 21వ తేదీల్లో బోనకల్లులో సభ నిర్వహించి తల్లాడ, సత్తుపల్లిలో రోడ్‌షోలు, ప్రచార సభలు నిర్వహిస్తారు. అశ్వారావుపేట, కొత్తగూడెంలో రోడ్‌షోలు నిర్వహిస్తారు. ఆ తర్వాత భద్రాచలం, పినపాక, ఇల్లందులో ప్రచారం సాగించనున్నారు. కాంగ్రెస్‌తోపాటు టీడీపీ, సీపీఐలు ఉమ్మడిగా, వేర్వేరుగా ఎన్నికల ప్రచారాన్ని చేపట్టబోతున్నారు. మొత్తంగా ఈ ఎన్నికలు ఇప్పుడు మహాకూటమికి సవాల్‌ కానున్నాయి. కూమి నేతలు ఉమ్మడిగా టిఆర్‌ఎస్‌ను ఎలా ఎదుర్కుంటారన్నది చూడాలి.