తెరాస ఎమ్మెల్సీ అభ్యర్థులుగా దేవీప్రసాద్‌,నరెందర్‌రెడ్డి

2

హైదరాబాద్‌,ఫిబ్రవరి20(జనంసాక్షి): తెరాస ఎమ్మెల్సీ అభ్యర్థులుగా టీఎన్జీవోనేత దేవీ ప్రసాద్‌, నల్గొండ జిల్లా తెరాస నేత నరేందర్‌ రెడ్డిలకు తెరాస అవకాశం కల్పించనుంది. శనివారం అందుబాటులో వుండాలని సీఎం కేసీఆర్‌ వారిరువురికి సూచించారు. దేవీ ప్రసాద్‌ సాగునీటిశాఖలో టెక్నికల్‌ విభాగంలో పనిచేస్తున్నారు. ఈనేపథ్యంలో స్వచ్ఛంద పదవీ విరమణకు దరఖాస్తు చేసుకున్నరు. తెలంగాణలో శాసనమండలికి ఎన్నికల సంఘం గురువారం నోటిఫికేషన్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. హైదరాబాద్‌, రంగారెడ్డి మహబూబ్‌నగర్‌, వరంగల్‌, నల్గొండ, ఖమ్మం జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గాల ఎన్నిక నిమిత్తం  25వ తేది వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. వచ్చే నెల 16న పోలింగ్‌ జరగనుండగా, 19న ఓట్ల లెక్కింపు ఉంటుంది. అయితే మార్చి 16న ఇంటర్‌ పరీక్షలు ఉన్న నేపథ్యంలో పోలింగ్‌ తేదిని ఒక రోజు ముందుకు జరపాలని రెండు రాష్ట్ర ప్రభుత్వాలు విజ్ఞప్తి చేశాయి. ఈ మేరకు రెండు రాష్ట్ర ప్రభుత్వాల ప్రతిపాదనను రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కేంద్ర ఎన్నికల సంఘానికి పంపారు. ఎన్నికల సంఘం దీనిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఇక త్వరలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ను రాష్ట్ర ఎన్నికల సంఘం సడలించింది. ఓటర్లు అయిన గ్రాడ్యుయేట్లు, టీచర్లను ప్రభావితం చేసే నిర్ణయాలు కాకుండా ఇతర పథకాలను ప్రవేశపెట్టడానికి తెలంగాణ ప్రభుత్వానికి వెసలుబాటు కల్పించింది.