తెగించికొట్లాడితేనే తెలంగాణ.. బ్రతిలాడితే రాదు
సర్కారు ఆటంకాలు అధిగమించి హైదరాబాద్ చేరుకోండి
మార్చ్‌ను విజయవంతం చేయండి : కేకే శ్రీబైలెళ్లిన బస్సుయాత్ర
తెలంగాణ ప్రజా ఫ్రంట్ మార్చ్‌కు మద్దతు : వేదకుమార్
హైదరాబాద్, సెప్టెంబర్ 13 (జనంసాక్షి) : పోరాటాలతోనే తెలంగాణ సాధ్యమని వివిధ రాజకీయ పక్షాల నేతలు స్పష్టం చేశారు. తెలంగాణ మార్చ్ విజయవంతం చేయడం ద్వారా ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను మరోసారి కేంద్రానికి చాటిచెప్పాలన్నారు. మార్చ్‌ను అడ్డుకునేందుకు చేసే ప్రయత్నాలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ఈనెల 30 నిర్వహించే తెలంగాణ మార్చ్‌కు మద్దతుగా తెలంగాణ యూనైటెడ్ ఫ్రంట్ ఆధ్వర్యంలో అమరవీరుల స్థూపం వద్ద నుంచి బస్సుయాత్ర ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ సీనియర్ నేత కే.కేశవరావు, బీజేపీ
నాయకుడు బండారు దత్తాత్రేయ, టీ-టీడీపీ ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకరరావు, పొలిటికల్ జేఏసీ చైర్మన్ కోదండరామ్, ఉద్యోగ సంఘాల నేతలు దేవీప్రసాద్, శ్రీనివాస్‌గౌడ్, విమలక్క తదితరులు హాజరయ్యారు. అంతకుముందు అమరవీరుల స్థూపానికి నేతలు నివాలులు అర్పించారు. అనంతరం బస్సు యాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేత కేకే మాట్లాడుతూ.. తెలంగాణ కోసం పోరాటాన్ని ఉద్ధృతం చేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణ మార్చ్‌ను అడ్డుకునే ప్రయత్నాలు జరిగినా.. వాటన్నింటినీ ధిక్కరించి విజయవంతం చేయాలని కోరారు. తెలంగాణపై మాట నిలబెట్టుకోలేని కేంద్రాన్ని ప్రతిఘటించాలని పిలుపునిచ్చారు. తెలంగాణ పొలిటికల్ జేఏసీ ఈ నెల 30న తలపెట్టిన తెలంగాణ మార్చ్‌కు అన్ని పార్టీలు మద్దతివ్వాలని ఆయన కోరారు. తెలంగాణ ఎవరు ఏ పట్టినా.. అందరినీ స్వాగతిస్తామని చెప్పారు. తెలంగాణ కోసం చేయాల్సిందంతా చేశామని, ఇక పోరాటమే మిగిలిందన్నారు. అన్ని పార్టీలు తెలంగాణ మార్చ్‌లో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారుతెలంగాణపై నాన్చుడు ధోరణి సరికాదని బీజేపీ నేత దత్తాత్రేయ అన్నారు. తెలంగాణ ఇస్తారో? లేదో? ఏదో ఒక విషయం స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. తెలంగానపై గవర్నర్ నరసింహన్ నివేదిక ఆధారంగా కేంద్ర ప్రభుత్వం నాన్చుడు ధోరణి ప్రవస్తిస్తోందని, నాన్చుతూ పోతే.. రాష్టాన్రికే ప్రమాదమని హెచ్చరించారు. తెలంగాణ మార్చ్‌ను అడ్డుకునేందుకు ప్రభుత్వం అనేక ప్రయత్నాలు చేస్తుందన్నారు. వాటిని తిప్పికొట్టి, మార్చ్‌ను విజయవంతం చేసి, తెలంగాణ ఆకాంక్షను మరోసారి చాటాలని పిలుపునిచ్చారు. తెలంగాణ అంశంపై కాంగ్రెస్ పార్టీ నాటకాలాడుతోందని ఎర్రబెల్లి దయాకరరావు విమర్శించారు. ఇస్తామని ఒకసారి, ఇవ్వమని మరోసారి చెబుతూ ప్రజలను మోసం చేస్తోందని మండిపడ్డారు. ఏదో ఒక స్పష్టమైన స్పష్టమైన నిర్ణయం వెలువరించాలని డిమాండ్ చేశారు. తెలుగుదేశం పార్టీ కూడా త్వరలోనే తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇవ్వనుందని చెప్పారు. ఇక అధికారంలో ఉన్న కాంగ్రెస్సే నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. తెలంగాణ మార్చ్‌కు టీ-టీడీపీ సంపూర్ణ మద్దతునిస్తుందన్నారు. ప్రభుత్వం తెలంగాణపై నెలాఖరులోగా స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని జేఏసీ చైర్మన్ కోదండరామ్ డిమాండ్ చేశారు. లేదంటే, తెలంగాణ సత్తా చూపిస్తామని హెచ్చరించారు. సమరమో, సంధికాలమో ప్రభుత్వమే తేల్చుకోవాలన్నారు. సత్యాగ్రహం తరహాలోనే ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతామన్నారు. కులమతాల పేరుతో తెలంగాణలో చిచ్చు పెట్టేందుకు ప్రభుత్వం యత్నిస్తోందని ఆయన ఆరోపించారు. వీటిని తెలంగాణ ప్రజలు పట్టించుకోరని తెలిపారు. తెలంగాణ కోసం ఎవరి పరిధిలో వారు ఉద్యమించాలని కోరారు. 30వ తేదీన తలపెట్టిన తెలంగాణ మార్చ్‌కు అన్ని పార్టీలు మద్దతు తెలుపుతున్నాయని చెప్పారు. మార్చ్‌ను దిగ్విజయవంతం చేసి, తెలంగాణ సత్తా చాటుతామన్నారు.
తెలంగాణ మార్చ్‌కు టీపీఎఫ్ మద్దతు తెలంగాణ మార్చ్‌కు తెలంగాణ ప్రజా ఫ్రంట్ మద్దతు ప్రకటించింది. మార్చ్‌కు మద్దతు ఇవ్వాలని కోరుతూ పొలిటికల్ జేఏసీ చైర్మన్ గురువారం ప్రజాఫ్రంట్ నేతలను కలిశారు. టీపీఎఫ్ కార్యాలయంలో సంఘం అధ్యక్షుడు వేదకుమార్‌ను కలిసి మార్చ్‌కు మద్దతివ్వాలని కోరారు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో తెలంగాణ కీలక ఘట్టమని, దీన్ని విజయవంతం చేసేందుకు కలిసిరావాలని విజ్ఞప్తి చేశారు. అందుకు వేదకుమార్ సంసిద్ధత తెలిపారు. మార్చ్‌కు తమ పూర్తి మద్దతు ఉంటుందని ప్రకటించారు.