తెరాసలో కేకేకు కీలక పదవి

టీఆర్‌ఎస్‌ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియామకం
హైదరాబాద్‌, జూన్‌ 17 (జనంసాక్షి) :
కాంగ్రెస్‌ నుంచి ఇటీవలే టీఆర్‌ఎస్‌  చేరిన కె. కేశవరావును పార్టీ జాతీయ వ్యవహారాల సెక్రటరీ జనరల్‌గా నియమించారు. మంగళవారం తెలంగాణభవన్‌లో కేకే బాధ్యతలు స్వీకరించనున్నారు. కాంగ్రెస్‌ పార్టీలో తలపండిన రాజకీయ నేతగా ఉన్న కె. కేశవరావు అనుభవాన్ని ఏవిధంగా ఉపయోగించుకోవాలో తెలుసని ప్రకటించిన కేసీఆర్‌ ఈమేరకు కేకేను జాతీయ వ్యవహారాల సెక్రటరీ జనరల్‌గా నియమించడంతో కీలక బాధ్యతలు కట్టబెట్టారు. జాతీయ స్థాయిలో కేకేకు కాంగ్రెస్‌ నేతలతో ఉన్న అనుబంధం, స్నేహాన్ని రంగరించి తెలంగాణపై మరింత ఒత్తిడి తెచ్చేందుకు ఆయనకు జాతీయ వ్యవహారాలు కట్టబెట్టారని సమాచారం. పార్టీలో చేరిన సీనియర్లను ఏ విధంగా అడ్జస్ట్‌ చేస్తాడని ఇంతకాలం ఎదురుచూస్తున్న నేతలకు కేసీఆర్‌ సరైన రీతిలో ప్రయోజనం కల్పించారు. ఇంతకాలం ఒంటిచేత్తో అనేక రకాల కార్యక్రమాలు చేస్తున్న కేసీఆర్‌ టీడీపీ, కాంగ్రెస్‌లనుంచి వచ్చిన సీనియర్లు ఒక్కొక్కటిగా బాధ్యతలు అప్పగిస్తూ కాస్తా ఒత్తిడి తగ్గించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఇందులో బాగంగానే కడియం శ్రీహరికి పార్టీ కార్యక్రమాల్లో కీలక బాధ్యతలు అప్పగించారు. కార్యకర్తలకు శిక్షణనిచ్చే కమిటీకి చైర్మన్‌గా నియమించారు. ఆ తర్వాత కేకేను జాతీయ వ్యవహారాల సెక్రటరీ జనరల్‌గా నియమించారు.