తూర్పులో గోదావరి పరవళ్లు

రాజమహేంద్రవరం,జూలై10(జ‌నం సాక్షి): తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. భారీ వర్షాలకు తోడు ఎగువ నుంచి వస్తున్న వరద నీటితో రాజమహేంద్రవరం వద్ద గోదావరి నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. దీంతో అధికారులు లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. గోదావరిలో ధవళేశ్రం వద్ద వరద ఉధృతంగా ఉంది. ఇకపోత రాజమహేంద్రవరం, కాకినాడ, పెద్దాపురం, రామచంద్రపురం, అమలాపురం, రంపచోడవరం డివిజన్లలో వర్షం జోరుగా కురుస్తోంది. అక్కడక్కడ కాస్త తెరుపునిచ్చినా తర్వాత మళ్లీ వర్షం పడుతోంది. దీంతో ప్రజలు అసౌకర్యానికి గురవుతున్నారు. కోనసీమలో పొలాలు ముంపు బారిన పడ్డాయి. వరి నారుమళ్లు నీటమునిగాయి. నీరు దిగువకు వెళ్లకపోవడంతో వరిసాగు కష్టంగా మారింది. మరొవైపు మెట్ట, తూర్పు డెల్టాలో వరి నారుమళ్లు జోరందుకున్నాయి. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గంలో మంగళవారం కొనసాగాల్సిన వైకాపా అధ్యక్షుడు జగన్‌ పాదయాత్రకు వర్షం కారణంగా అంతరాయం ఏర్పడింది. సోమవారం సాయంత్రం మండపేట నియోజకవర్గంలోని రాయవరంలో జగన్‌ బస చేశారు. మంగలవారం ఉదయం అక్కడనుంచి బయలుదేరి బిక్కవోలు మండలంలో పాదయాత్ర నిర్వహించాల్సి ఉంది. రాత్రి నుంచి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడటం వల్ల పాదయాత్రను మధ్యాహ్నానికి వాయిదా వేశారు. వర్షం తగ్గితే పాదయాత్ర ప్రారంభమవుతుంది. లేదంటే జగన్‌ శిబిరానికే పరిమితమవుతారు.