తెరపైకి కాంగ్రెస్‌-ఆప్‌ పొత్తు..!

– భాజపాకు వ్యతిరేకంగా ఏకమవుతున్న ప్రతిపక్షాలు

న్యూఢిల్లీ, జూన్‌2(జ‌నం సాక్షి) : 2019లోక్‌సభ ఎన్నికల్లో భాజపాను ఓడించేందుకు ఇప్పటికే ప్రతిపక్షాలన్నీ ఏకమవుతున్నాయి. అందుకు నిదర్శనమే ఇటీవల కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి ప్రమాణస్వీకార కార్యక్రమానికి విపక్ష నేతలందరూ ఒకే వేదికపైకి రావడం. ఈ మేరకు కాంగ్రెస్‌ వేగంగా పావులుకదుపుతోంది. కర్ణాటకలో జేడీఎస్‌తో పొత్తు పెట్టుకొని ప్రభుత్వ ఏర్పాటుకు సహకరించింది. ఇప్పుడు ఈ ఏడాదిలో జరగబోయే మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో బహుజన్‌ సమాజ్‌పార్టీ (బీఎస్పీ)తో చేతులు కలపాలని కాంగ్రెస్‌ భావిస్తోంది. తాజాగా ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆమ్‌ ఆద్మీ పార్టీ(ఆప్‌) కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఈ మేరకు చర్చలు కూడా జరిగినట్లు తెలుస్తోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు పొత్తు అంశంపై చర్చించేందుకు కాంగ్రెస్‌కు చెందిన జైరాం రమేశ్‌, అజయ్‌ మాకెన్‌ గత నెల 24న ఆప్‌ నేతలను కలిసినట్లు తెలుస్తోంది. 5:2 నిష్పత్తిలో సీట్లు పంపకాలు చేసేందుకు ఆప్‌ ఆఫర్‌ ఇచ్చినట్లు సమాచారం. కానీ అందుకు కాంగ్రెస్‌ అంగీకరించడం లేదట. అయితే.. కాంగ్రెస్‌కు రెండు సీట్లకు మించి ఇచ్చేందుకు ఆప్‌ సుముఖంగా లేదని కనిపిస్తోంది.ఆప్‌-కాంగ్రెస్‌ పొత్తుపై వస్తున్న వార్తలకు శుక్రవారం ఆప్‌ అధినేత అరవింద్‌ కేజీవ్రాల్‌ చేసిన ట్వీట్‌ మరింత ఊతమిస్తోంది. మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ను పొగుడుతూ ఆయన ట్వీట్‌ చేశారు. ఒకప్పుడు మన్మోహన్‌పై విమర్శలు చేస్తూ ట్వీట్లు చేసిన ఇప్పుడు ఆయనపై ప్రశంసలు కురిపించారు. మన్మోహన్‌ సింగ్‌ లాంటి విద్యావంతుడైన ప్రధానిని ప్రజలు కోల్పోయారని, ఇప్పుడు మళ్లీ అలాంటి ప్రధానిని ప్రజలు కోరుకుంటున్నారని కేజీవ్రాల్‌ ట్వీట్‌ చేశారు. దీంతో పొత్తుపై ఊహాగానాలు ఊపందుకున్నాయి.