తెదేపా నేతల్లో అసహనం పెరిగిపోయింది
– ఎంపీలు రాజీనామాలు చేయొచ్చు కదా ?
– ఉద్యోగాల పేరుతో కోట్లు దండుకుంటున్నారు
– రాజకీయ ప్రయోజనాలకోసమే దీక్షలు
– బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, ఎమ్మెల్సీ మాధవ్
విశాఖపట్నం, జూన్29(జనం సాక్షి ) : తెలుగుదేశం పార్టీలో అసహనం పెరిగిపోయిందని భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు, ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్ ఎద్దేవా చేశారు. శుక్రవారం విశాఖలో విూడియాతో మాట్లాడిన వారు టీడీపీపై నిప్పులు చెరిగారు. తెలుగుదేశం పార్టీ, సీఎం చంద్రబాబు నాయుడులో అసంతృప్తి పెరిగిపోయిందని, అందుకే బీజేపీ నేతలపై దాడులకు దిగుతోందని దుయ్యబట్టారు. టీడీపీ నేతలు దీక్షలు కేవలం రాజకీయ ప్రయోజనం కోసమేనని ఆరోపించారు. పార్లమెంట్ లాబీలో ఆ పార్టీ ఎంపీలు చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనమని అన్నారు. కడప స్టీల్ ప్లాంట్‌పై బీజేపీ స్పష్టమైన వైఖరిని అవలంభిస్తోందని, ఉక్కు పరిశ్రమ ఇస్తున్నారని తెలిసికూడా రాజకీయాలకు పాల్పడుతున్నారని వారు మండిపడ్డారు. చంద్రబాబు పాలనలో అవినీతి పెరిగిపోయిందన్నారు. ఉద్యోగాల పేరుతో మంత్రులు కోట్లు దండుకుంటున్నారని, మంత్రుల ఇళ్లలోనే నిరుద్యోగుల నుంచి వసూళ్లకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. తెలుగదేశం పార్టీ దీక్షలన్నీ రాజకీయం, మైలేజే కోసమేనని ధ్వజమెత్తారు. నాలుగేళ్లు పనులు చేయకుండా ఉన్న ప్రభుత్వం ఇప్పుడు ఆందోళనలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. టీడీపీ ఎంపీలు ఎందుకు దీక్ష చేస్తున్నారో ప్రజలకు తెలుసునని.. దీక్షలకు బదులు రాజీనామా చేసి పోరాడాలంటూ డిమాండ్ చేశారు. దొంగ దీక్షల ద్వారా ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారంటూ దుయ్యబట్టారు.