తూత్తుకుడిలో ఘటనతో 40 మంది పోలీస్ అధికారులపై బదిలీ వేటు

తమిళనాడు: తూత్తుకుడిలో పోలీస్ కాల్పులను ఖండిస్తూ ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీలు ఇచ్చిన బంద్ కొనసాగుతోంది. వాణిజ్య సంస్థలు స్వచ్చంధంగా బంద్ పాటిస్తున్నాయి. మరోవైపు ఐదుగురు ఐపీఎస్ అధికారుల నేతృత్వంలో భారీగా బలగాలు మోహరించాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా 2వేల మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు చేశారు. తూత్తుకుడిలో హింసాత్మక ఘటనతో 40 మంది పోలీస్ అధికారులపై డీజీపీ బదిలీవేటు వేశారు. బంద్ కారణంగా ఇవాళ జరగనున్న అన్నీ పరీక్షలు రద్దు చేశారు. పోలీస్ కాల్పులకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా పలు పార్టీల కార్యకర్తలు సీఎం, ప్రధాని దిష్టిబొమ్మలను దహనం చేశారు. రాగి ఫ్యాక్టరీ బాధితుల సమస్యలను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని డీఎంకే నేత స్టాలిన్ నిప్పులు చెరిగారు. తూత్తుకుడి ఘటనకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఆయన డిమాండ్ చేశారు. కర్ణాటక ముఖ్యమంత్రిగా కుమారస్వామి ప్రమాణస్వీకారోత్సవానికి వెళ్లాల్సిన స్టాలిన్ తన బెంగళూరు పర్యటన రద్దు చేసుకుని తూత్తుకుడి వెళ్లారు. కమల్ హాసన్ కూడా తూత్తుకుడిలో పర్యటించారు. మరోవైపు గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ప్రజాసంఘాల సభ్యులను ఎండీఎంకే అధినేత వైగో పరామర్శించారు.
స్టెరిలైట్ కాపర్ ప్లాంట్ విస్తరణకు వ్యతిరేకంగా జరుగుతున్న నిరసన మరింత తీవ్ర రూపం దాల్చింది. మంగళవారం జరిగిన హింసాకాండలో 11 మంది మరణించగా, దాదాపు 65 మంది గాయపడ్డారు. క్షతగాత్రులకు అన్నా నగర్‌లోని జనరల్ ఆసుపత్రిలో చికిత్స చేయిస్తున్నారు. ఈ ఆసుపత్రి వద్ద బుధవారం తాజాగా హింసాత్మక సంఘటనలు జరిగాయి. స్థానికులు, పోలీసుల మధ్య ఘర్షణ జరిగింది. దీంతో ఒకరు మరణించగా, ముగ్గురు గాయపడ్డారు. కొందరు నిరసనకారులు రెండు బస్సులకు నిప్పు పెట్టారు. ఇదిలావుండగా, ఈ కాపర్ స్మెల్టింగ్ ప్లాంట్ విస్తరణను నిలిపివేయాలని మద్రాస్ హైకోర్టు మధురై ధర్మాసనం బుధవారం ఆదేశాలు జారీ చేసింది.