తూర్పుగోదావరి జడ్పీ సమావేశం రసాభాస

– శాసనమండలి ఉపాధ్యక్షుడు, ఎమ్మెల్యే మధ్య తీవ్ర వాగ్వాదం
– ఒకరిపై ఒకరు బాటిళ్లు విరుసుకున్న సభ్యులు
కాకినాడ, మే24(జ‌నం సాక్షి) : తూర్పుగోదావరి జిల్లా పరిషత్‌ సమావేశంలో ఇసుక దుమారం రేగింది. జిల్లాలో ఇసుక తవ్వకాలపై వైకాపా సభ్యులు లేవనెత్తిన అంశం గొడవకు దారితీసింది. జిల్లాలో ఉచిత ఇసుక అమలు కావడం లేదని.. ప్రవేటు సంస్థలకు ఇసుకను ధారదత్తం చేస్తున్నారని వైకాపా ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి, ప్రతిపక్ష నాయకుడు సాకా ప్రసన్నకుమార్‌ లేవనెత్తారు. దీనిపై శాసనమండలి ఉపాధ్యక్షుడు రెడ్డి సుబ్రహ్మణ్యం జోక్యం చేసుకుని ఇసుకను వైకాపా నాయకులే దోచుకుతింటున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యే జగ్గిరెడ్డి స్వగ్రామం గోపాలపురంలో ఇసుకను అర్ధరాత్రి తవ్వుకుపోతున్నారని దీనికి ఎమ్మెల్యే కొమ్ము కాస్తున్నారని సుబ్రహ్మణ్యం ఆరోపించారు. దీనిపై గొడవ జరిగి రెడ్డిసుబ్రహ్మణ్యం, జగ్గిరెడ్డిలు ఒకరిపై ఒకరు దస్త్రాలు, వాటర్‌ బాటిళ్లు విసురుకున్నారు. అసభ్య పదజాలంతో ఒకరినొకరు తిట్టుకున్నారు. పరిస్థితి చేయి దాటేలా ఉండటంతో జడ్పీ ఛైర్మన్‌ నవీన్‌కుమార్‌ జోక్యం చేసుకుని సభను కొద్దిసేపు వాయిదా వేశారు. ఈ పరిణామంతో జడ్పీ ప్రాంగణంలో ఒక్కసారిగా ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు సభను అదుపులోకి తెచ్చారు. అనంతరం సభ ప్రారంభమైనప్పటికీ వాగ్వివాదాల మధ్యనే సాగింది.
———————–