తెలంగాణకు జాతీయ ప్రాజెక్టు ఇవ్వండి

3 copy

– నాలుగు వరాలు కోరిన సీఎం కేసీఆర్‌

మెదక్‌,ఆగస్టు 7(జనంసాక్షి): తెలంగాణ ఎదుర్కొంటున్న సాగునీటి సమస్యను అధిగమించడానికి కనీసం ఒక్క జాతీయ ప్రాజెక్టునైనా కేటాయించాలని ప్రధాని మోడీకి సీఎం కేసీఆర్‌ విజ్ఞప్తి చేశారు. జాతీయ ప్రాజెక్టుతో పాటు ఎయిమ్స్‌, ఐఐఏంను కూడా కేటాయించామని సీఎం కోరారు. రాష్ట్రానికి మంజూరైన ఐటీఐఆర్‌ ను త్వరగా ప్రారంభించేలా చూడాలని విన్నవించారు. తొలిసారిగా తెలంగాణకు విచ్చేసిన ప్రధాని నరేంద్రమోడీకి, కేంద్ర మంత్రులకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ హృదయపూర్వక స్వాగతం పలికారు. బీజేపీ సహకారంతోనే తెలంగాణ సాకారమైందని సీఎం అన్నారు.కోమటిబండలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం మాట్లాడుతూ.. ‘మిషన్‌ భగీరథ మహత్తర కార్యక్రమం. కృష్ణా, గోదావరి జలాలను శుద్ధి చేసి ప్రజలందరికీ స్వచ్ఛమైన తాగు నీరు అందించడమే లక్ష్యం. ఈ ప్రయత్నంలో తొలి అంకాన్ని ప్రధాని సువర్ణ హస్తాలతో ప్రారంభించారు. ఈ రోజు తెలంగాణ ప్రజలందరికీ శుభదినం.1200 మెగావాట్ల జైపూర్‌ థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌ను జాతికి అంకితం చేశారు. రామగుండం ఎరువుల కర్మాగారం పునఃప్రారంభాన్ని స్వాగతిస్తున్నాం. ఉత్తర తెలంగాణ ప్రజల స్వప్నం కొత్తపల్లి – మనోహరాబాద్‌ రైల్వేలైన్‌ కు శంకుస్థాపన చేయడం సంతోషంగా ఉంది. పన్నుల్లో రాష్ట్రాల వాటా 42 శాతానికి పెంచినందుకు మోడీకి కృతజ్ఞతలు. తెలంగాణలో జాతీయ రహదారుల శాతం మోడీ ప్రభుత్వం వల్లే 4 శాతానికి పెరిగింది. హైదరాబాద్‌ను మినహాయించి మిగతా 9 జిల్లాలను వెనుకబడిన జిల్లాలుగా ప్రకటించినందుకు కృతజ్ఞతలు. ప్రతి జిల్లాకు వెనుకబడిన జిల్లా నిధుల కింద రూ. 50 కోట్లు మంజూరు చేశారు. హడ్కో రుణం మంజూరుకు సహకరించిన వెంకయ్యనాయుడుకు ధన్యవాదాలు.దేశంలో అవినీతి రహిత పాలన అందిస్తున్న మోడీ గురించి ఎంత చెప్పిన తక్కువే. భూతద్దం వేసి చూసినా మచ్చలేని స్వచ్ఛమైనది మోడీ ప్రభుత్వం. తెలంగాణకు అనేక విషయాల్లో కేంద్రం నుంచి సహకారం లభిస్తుంది. కేంద్రం నుంచి మంత్రులందరూ రాష్ట్రానికి చేయూతనిస్తున్నారు. జాతీయ రహదారుల నిర్మాణానికి రాష్ట్రంలోనే కేంద్రం శ్రీకారం చుట్టింది. టీఎస్‌ ఐపాస్‌ ద్వారా అత్యుత్తమైన పారిశ్రామిక విధానం రూపొందించాం. పారిశ్రామిక రంగానికి వెన్నుదన్నుగా మా ప్రభుత్వం నిలుస్తోంది. ఐటీ రంగంలో ప్రథమ స్థానం చేరుకోవడానికి వేగంగా ముందుకెళ్తున్నాం.బీజేపీ సహకారంతోనే తెలంగాణ కల సాకారమైంది. తెలంగాణ రాష్ట్రం.. వెనుకబడిన ప్రజలు అధికంగా ఉన్న రాష్ట్రం. ప్రధానిగా విూ ప్రేమ, ఆశీర్వాదాలు అందించాలని కోరుతున్నా. తెలంగాణ చేపట్టే ప్రతి పనిలో మోడీ ప్రేమ, సహకారం కావాలి. మోడీ ప్రేమ, ఆశీర్వాదం ఉంటే తెలంగాణ నెంబర్‌-1 అవుతుంది. తెలంగాణ రాష్ట్రంలో 80 శాతానికి పైగా ఓబీసీలు, దళితులున్నారు. వెనుకబడిన తరగతుల అభివృద్ధికి నిరంతరం సాయం ఆశిస్తున్నాం. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ గురించి నేను విూకు కొత్తగా చెప్పేది ఏవిూ లేదు. విూ తోడ్పాటుతో జాతి నిర్మాణంలో పాలు పంచుకుంటాం. రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాల కోసం ఏడాదికి రూ. 30 వేల కోట్లు ఖర్చు పెడుతున్నామని’ సీఎం పేర్కొన్నారు.