తూర్పుగోదావరి జిల్లాలో.. ఘోర రోడ్డు ప్రమాదం! 

– ఆటోను ఢీకొట్టిన టిప్పర్‌ లారీ
– ఆరుగురు దుర్మరణం.. 8 మందికి తీవ్ర గాయాలు
– మృతుల్లో మూడేళ్ల చిన్నారితోపాటు నలుగురు మహిళలు
– వివాహ శుభకార్యారానికి వెళ్లి వస్తుండగా ఘటన
కాకినాడ,జులై3(జ‌నంసాక్షి): తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట పట్టణ శివారులోని సాంబమూర్తి రిజర్వాయర్‌ వద్ద సోమవారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆటోను టిప్పర్‌ లారీ ఢీకొట్టిన ఘటనలో ఆరుగురు మృతిచెందారు. మరో 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల్లో మూడేళ్ల చిన్నారితోపాటు నలుగురు మహిళలు ఉన్నారు. ప్రమాద విషయం తెలుసుకున్న డీఎస్పీ సీహెచ్‌వీ రామారావు, ఇతర పోలీస్‌ సిబ్బంది ఘటన స్థలికి చేరుకొని క్షతగాత్రులను హుటాహుటీన ఆస్పత్రికి తరలించారు. ప్రమాద విషయం తెలుసుకున్న మృతుల, క్షతగాత్రుల కుటుంబ సభ్యులు, బంధులు సంఘటన స్థలానికి చేరుకోవడంతో ఆ ప్రాంతమంతా విషాధ ఛాయలు అలముకున్నాయి. గంటముందే ఇంటి వస్తున్నాం.. అని చెప్పిన కుటుంబ సభ్యులు తిరిగిరాని లోకాలకు వెళ్లారంటూ కుటుంబ సభ్యుల రోధనలతో ఆ ప్రాంతం విషాధంగా మారింది.  డీఎస్పీ సీహెచ్‌వీ రామారావు తెలిపిన వివరాల ప్రకారం.. కాకినాడ గ్రావిూణ మండలం రామేశ్వరానికి చెందిన 15 మంది పెద్దాపురం మండలం వడ్లమూరులో జరిగిన ఓ వివాహ శుభకార్యానికి హాజరై ఆటోలో తిరుగుపయనమయ్యారు. సాంబమూర్తి రిజర్వాయర్‌ సవిూపంలోని ఐదు తూముల వద్ద వీరి ప్రయాణిస్తున్న ఆటోను టిప్పర్‌ లారీ ఢీకొట్టింది. టిప్పర్‌ బలంగా ఢీకొట్టడంతో ఆటో నుజ్జునుజ్జైంది. దీంతోఈ ప్రమాదంలో సాలాది నాగమణి(35), నొక్కు కమలమ్మ(35), పండు(3), ఇంద్రపాలెనికి చెందిన ఆటోడ్రైవర్‌ పెంకె రాజు(50) అక్కడికక్కడే మృతిచెందారు. తీవ్రంగా గాయపడిన వారిని కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ మరో ఇద్దరు మృతిచెందినట్లు డీఎస్పీ పేర్కొన్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం పెద్దాపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఇదిలా ఉంటే ప్రమాదానికి కారణమైన లారీటిప్పర్‌ను గుర్తించేందుకు సీఐ శ్రీనివాస్‌ నాలుగు బృందాలను ఏర్పాటుచేశారు. సామర్లకోట, రంగంపేట, పిఠాపురం, పెద్దాపురం ఎస్సైలను అప్రమత్తం చేసి టిప్పర్‌ లారీని గుర్తించేందుకు బృందాలను పంపించారు. ప్రమాదానికి కారణమైన టిప్పర్‌ లారీని సిరామిక్‌ పరిశ్రమ సవిూపంలో అదుపుతప్పి రహదారికి పక్కకు దూసుకెళ్లినట్లు రంగంపేట పోలీసులు గుర్తించారు. వెంటనే వారు సీఐకు సమాచారం అందించారు. పోలీసులు టిప్పర్‌ లారీని స్వాధీనం చేసుకుని సామర్లకోట పోలీసుస్టేషన్‌కు తరలించారు.